Thursday, 9 July 2015

మనసుకు ఇంధనం ఆత్మ విశ్వాసం

   ఒక చిన్న మెచ్చుకోలు ఎంతో నమ్మకాన్ని పెంచుతుంది..ఒక చిన్న ప్రోత్సాహపు మాట కొండంత ధైర్యాన్నిస్తుంది..ఈ నమ్మకం, ధైర్యాలే జీవితాన్ని మలుపు తిప్పే ఆత్మ విశ్వాసానికి కారణం కావచ్చు. ఆ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని అరచేతికి అందించనూవచ్చు.
      ఆత్మవిశ్వాసం లేదా ఆత్మాభిమానం అంటే మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమ, అభిమానం, శ్రద్ధ, విలువ వంటివన్నీ కూడా మనకి మనం చేసుకోవడం. మన గురించిన మన అభిప్రాయం సమయానుసారం మారుతుంటుంది. ఆత్మవిశ్వాసం అనేది జీవితకాలమంతా ఒకే విధంగా ఉండదు. పరిస్థితులను అనుసరించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచుకోవచ్చు. 
     మనలో ఆత్మ విశ్వాసం పెరగడానికి దోహదం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. కానీ రెండు విషయాలు ముఖ్యమైనవి. మనలను ఇతరు అంచనా వేసే విధానం, మనలను మనం అంచనా వేసుకునే విధానం తల్లిదండ్రులు, టీచర్లు, ఇతర పెద్దవారి ప్రవర్తన మనలోని ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. 
     ఇది చిన్న పిల్లలుగా ఉన్నపుడు మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు పిల్లల పనులను మెచ్చుకోవడం కంటే విమర్షించడమే ఎక్కువగా ఉన్నపుడు వారు ఆత్మవిశ్వాసంతో పెరగడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే టీనేజ్‌లోనే జీవితం పట్ల సొంత అభిప్రాయాలు, విలువలు ఏర్పరుచుకొవడం మొదలవుతుంది. పిల్లలు పెద్దలు చెప్పిన దాన్ని వారి ప్రవర్తనను గమనించే వారి అభిప్రాయాలను విలువలను ఏర్పరుచుకుంటారు. ఎక్కువగా ఊహించడం లేదా కలల్లో బతకడం కూడా కొంత మందిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడానికి కారణమవుతుంది. తమ సామర్థ్యం ఎంత(లేదా తాము భవిష్యత్తులో ఏం కావాలి) అనే దాని గురించి ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమకు ఆదర్శంగా ఎవరో ఒకరిని తీసుకుంటారు. ఉదాహరణకు కొంత మందికి క్రీఢాకారులు స్ఫూర్తినిస్తే కొంత మందికి అకడమిక్‌గా మెరుగ్గా ఉన్నవారిని చూసి స్ఫూర్తిని పొందుతారు. 
    సాధారణంగా తమలో ఏ సామర్థ్యం ఉందని భావిస్తారో అలాంటి సామర్థ్యాలున్న వారినే తమకు ఆదర్శంగా తీసుకుంటారు. ఉదాహరణకు చాలా త్వరగా స్నేహితులతో కలిసిపోవడం అనేది ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. వారిలో లేని సామర్థ్యాలు కలిగిన వారిని ఆరాధించే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. అయితే దురదృష్ట వశాత్తు ఆత్మ న్యూనత తో బాధపడే వారందరిలోనూ సామర్థ్యానికి ఎలాంటి లోటు ఉండదు. కానీ అది వారిని వారు సరిగ్గా అంచనా వేసుకోలేక పోవడం వల్ల వస్తుంది సమస్యంతా.
ఆత్మ విశ్వాసం పెంపొందించుకునే మార్గాలు
* వ్యతిరేక భావనలను గుర్తించాలి - మీలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లేందుకు కారణమైన విషయాలను, సందర్భాలను, భావనలను గుర్తించాలి. అందువల్ల మీలో ఉన్న వ్యతిరేక భావనలను మీరే గుర్తించగలుగుతారు. ఉదాహరణకు మీరు ఒక పరీక్ష రాయలేకపోయారు (వ్యతిరేక ప్రవర్తన)అందుకు కారణం మీరు పరీక్ష కొరకు సరిగ్గా సిద్ధం కాలేదు (వ్యతిరేక నమ్మకం) అందువల్ల మీరు పరీక్ష తప్పే అవకాశం ఉంటుంది (వ్యతిరేక భావన) దీనంతటికి అంతరాలలో మీలో అంత సామర్థ్య లేదన్న (వ్యతిరేక)నమ్మకం. లేదా ఏదో పార్టీలో ఎక్కువగా తాగుతారు (వ్యతిరేక ప్రవర్తన) అది మీరు అందంగా లేకపోవడం వల్ల మీతో ఎవరు మాట్లడరేమో అనే ఆందోళనను దూరం చేసుకోవడానికి (భావన) 
* మీలోని వ్యతిరేక భావనలను సవాలు చెయ్యాలి - మనలను మనం ఉన్నదున్నట్టుగా అంగీకరిస్తామని అనుకుంటాము కానీ మనం అది నిజం కాదు. మీరు మీలోని వ్యతిరేక భావనలను గుర్తించి వాటిని లాజికల్‌గా విశ్లేషించుకొని అది నిజమేనా అని ఒకసారి ఆలోచించాలి. దానికి వ్యతిరేకంగా గట్టి ఆధారాలను వెతకాలి. ఉదాహారణకు మీరు మీకు తెలివైన వారిగా అనిపించడం లేదు, కానీ మీరు మీ పరీక్షలన్నీ కూడా పాసైపోయారు, క్లాస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మీరు తెలివైన వారుగా మీకు అనిపించిన అన్ని సందర్భాలను గుర్తు చేసుకోవాలి. 
మీతో మీరు అనుకూలంగా మాట్లాడుకోవాలి - మీతో మీరు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం వల్ల ఆత్మ విశ్వాసానికి చాలా నష్టం వాటిల్లుతుంది. మిమ్మల్ని మీరు విమర్శించుకోవాల్సి వచ్చినపుడు ఎవరైనా స్నేహితుడు తప్పుచేసినపుడు ఎలా విమర్శిస్తామో అలా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, మీ పట్ల మీరు కరుణతో అనుకూల ధోరణితో వ్యవహరించాలి. ఎదుటి వారు మెచ్చుకునే మెచ్చుకోళ్లను ఆనందంగా స్వీకరించాలి. మీలో ఉన్న మంచి లక్షణాలను గర్తించి వాటిని తలచుకొని గర్వించాలి.
* ఇతరులతో పోల్చుకోవద్దు - ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమే కాదు జీవితంలో సంతోషం కూడా మిగలదు. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం కాకుండా ఇతరులను నిశితంగా గమనిస్తుండాలి. మీలోని ఉన్న మంచి లక్షణాల మీద దృష్టి నిలపాలి. మీలో లేని వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. గతంలో మిమ్మల్ని ప్రస్తుతపు మీతో పోల్చుకొని ఎంత మెరుగ్గా ఆలోచించగలుగుతున్నారు, పనులు ఎంత సమర్థవంతంగా పూర్తి చెయ్యగలుగుతున్నారు అన్న దాని మీద దృష్టి నిలపాలి. ఇది మీలో ఆత్మవిశ్వాసం నింపుకోవడానికి దోహదం చేస్తుంది.
* పూర్తి చెయ్యడం మీద దృష్టి నిలపాలి - పనులన్నీ పర్‌ఫెక్ట్‌గా చెయ్యడం గురించి కాకుండా పూర్తి చెయ్యడం మీద దృష్టి నిలపాలి. పర్‌ఫెక్ట్‌గా చెయ్యాలన్న ఆలోచనతో అసలు పనులు ప్రారంభించనే ప్రారంభించరు కొందరు. ఉదాహారణకు 10 కిలోల బరువు తగ్గితే తప్ప నేను ఆడలేను అనుకంటారు. అలా కాకుండా వీలైనంత వరకు ఆడుతుండాలి. 
అపజయాలన్ని విజయానికి సోపానాలు - తప్పులు చెయ్యడం, అపజయాలు ఎదురవడం అనేది సాధారణ విషయం అని అనుకోవాలి. అపజయాలు, తప్పులు నేర్చుకోవడంలో భాగం. చేసిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవడం ముఖ్యం. తప్పులు చెయ్యడం మీ సామర్థ్యానికి ప్రతీకగా భావించకూడదు. నేను వెయ్యిసార్లు అపజయం పాలైనట్టుగా అనిపించలేదు నాకు కానీ అపజయాలకు వెయ్యి మార్గాలున్నాయని తెలుసుకున్నాను. అనే ఎడిసన్ మాటను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. మీరు ఆపని చెయ్యడానికి ఎంత అంకితభావంతో కృషి చేశారనే దాన్ని గుర్తుపెట్టుకోండి. 
* కొత్త పనులు ప్రయత్నించండి - రకరకాల కొత్త పనులు చెయ్యడానికి ప్రయత్నించండి. అందువల్ల మీలో దాగి ఉన్న సామర్థ్యాలు బయటపడుతాయి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. 
* మీలో మార్చుకోవాల్సిన వాటిని గుర్తించండి - మీలో మీరు మార్చుకోగలిగి మార్చుకోవాల్సిన అంశాలను గుర్తించి మార్చుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది. మార్పును ఆహ్వానించడం ఈరోజే మొదలు పెట్టండి. మీలో మార్చుకోలేని విషయాల (ఎత్తు, అందం వంటివి) గురించి పెద్దగా పట్టించుకోకూడదు. 
* లక్ష్యాలను నిర్ణయించుకోవడం - మీరు సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. స్పష్టంగా కనిపించే, సాధించగలిగే లక్ష్యాలను నిర్దేషించుకోవాలి. మీరు ఎంత వరకు మీ లక్ష్యానికి చేరువగా వచ్చారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి చూసుకోవడం ద్వారా జరుగుతున్న ప్రగతి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 
* మీ అభిప్రాయాలను అవసరమున్న చోట తెలియజేయడానికి వెనుకాడకూడదు. 
* మీ వంతు సాయం అందించండి - మీ కష్టంలో ఉన్న మీ తోటి వారికి సాయం చెయ్యండి. ఒక మంచి కారణం కోసం పరుగెడుతున్న వారితో కలిసి పాలుపంచుకోండి, ఏదైనా సామాజిక సేవా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనండి. 
వ్యాయామం- వ్యాయామం చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. నేను ఇంకా కొంచెం సన్నగా ఉండి ఉంటే నాకు ఎక్కువ మంది స్నేహితులుండి ఉండేవారు వంటి ఆలోచన ఎప్పుడూ చెయ్యకూడదు. మీకు నచ్చిన వారితో సమయం గడపండి, మీకు నచ్చిన పనులు చేస్తూ ఆనందించండి మీరు చేసే ప్రతి పనిలోనూ మీ ఆత్మవిశ్వాసం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మసలే వారు స్కూల్‌లోనూ, పనిచేసే చోట చాలా సమర్థవంతంగా ఉంటారు. అంతేకాదు చాలా త్వరగా మనుషులతో కలిసిపోతారు, కొత్త స్నేహితులను చేసుకోగలుగుతారు. వారి మానవసంబంధాలు కూడా సమర్థవంతంగా ఉంటాయి. చాలా త్వరగా తప్పులను తెలుసుకోగలుగుతారు, అసంతృప్తులను, అపజయాలను అధిగమించగలుగుతారు. వారు విజయం సాధించే వరకు ఏ పనిని వదిలిపెట్టరు. 
   ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కొద్దిగా కష్టం కావచ్చు. కానీ ఒక్కసారి దాన్ని సాధిస్తే జీవితాన్ని ఆనందంగా గడపడం సాధ్యపడుతుంది. కొన్ని సార్లు చాలా లోతుగా మనసు గాయపడినపుడు ఆత్మవిశ్వాసం కోల్పోవడం సాధారణమే. అలాంటి సందర్భాలలో నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.

No comments:

Post a Comment