Monday, 29 June 2015

'తెలంగాణ' హరిత మణిహారం!

పొగలు కమ్మేస్తున్న పరిసరాలు.. దుమ్మురేపుతున్న రోడ్లు.. హరితవనాల్లాంటి ఊర్లు కాంక్రీట్ జంగల్స్‌గా.. బూడిద దూళితో సహవాసం చేస్తున్నాయి.. దీన్నిలా వదిలేస్తే.. వానలు వెనకడుగువేస్తాయి. పంటలు కంటనీరు పెడతాయి! రండి.. తెలంగాణ మణిహారం.. హరితహారంలో భాగస్వాములమవుదాం.. గొప్ప సంకల్పానికి సహకారమందించి హరిత తెలంగాణ ను నిర్మించుకుందాం. మొక్కలు నాటడాన్ని రెస్పాన్సిబుల్.. ప్యాషన్.. ట్రెండ్‌గా మార్చుకొని తెలంగాణను గ్రీన్ కవర్‌గా మార్చేద్దాం! 
తెలంగాణకు నిలిచి.. కురిసే వానలు వాపస్ రావాలె. ఊర్లల్ల ఉంటున్న కోతులు అడవికి వాపస్ పోవాలె నినాదంతో హరితహారాన్ని సాకారం చేసేందుకు నడుంబిగించారు సీఎం కేసీఆర్. పచ్చదనమే పుడమికి అందం.. చెట్లతోనే జీవకోటి మనుగడ సాధ్యం అనేది ఈ ప్రాజెక్ట్ ఫార్ములా. మూడేళ్లలో రాష్ట్రమంతటా 230 కోట్ల మొక్కలు నాటి తెలంగాణకు హరితహారాన్ని అలంకరిస్తారు. జులై 3వ తేదీన యాదాద్రి నుంచి 10వ తేదీ వరకు హరితహారం వారోత్సవాలు పేరిట అన్ని జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ బాధ్యతను మనపై వేసుకుని కేసీఆర్ మానస పుత్రిక హరితహారాన్ని సక్సెస్ చేయాల్సింది మనమే! అందుకే ఇప్పుడెక్కడ చూసినా.. విద్యార్థులు.. అధికారులు.. ప్రజాప్రతినిధులు ఈ తెలంగాణకు హారాన్ని అలంకరించే పనిలో బిజీగా ఉన్నారు. 
సంస్కృతిగా..
పర్యావరణ పరిరక్షణ ఓ సంస్కృతిగా మారాలి. తెలంగాణ మొత్తం హరితహారం కావాలి. పారిశ్రామిక అనివార్యమైన పరిస్థితుల్లో ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వర్షాభావ పరిస్థితులకు.. కరువు కాటకాలకు అడవి లేకపోవడమే కారణం కాబట్టి.. ఈ స్పృహ, అవగాహన ప్రజల్లో రావాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థల్లో హరితహారం ప్రోగ్రామ్సే ఎక్కువగా జరుగుతున్నాయి. స్కూల్స్.. కాలేజెస్‌లో ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభంలో వెల్‌కమ్ పార్టీస్.. ఫ్రెషర్స్ పార్టీస్ మాత్రమే చూశాం. కానీ గత వారం రోజులుగా ఏ కాలేజ్‌లో.. స్కూళ్లో చూసినా గ్రీన్ కవర్ ప్రోగ్రామ్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. హరితహారాన్ని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ కల్చర్‌గా తీసుకెళ్లాలనే ప్రభుత్వ ఆలోచనలో మేముసైతం అంటూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాం అని చెప్పారు జాగృతి ఇంజినీరింగ్ కాలేజ్ సెక్రెటరీ ఎస్.వెంకటేశ్వర్లు. మొక్కల ఆవశ్యకత గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. నర్సరీ స్టేజ్‌లో తెలియాల్సింది ఎంబీఏ చదివే స్టేజ్‌లో తెలిసింది. అయినా చెట్లే మానవ మనుగడకు మూలం అని తెలుసుకుని కాలేజ్‌లో.. ఇంటివద్దా ఈ యాక్టివిటీస్‌లో ముందుంటున్నాం అని పేర్కొన్నారు శ్రీఇందు ఇంజినీరింగ్ కాలేజ్ ఎంబీఏ స్టూడెంట్ రాఘవేంద్ర సాయి. 
పూలబాటగా..
బంగారు తెలంగాణకు హరితహారం పూలబాట. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌజ్ గ్యాసెస్ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అనేక దేశాల్లో ఈ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నాయి. భూగోళంపై ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ కవర్ కార్యక్రమాలు చేపడుతున్నారు. హరితహారం కూడా అలాంటిదే. ఇకపై మనం హరితం.. శివం.. సుందరం అని స్మరించుకోవాలి అనేది ప్రభుత్వ ఆశయం. పోయిన అడవులకు పూర్వ వైభవం తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశం. ఉపాధిహామీతో అనుసంధానం చేసి తో ఈ పథకం నడుస్తుంది. ఈ ఏడాది ప్రతీ నియోజకవర్గానికి 20లక్షలు.. ప్రతి గ్రామానికి 40వేల మొక్కలు నాటి బంగారు తెలంగాణకు పూలబాట వేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనిత. చైనా ప్రజలు గోబీ ఎడారి విస్తరించకుండా వందల కోట్ల మొక్కలు నాటారు. గోబీ ఎడారిని స్ఫూర్తిగానే మన ముఖ్యమంత్రి హరితహారానికి అంకురార్పణ చేశారు. చెట్లు పెంచితే వర్షాలు పడుతాయి. చెరువులు నిండుతాయి. పంటలు పండుతాయి అని పర్యావరణవేత్త పుట్టపాక రామారావు వివరించారు. 
సైనికుల్లాగా..
సైనికుల్లా పనిచేసే సామాజిక కార్యకర్తలు, విద్యార్థులే రితహారం విజయవంతం కావడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. పిల్లల భవిష్యత్ కోసం హరితహారం సైనికులు కవాతుల్లా తరలిరావాలని కోరుకుందాం. 
    బడుల్లో మాకు.. గుడుల్లో పూజారులు.. మసీదులో ముల్లాలు.. చర్చీల్లో పాస్టర్‌లకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఉద్యమం కూడా పిడికెడు మందితోనే స్టార్ట్ అయి కోట్లాది ప్రజల భాగస్వాములై ఉవ్వెత్తున్న తీసుకెళ్లాం. తెలంగాణకు హరితహారం కూడా ఓ ఉద్యమంలాంటిదే. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ సంబంధ కార్యక్రమం అని అన్నారు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌గౌడ్. ఇన్ని కోట్ల మొక్కలు నాటడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రపంచ భూభాగంలో 33శాతం గ్రీనరీ ఉంటేనే ప్రజలు సురిక్షితంగా ఉంటారని ప్రపంచ దేశాల సదస్సుల్లో చాలాసార్లు ప్రముఖులు ప్రసంగించిన దాఖలాలున్నాయి. కాబట్టి అటువంటి ప్రతిష్టాత్మకమైన బాధ్యతను మనపై వేసుకున్నందకు ఆరోగ్యంగా.. ప్రశాంతంగా.. సుభిక్షంగా ఉంటామని చెప్పవచ్చు అని వివరించారు రెవెన్యూ అధికారి లింగం.
ఆకుపచ్చగా
తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే హరితహారం. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 4213 నర్సరీల్లో 40కోట్ల మొక్కలు ఈ సంవత్సరం నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా అవి పెరగడానికి అవసరమైన సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలా కాకుండా రెస్పాన్సిబుల్‌గా తీసుకున్నాం అని వివరించారు రంగారెడ్డిజిల్లా సోషల్ ఫారెస్ట్ ఇబ్రహీంపట్నం రేంజ్ ప్రతినిధి వెంకట్రామమ్మ. ప్రభుత్వ దిశా నిర్దేశాల మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు జులై 3వ తేదీ నుంచి మొక్కల్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హరితవనాల రోజులొస్త్తాయి అన్నారు నర్సరీ పర్యవేక్షకుడు బి.శ్రీనివాస్‌రెడ్డి. 

No comments:

Post a Comment