Saturday, 25 July 2015

తెలంగాణలో కొలువుల జాతర!

* 15 వేల ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా
* వయో పరిమితి పదేళ్ల పెంపు
* ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 15 శాఖల్లో ఖాళీగా ఉన్న 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై సీఎం జులై 25న సంతకం చేశారు. గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచారు. ప్రస్తుతం 34 ఏళ్లు పరిమితి ఉండగా దానిని 44 ఏళ్లకు పెంచాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని నిరుద్యోగులకు మేలు కలిగించే రీతిలో పదేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. నలభై రోజుల వ్యవధిలో ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జాబితాను రూపొందించి సీఎంకు సమర్పించారు. దానిని పరిశీలించిన సీఎం 25వ తేదీన తక్షణమే భర్తీ కావాల్సిన 15 వేల పోస్టులకు ఆమోదం తెలిపారు. నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కానిస్టేబుల్, ఎస్ఐ సహా పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 8,000 ఖాళీలను, విద్యుత్ శాఖలో 2,681 ఖాళీలను భర్తీ చేయనుండగా... వ్యవసాయం, ఉద్యానవనాలు, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రోడ్లు భవనాలు, రవాణా, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోనివి 4,300 కొలువులను భర్తీ చేయనున్నారు. దాదాపు పదేళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులకు పండగనే చెప్పాలి.
రెండు జోన్లలో...
జోనల్ వ్యవస్థ యథాతథంగా కొనసాగనుంది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి, స్థానిక, స్థానికేతర కేటగిరీని అమలు చేస్తారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. జోనల్ విధానంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర నిబంధనల మేరకు నియామకాలు జరపాలని సూచించారు.
ఏ శాఖలో ఎన్ని...
* పోలీసు, అగ్నిమాపక శాఖ: 8,000
* విద్యుత్ శాఖ: 2,681
* ఇతర శాఖలు: 4,300
వేటి ద్వారా భర్తీ?
* పోలీసు ఉద్యోగాలు రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ ద్వారా జరుగుతాయి.
* విద్యుత్‌శాఖ ఉద్యోగాలను జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు భర్తీ చేస్తాయి.
* మిగిలిన ఖాళీల భర్తీ టీఎస్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా జరుగుతుంది. పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా పరీక్షల నిర్వహణ ఇతర అంశాలకు సీఎం సూత్రప్రాయ ఆమోదం తెలిపారు.
త్వరలో మరి కొన్నింటికి ఆమోదం..
మొదటిదశ ఆమోదించినవి కాకుండా వారం రోజుల్లో మరో 10,000 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలపనున్నారు. దీనికి సంబంధించిన జాబితా సిద్ధమవుతోంది. అది అందగానే సీఎం ఆమోదం తెలపనున్నారు.

No comments:

Post a Comment