Friday, 4 October 2013

బతికించే అమ్మ ‘బతుకమ్మ’

                               
తెలంగాణ ఆడపడుచులు ఆడుతూ, పాడుతూ తమ జానపద సాహిత్యం జోడించి ఆబాల గోపాలాన్నీ అలరించేదే బతుకమ్మ పండుగ.
             వినోదాత్మక ప్రభోద గీతాలను ఆలపిస్తుండగా జానపదమంతా భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ పండుగలో తొలినాడు ఎంగిలి పువ్వులతో మొదలుపెట్టి, ఆఖరి రోజున పసుపు ముద్దను గౌరమ్మగా భావించి ఊరి బయటకు కోలాహలంగా స్త్రీలందరు ముఖ్యంగా ముత్తయిదువలు పళ్ళాలతో పోటీ పడి ఒకరికన్నా ఒకరు పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి మురిసిపోతారు.
           బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెల్లో ఉండే ఆడవారికి ముఖ్యంగా పిల్లల నుండి మధ్య వయస్కుల వరకు అందరికీ సందడే సందడి. హడావుడిగా పొద్దుపొద్దున లేచి పోటీ పడుతూ తంగేడు పూల వేటకై గుంపులు గుంపులుగా బయలుదేరుతరు. గడ్డిపూలు, సోయపూలు, నూగుపూలు తీసుకొచ్చి రంగులు వేసి సిద్ధం చేసుకుంటరు. ఇక బతుకమ్మను పేర్చడంలో ముత్తయిదువలు ఎంతో నేర్పరితనం చూపిస్తరు. గుండ్రని పెద్ద పళ్ళెం తీసుకొని అడుగున లేత తంగేడు ఆకులను పరచి, ఆపైన తంగేడు పూలు, ఒక వరుసలో గడ్డిపూలు, మరో వరుసలో... ఇలా ఓపిక ఉన్నంత వరకు రంగు రంగుల బతుకమ్మలను గోపురంలా పేర్చి ఆపైన పసుపు ముద్దను గోపుర ఆకారం చేసి పెడతరు. 
           దాంతోపాటు చిన్న బతుకమ్మను పేరుస్తరు. జానపద పాటలు, కోలాటాలు, కథలు గుర్తుకు తెచ్చుకుంటూ మునిసంధ్య వేళలో ఆడవాళ్ళు అందంగా తయారై ఒకరినొకరు పలకరించుకుంటూ వయ్యారంగా        బతుకమ్మలను రెండు చేతులతో పట్టుకొని దేవాలయ ప్రాంగణంలోకి గాని, చెరువు ఒడ్డుమీదకు కాని చేరుకుంటరు. బతుకమ్మలన్నింటినీ ఒక దగ్గర గుండ్రంగా పెట్టి వాటి చుట్టూ ఒకరి నొకరు చేతులు పట్టుకుంటూ తిరుగుతూ పద విన్యాసంలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని చప్పట్లు కొడుతూ లయాత్మకంగా ఆడుతూ, పాడుతూ వినోదిస్తరు. మరికొందరు బాలనాగమ్మ కథ, మహాలక్ష్మమ్మ కథ, కాంభోజరాజు కథ, గంగాగౌరి సంవాదం, గౌరీ కళ్యాణం లాంటి జానపద గాథలను గానం చేస్తారు.
         ఇంకొందరు కోలాటాలాడుతూ ఆనందిస్తుంటారు. దినమంతా పడిన కష్టాన్ని మరచిపోయి ఆటపాటలతో ఆనందంగా గడిపేస్తారు. ఈ అమాయక పల్లె జీవులు, ప్రపంచీకరణం వచ్చి పడ్డా మన సంస్కృతిని కాపాడుకుంటూ పండుగలు, పబ్బాలు జరుపుకుంటున్నారు.
పండుగ మంగళగౌరీ వ్రతం కనుక మహిళలు తమ పసుపు కుంకుమలను కలకాలం కాపాడవలసిందిగా గౌరీదేవిని వివిధ పుష్పాలతో అలంకరించి, భక్తిక్షిశద్ధలతో పూజిస్తరు. 
        ‘మా బతుకులను కాపాడమ్మా’ అంటూ సంఘీభావంతో సమైక్యతా వాదంతో వర్గ భేదాలు లేకుండా కాలపరిస్థితులు, మార్పులను బట్టి తమ పాటలను సామాజిక చైతన్య తరంగాలుగా మార్చుకుంటున్న విధానమూ ఈ పండుగలో కనిపిస్తుంది. 
‘‘ఒక్కొక్క పూవేసి చందమామ
పలకా బలపం చేబడుదాం చందమామ
ఓనమాలు దిద్దుకుందాం చందమామ
ఒంట్లు నేర్చుకుందాం చందమామ
వేలిమువూదలు మాని చందమామ
సంతకాలు నేరుద్దాం చందమామ...’’అని,
 కొందరైతే-
‘‘ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల
బెల్టు షాపులు వచ్చె ఉయ్యాలో
సారా రక్కసిని ఉయ్యాలో
మా కొంపలే కూల్చె ఉయ్యాలో
సార రక్కసి తరమంగ ఉయ్యాలో...’’
    అంటూ సారాభూతంపై ధ్వజమెత్తుతూ తమ వ్యతిరేకతను చాటుకుంటున్నరు. 
ఇంకా నవ సమాజ నిర్మాణం కోసం ప్రపంచీకరణ పెత్తనం గురించి పాడుతూ...
‘‘పసుపు కుంకుమలు మోటాయె చందమామ
బొట్టు కాటుక కరువాయె చందమామ
బొట్టు బిళ్ళ లొచ్చె చందమామ
అమ్మనాన్న పాడాయె చందమామ
మమ్మీ డాడీ ఇంపాయె చందమామ...’’
 అంటూ తమ చేతకాని తనాన్ని వెలి బుచ్చుతున్నారు. ‘‘ఎరువు కరువొచ్చె చందమామ, కరెంటు కోతవచ్చె చందమామ, నేతన్నల బతుకులు బుగ్గి పాలాయె చందమామ...’’ అంటూ తమ కష్టాలను, గోడులను, బాధలను తెలుపుకునే వాళ్ళు మరి కొందరు.
         ఈ విధంగా ఆధునిక జీవితంలోని కష్టనష్టాలను ఏకరువు పెడుతూ తొమ్మిది రోజులు పాటలు పాడతరు. చివరి రోజున సద్దుల బతుకమ్మను అందంగా పేర్చి అగరుబత్తులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో తమ గడపలకు పసుపు కుంకుమలు ఇచ్చి, ‘‘చల్లా (మజ్జిగతో) గుమ్మాలను ఇంటి ఆడపడుచులను సుతారంగా తాకి తమ బతుకులను చల్లగా చూస్తూ కాపాడు గౌరమ్మా’’ అని వేడుకుంటరు.
        బతుకమ్మను పేర్చిన పళ్ళాలను నీళ్ళలోకి వదిలి అవి వయ్యారంగా సాగిపోతూ ఉంటే ‘‘పోయి రావమ్మా పోయి రావమ్మా, బతుకమ్మ పోయిరా గౌరమ్మా, మా బతుకులను చల్లగా చూడు తల్లి’’ అని వీడ్కోలు పలుకుతరు. 
వృత్తాంతాలు

 
           కరువు కాటకాలు సంభవించి, ఊళ్ళకు ఊళ్ళు అంతరించి పోతున్న సమయంలో ప్రజలు బతుకమ్మను ఆరాధించారని అంటారు. ప్రశాంతత నెలకొనడంతో అప్పటి నుంచి తల్లిని కొలుస్తూ రావడం, లోక కంఠకుడైన మహిషాసురుణ్ని వధించేందుకు దుర్గామాత యుద్ధం చేస్తుందని, ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని స్పృహ కోల్పోతుందని, మాత స్పృహ నుంచి తేరుకోవడానికి ‘తల్లి గౌరమ్మ... నువ్వు బతకాలమ్మా’ అంటూ వేడుకున్నారని పురాణాలు చెబుతున్నయి. 
          రాత్రింబవళ్లు కొలువగా చివరికి దశమి రోజున ఆ అమ్మవారికి స్పృహ వచ్చి, మహిషాసురుణ్ని వధిస్తుందని, అప్పటినుంచి తల్లిని బతుకమ్మగా కొలుస్తున్నట్లు ఒక కథనం ఉంది.
           మరో కథనం ప్రకారం ఒక అమ్మాయి భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఆ ఊరి ప్రజలందరూ ఆమెను మర్చిపోలేకపోయారు. అందుకే ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం తమ మనస్సులో ‘బతుకమ్మ’ అని దీవించారట. అందుకే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిందిగా భావిస్తరు. ఆమెను కీర్తిస్తూ జరుపుకొనే పండుగగా భావిస్తరు.
    ఇంకొకటి దక్షిణ భారతాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు, పునస్కారాలు చేశాడు. లక్ష్మీదేవి అనుక్షిగహంతో ఆయనకు ఒక బిడ్డ జన్మించింది. తాను అనేక గండాలను దాటింది. కాబట్టి, ఆమె పేరును ‘బతుకమ్మ’ అని నామకరణం చేశారు. ఆమె పేరు మీదే ఈ పండుగ వినుతి కెక్కిందంటరు. 
ఎక్కడ ఎలా ఉన్నా, తెలంగాణకు బతుకమ్మ ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ పండుగ. ఈ పండుగ వర్షాకాలపు చివర్లో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలవల్ల చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రంగురంగుల పూలను వరుసగా పేర్చి చెరువులలో నిమజ్జనం చేస్తరు.
     మునిసంధ్య వేళలో ఆడవాళ్ళు అందంగా తయారై ఒకరినొకరు పలకరించుకుంటూ వయ్యారంగా బతుకమ్మలను రెండు చేతులతో పట్టుకొని దేవాలయ ప్రాంగణంలోకి గాని, చెరువు ఒడ్డుమీదకు కాని చేరుకుంటరు. బతుకమ్మలన్నింటినీ ఒక దగ్గర గుండ్రంగా పెట్టి వాటి చుట్టూ ఒకరి నొకరు చేతులు పట్టుకుంటూ తిరుగుతూ పద విన్యాసంలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని చప్పట్లు కొడుతూ లయాత్మకంగా ఆడుతూ, పాడుతూ వినోదిస్తరు.
           ఈ బతుకమ్మ పండుగలో నవవిధ పుష్పాలంకరణ నవవిధ భక్తికి మూలం. నవ జీవనానికి సంకేతం. నవ వసంతానికి నాంధి. నవ చైతన్యానికి ప్రతీక. వివిధ జాతుల పూలు సమైక్యతతో వున్నట్లే, మానవులంతా కలిసి ఉండాలని ప్రబోధించే పండుగ బతుకమ్మ పండుగ.

No comments:

Post a Comment