* పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ
* ఐడీహెచ్ కాలనీ ప్రారంభోత్సవం
* 10వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసే అవకాశం
హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కనివిని ఎరుగనిరీతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు నిజమైన పండుగలా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటివరకు పేదలు ఎక్కడైనా గుడిసెలు వేసుకుంటే కూల్చిన సందర్భాలే తప్ప వారికి అండగా నిలిచిన ప్రభుత్వాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మన రాష్ట్రంలో మన పాలన ఎలా ఉంటుందో ప్రజలు ఆస్వాదిస్తున్నారు.
125 గజాలలోపు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇండ్లు కట్టుకుంటే ఆ భూములను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నాయకత్వాన ఏర్పడిన తెలంగాణ తొలి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో 58 విడుదల చేసింది. 3 లక్షల మందికిపైగా పేదలకు తమ భూమిని క్రమబద్దీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. మొదటి విడతగా హైదరాబాద్‌లోనే లక్ష భూ క్రమబద్దీకరణ పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం లక్ష మందికి పట్టాలు సిద్ధం చేసింది.
* ఈ పట్టాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పేదలకు అందజేయనున్నారు. ఐడీహెచ్ మోడల్ కాలనీ ఇండ్లను ప్రారంభించి, అక్కడి పేదలకు గృహ ప్రవేశం కల్పిస్తారు. ఇప్పటికే ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఇండ్లు గృహనిర్మాణ పథకానికి మోడల్ కాలనీగా మారాయి. నిరుద్యోగులకు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి రాష్ట్ర ఆవిర్భావ ఫలాలు అందనున్నాయి. జూన్ 2వ తేదీన 10 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.