Tuesday, 21 July 2015

ఆధార్‌లేని ఓటు ఔట్

* నగరంలో 15 లక్షల బోగస్ ఓట్లు..
* ఏరివేతలో ఎన్నికల సంఘానికి సహకరిస్తాం
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌తో సమావేశం 
*  ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానిస్తాం
* అనుసంధానం లేకుంటే ఓటు హక్కు ఉండదు
* హైదరాబాద్‌లో ముందుగా అమలు.. 
* 15-20 రోజుల్లో పూర్తి చేస్తాం: సీఎం కేసీఆర్
     రాజధాని హైదరాబాద్‌లో ఆధార్ నంబరుతో అనుసంధానం కాని ఓటర్లకు ఓటు హక్కు ఉండదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఓటరుకార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ముందుగా హైదరాబాద్‌లో అ కార్యక్రమం చేపట్టి 15 నుంచి 20 రోజుల్లో అనుసంధానం చేపడతామన్నారు.
ఒకటికి రెండుసార్లు అవకాశమిచ్చి ఆ తర్వాత అనుసంధానం చేయని ఓట్లు తొలగిస్తామని ఆయన చెప్పారు. 
       హైదరాబాద్ నగరంలో దాదాపు 15 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన వివరించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆధార్‌తో ఓటరు కార్డుల అనుసంధానంపై చర్చ జరిగింది. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలో పూర్తిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామన్నారు. ముందు హైదరాబాద్‌లో, తరువాత రాష్ట్రమంతా ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్‌ను అనుసంధానం చేస్తామన్నారు. నగరంలో ఈ కార్యక్రమాన్ని 15 నుంచి20 రోజుల్లోనే వందశాతం పూర్తిచేస్తామని చెబుతూ.. హైదరాబాద్‌లో ఆధార్ నంబరుతో అనుసంధానం కాని ఓటర్లకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోనే అత్యధికంగా బోగస్ ఓటర్లు..
హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది బోగస్ ఓటర్లుండే అవకాశం ఉన్నందున, మొదట ఇక్కడే పని ప్రారంభించాలని సీఎం కోరారు. ఇక్కడే దాదాపు 15 లక్షల మందికి బోగస్ ఓటర్లున్నట్టు అంచనా ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66% ఓటర్లుండాల్సి ఉండగా.. హైదరాబాద్‌లో ఆ శాతం చాలా ఎక్కువగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున, అంతకన్నా ముందే ఓటర్ల జాబితా రూపొందించాలని కోరారు. 
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుండగా 24 హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఈ బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. రాజకీయ పార్టీలుకూడా సహకరించాలని అభ్యర్థించారు. ఆధార్‌తో అనుసంధానంకాని వారికి ఒకటికి రెండుసార్లు విజ్ఞప్తి చేయాలని, అయినా అనుసంధానం చేసుకోకుంటే.. జాబితా నుంచి పేర్లు తొలగించాలని అన్నారు. సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాలని సీఎం చెప్పారు. సమావేశంలో సీఎస్ రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారిలు పాల్గొన్నారు. (-నమస్తే తెలంగాణ)


No comments:

Post a Comment