Thursday, 23 July 2015

తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ!

* టీఎస్‌ఐపాస్ రెండో దశలో 19 కంపెనీలకు అనుమతిపత్రాలు
* స్వయంగా అందజేసిన సీఎం కేసీఆర్
* రాష్ర్టానికి 1087.37 కోట్ల పెట్టుబడులు
*  కొత్త కంపెనీలతో 5,321 మందికి ఉపాధి
* కంపెనీ ఏర్పాటుకు ముందుకువచ్చిన
* ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ కెమో 
* మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు
* పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పారిశ్రామిక అనుమతుల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలోని చేజింగ్‌సెల్ ఇన్‌చార్జి, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారిని సంప్రదిస్తే పరిష్కరిస్తారని పేర్కొన్నారు. 
     తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ను అమలులోకి తెచ్చిన తర్వాత రెండో దఫాగా మరో 19 కంపెనీల సీఎండీలు, సీఈవోలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా అనుమతి పత్రాలు అందజేశారు. కొత్తగా ఏర్పాటుచేయనున్న ఈ పరిశ్రమలతో రాష్ట్రానికి రూ.1087.37 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా 5,321 మందికి ఉపాధి కల్పించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఈ కంపెనీలను నెలకొల్పనున్నారు. 
కొత్తగా నెలకొల్పనున్న కంపెనీల్లో హెలికాప్టర్ క్యాబిన్ కిట్ , సెల్‌ఫోన్, పాదరక్షల తయారీతోపాటు ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ కంపెనీలు ఉన్నాయి. బుధవారం అనుమతి పత్రాలు పొందిన కంపెనీల్లో స్పెయిన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ కెమో సైతం ఉండడం విశేషం. ఈ కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చేజింగ్ సెల్ ఇన్‌చార్జి శాంతకుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, పరిశ్రమలశాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితోపాటు ఎస్‌ఆర్ బ్రహ్మాస్ అగ్రోప్రొడక్ట్స్ చైర్మన్ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిసహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. టీఎస్‌ఐపాస్‌ను అమలులోకి తెచ్చిన తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుమతుల మంజూరులో ఎటువంటి జాప్యం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ప్రకటించిన రోజు పేర్కొన్న ప్రకారం దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రికార్డు స్థాయిలో తొలిదశలో జూన్ 23న మొదటి దఫా కంపెనీలకు అనుమతిపత్రాలు మంజూరు చేశారు. అదేజోరును కొనసాగిస్తూ సరిగ్గా నెలతిరగకముందే మరో 19 కంపెనీలకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిపత్రాలు అందజేయడం పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. (- నమస్తే తెలంగాణ)

No comments:

Post a Comment