Saturday, 29 November 2014

చందుపట్లలో రాణిరుద్రమ తుదిశ్వాస

* అంబదేవుడి చేతిలో వీరమరణం పొంది నేటికి 725 ఏండ్లు
* శాసనం వేయించిన రుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి 
* పురావస్తుశాఖ దృష్టిసారిస్తే వెలుగులోకి రానున్న చరిత్ర
    కాకతీయుల పోరు కెరటం.. ఒంటిచేత్తో రాజ్యాలను జయించిన సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి వీరగాధలు ఎన్నెన్నో. శతాబ్దాల కిందటే కత్తిపట్టి శత్రువులను తుదముట్టించి మహిళాశక్తిని నేల నలుదిశలా చాటిన పరాక్రమశాలి రుద్రమదేవి. వరంగల్ కేంద్రంగా పాలన సాగించిన రుద్రమదేవి 80 ఏండ్ల వయస్సులోనూ శత్రుసైన్యంపైకి కత్తిదూసి కదనరంగంలో కన్నుమూసింది. వీరమరణం పొందిన ప్రాంతం నేటి నల్లగొండ జిల్లాలోని చందుపట్ల అనేందుకు శిలాశాసనం ఆధారంగా నిలిచింది. ఈ శాసనం ప్రకారం 1289 నవంబర్ 27న అంబదేవుడితో జరిగిన యుద్ధంలో తుదిశ్వాస విడిచింది. ఓరుగల్లు వీరవనిత రాణిరుద్రమ మరణించి నేటికి 725 ఏండ్లు అవుతున్న సందర్భంగా మరణశాసనం వెలిసిన చందుపట్లపై ప్రత్యేక కథనం. 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన శాసనం
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్లలోకి ప్రవేశించగానే నాలుగు అడుగుల ఎత్తున్న గద్దెపై కొలువైన చారిత్రక శాసనం స్వాగతం పలుకుతుంది. సుమారు 700 ఏండ్ల కిందటిదైనా ఐదేండ్ల కిందటే దాని ప్రాధాన్యాన్ని గుర్తించారు. కాకతీయుల వీరవనిత, రాయగజకేసరి రాణీరుద్రమదేవి వీరమరణాన్ని ఈ శాసనం ధ్రువీకరిస్తున్నది. ఐదేండ్ల కిందటి వరకు శ్రావణమాసంలో బోనాల పండుగ సందర్భం గా దేవతా విగ్రహంగా ఈ శాసనం పూజలందుకున్నది. గ్రామంలోని కొందరు ఔత్సాహికులు శిలా శాసనమని గుర్తిం చి 2009 నవంబర్ 27న గద్దెపై ప్రతిష్టించారు. 
రుద్రమదేవి శివసాయిజ్యం ఇక్కడే
తండ్రికి తగ్గ తనయగా, గణపతి దేవుడి బిడ్డగా పేరు గడించి కాకతీయ సామ్రాజ్యాన్ని దిగ్విజయంగా పాలించిన రుద్రమదేవి.. అంబదేవుడి చేతిలో హతమైనట్లు త్రిపురాంతక శాస నం సూచిస్తున్నది. కాయస్థ వంశ మహారాజైన అంబదేవుడు అన్నిరాజ్యాలనూ జయించిన రాజుగా ఆ శాసనంలో కీర్తించుకున్నాడు. సర్వాన్ ఆంధ్ర మహీపతింజిత్వ రణముఖే యశోలబ్దవాన్ అని రాసుకున్న సంస్కృత పదాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో రుద్రమదేవి కూడా అతడి చేతుల్లోనే వీరమరణం పాలైనట్లు ఆధారాలు లభిస్తున్నాయి. 
      80 ఏండ్ల వయస్సులో ఉన్న రుద్రమను చంపానని చెప్పుకోవడం వీరత్వం అనిపించుకోనందునే.. త్రిపురాంతక శాసనంలో అంబదేవుడు ఆమె పేరు రాయలేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వీరమరణాలకు గుర్తుగా రుద్రమదేవి సేవకుడు పువ్వుల ముమ్మడి ఈ శాసనం వేయించాడు. 1289 నవంబర్ 27న రుద్రమ, మల్లికార్జుననాయకుడు శివసాయిజ్యం పొందినట్లు శాసనంలో లిఖించి ఉన్నది. శాసనం ప్రతిష్ఠించిన గద్దెకు పక్కనే సోమనాథ ఆలయానికి పువ్వుల ముమ్మడి కొంత భూమి దానం చేసినట్లు శాసనంలో ఉన్నది. గ్రామశివారులో ఉన్న నేటిచెరువు సైతం ఆనాడే రా-సముద్రం పేరుతో తవ్వించినట్లు శాసనం చెప్తున్నది. ఓరుగల్లు సామ్రాజ్య పాలకులైన కాకతీయులు ఆనాడు ఈ మార్గం నుంచే శ్రీశైలానికి వెళ్లే వారని, పిల్లలమర్రి, ఇనుపాముల, చందుపట్ల, పానగల్లు పట్టణాల మీదుగా పయనం సాగేదని చరిత్రకారులు చెప్తున్నారు. 
చందుపట్లలో చారిత్రక ఆనవాళ్లు అనేకం
గ్రామంలో ఈ శాసనం పక్కనే అలనాటి సోమనాథ ఆలయం కాకతీయుల కాలానికి ఆధారం. ప్రస్తుతం గ్రామ దేవతాలయంగా పూజలు అందుకునే ఇక్కడి గుడి ఒకప్పటి శివాలయమేనని ప్రచారంలో ఉంది. గ్రామం నడిబొడ్డున కనిపించే అనేక విగ్రహాలు భూమిలో కూరుకుపోతున్నా నాపరాతి బండలపై కొలువైన విగ్రహ రూపాలు కాకతీయుల శిల్పకళకు సాక్ష్యాధారాలుగా నిలుస్తున్నాయి. రామప్ప ఆలయంలో ఉండే గణపతి ప్రతిమను పోలిన ఓ విగ్రహం ఇక్కడ ఉన్నది. దానికి ఎదురుగా గుర్రంపై స్వారీ చేస్తున్న వీరవనిత ఆకారపు శిల్పం మరింత ఆసక్తి కలిగిస్తుంది. మరో తెల్లరాతి శిలపై ఒదిగిన శిల్పకళ సైతం చరిత్రకారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. 
గ్రామస్తుల కృషితో పాఠ్యాంశంగా శాసనం
రుద్రమదేవి శివసాయిజ్యం పొందడాన్ని ధ్రువీకరిస్తున్న ఈ శాసనం వెలుగులోకి తేవడానికి చందుపట్లలోని వివేకానంద యువజన మండలి కృషి చాలా ఉంది. వాళ్ల కష్టానికి ఫలితంగా ఐదేండ్ల కిందట ప్రతిష్ఠకు నోచుకున్న శాసనం వివరాలు దూరవిద్యను అభ్యసించే ఎంఏ తెలుగు విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చారు. చందు(డ్రు)పట్ల శాసనం పేరుతో పాఠంగా బోధిస్తున్నారు. అధికారులు, దాతల సహకారంతో శాసనం స్థాపించిన ప్రాంతానికి సమీపంలోనే రుద్రమదేవి విగ్రహం ప్రతిష్ఠించే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న రుద్రమదేవి కాంస్య విగ్రహాన్ని త్వరలో ప్రతిష్ఠంచనున్నారు.
రుద్రమదేవి వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
- టంగుటూరి సైదులు, చందుపట్ల 
మా ఊరిలో శిలాశాసనం పునరుద్ధరణ కోసం చాలా కష్టపడ్డాం. అనేకమంది సహకారంతో ఐదేండ్ల క్రితం ప్రతిష్ఠించుకున్నాం. ఇప్పుడు రుద్రమదేవి విగ్రహాన్ని తయారుచేయించాం. త్వరలోనే ఇక్కడే ప్రతిష్ఠిస్తాం. ఇప్పటికే చం దుపట్ల శాసనం పాఠ్యాంశంగా దూరవిద్య తెలుగు పుస్తకంలో పొందుపరిచారు. దీన్ని పాఠశాలస్థాయి పుస్తకాల్లోనూ చేర్చితే మన ప్రాంత చరిత్ర భావితరాలకు తెలుస్తుంది. రుద్రమదేవి వర్ధంతిని సైతం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది.

Tuesday, 25 November 2014

హైదరాబాద్ నలుమూలలా ఐటీ పరిశ్రమలు


* ఐటీఐఆర్ క్లస్టర్ల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం
* భూములను దుర్వినియోగం చేసే కంపెనీలకు నోటీసులు 
* మండలిలో ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకే పరిమితం చేయకుండా హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, కొంపల్లి యాదవరెడ్డి, ఎస్ జగదీశ్వర్‌రెడ్డి నవంబరు 24న శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ఐటీసీ పాలసీని ప్రతిపాదిస్తున్నదని తెలిపారు. ఐటీ పరిశ్రమలకు పలు రాయితీలు ఇవ్వడం ద్వారా రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రస్తుతమున్న మూడు క్లస్టర్లకే పరిమితం చేయకుండా ఐదు క్లస్టర్లకు విస్తరిస్తామని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే సమీక్ష జరిపామన్నారు. 
ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పలు ఐటీ కంపెనీలకు కేటాయించిన భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పటాన్‌చెరు ప్రాంతంలో ఈ విధంగా భూదందా కొనసాగుతున్నదని, ఇక్కడ కంపెనీలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ అటువంటి ప్రయత్నాలు చేస్తున్న కంపెనీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంలో సభ్యులకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. 
          ఇప్పటికే ప్రభుత్వానికి అందిన సమాచారం ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని సంస్థల నుంచి సమాధానం వచ్చిందని, ఇంకా కొన్ని కంపెనీల నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపాధి లభించేలా ఐటీ పరిశ్రమలను, ఇంజినీరింగ్ విద్యకు అనుసంధానం చేసేదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 70 కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఐటీ పరిశ్రమలు స్థాపించే ప్రాంతంలోని స్థానికులకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదిబట్లలో ఏర్పాటుచేసిన ఓ కంపెనీలో సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ స్థానికులకు 90శాతం ఉద్యోగాలు కల్పించారని తెలిపారు.  రాష్ట్రంలోని మరమగ్గాల కార్మికుల వ్యక్తిగత రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల 1,325 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. రుణమాఫీ కోసం రూ. 5 కోట్ల 65 లక్షలను ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మరమగ్గాల కార్మికులను పట్టించుకోలేదనిఆవేదన వ్యక్తం చేశారు.

Monday, 24 November 2014

ఓరుగల్లు వీర వనిత.. శ్రీ శ్రీ శ్రీ రాణీ రుద్రమ దేవి


కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి... శాత్రవ భయంకర నిత్య రుద్ర రూపిణి అరుదైన పాలనా దక్షురాలు.. అసమాన పరాక్రమశాలి.. శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవ మహారాజు.. అలియాస్ రుద్రమ దేవి.. ఉరఫ్.. రుద్రాంబ. రాణీ రుద్రమ దేవి.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ నేమ్ ఒక ఫైర్ బ్రాండ్. దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితమే సమాజంలో బలంగా వేళ్లూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరిన వీరనారి. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అన్న పురుషాధిక్యం తలలు వంచి నోళ్లు మూయించిన ధీర వనిత. నేటి స్వేచ్ఛా మహిళకు ఆమె ఒక ప్రతీక. స్త్రీ ఆత్మ గౌరవానికి సమున్నత పతాక. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గ ధారిణి... 
రాణీ రుద్రమదేవి గురించి మనకు తెలిసింది ఎంత? 
రాణీ రుద్రమ దేవి గురించి మనకు తెలిసినదానికన్నా తెలియనిదే ఎక్కువ. ఆమె జన్మ సంవత్సరం తెలియదు. ఉజ్జాయింపుగా ఊహించడానికి వీలుంది అని కాకతీయ యుగము గ్రంథంలో లక్ష్మీరంజనం రాశారు. నిజమే! రుద్రమదేవి గురించి చరిత్రకారులకూ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ఏడో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో ఇలా ఉంది.          మీరు ఎప్పుడైనా అత్యంత ధైర్యసాహసాలు గల మహిళా పాలకురాలైన రుద్రమదేవి గురించి విన్నారా ? ఆమె తన శక్తిసామర్థ్యాలతో ప్రతి ఒక్కరినీ మెప్పించి దిగ్విజయంగా పాలనా వ్యవహారాలను నిర్వహించారు. ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఓరుగల్లు (నేటి వరంగల్లు) రాజధానిగా పరిపాలించారు. క్రీ.శ.1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. మనదేశంలో మహిళాపాలకులు చాలా అరుదు. రాణీ రుద్రమదేవికి కొద్దికాలంముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు.
      ప్రభువర్గాలకు చెందిన వారు స్త్రీపరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుదముట్టించారు. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి, ఆమె పరిపాలన, ధైర్యసాహసాలను కొనియాడాడు. ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా, సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నాడు. నాటి శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. రజియా సుల్తానా లాగా రుద్రమదేవి కూడా తన తండ్రి పాలనా కాలంలోని ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా అణిచివేసింది. రుద్రమదేవి, ఆమె మనుమడైన ప్రతాపరుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకున్నారు.
(పాఠం 14 : ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు -127వ పేజీ)
రాజ్ఞి రుద్రమ దేవిని గూర్చి రాస్తూ ప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, డాక్టరు నేలటూరు వెంకటరమణయ్య ఇట్లా అభివర్ణించారు. 
          ఆంధ్ర దేశ పరిపాలకులలో రుద్రమదేవి నిస్సందేహంగా మహాఘనత చెందిన వ్యక్తి. రాజధర్మ విధులను ఆమె నిర్వహించిన తీరువలన తండ్రియామెకు ప్రసాదించిన పురుషనామము.. రుద్రదేవుడు అన్ని విధముల సార్థకమైనది. ప్రజలామెను రుద్రదేవ మహారాజు అని పిలుచుకునేవారు. దేశ పరిపాలనలో ఆమె చైతన్యవంతమైన పాత్ర వహించింది. ధైర్య సాహసములు విక్రమము కల యోధురాలు అవడమే కాక గొప్ప వ్యూహతంత్రజ్ఞురాలు. ఆమె రాజరికం చేసిన కాలంలో తరుచూ యుద్ధముల అలజడి కలిగినా ఆమె ప్రజలు సంతుష్టులు, సంప్రీతులు అయి సుఖించారు. అవును.. రుద్రమదేవి పాలన ప్రజారంజకమై భాసిల్లింది. శాంతి సుస్థిరతలతో విరాజిల్లింది. క్రీ. శ. 1000 నుంచి 1323 వరకు దాదాపు మూడు శతాబ్దాల పాటు తెలుగు నేల నేలింది కాకతీయ వంశం. వీరికాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. కాకతీయ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు తలొగ్గిన ఆయన తన కూతురు రుద్రమదేవిని కుమారుడిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు ఆమె వయసు పద్నాలుగేళ్లే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటుబిడ్డగా పాలన సాగించింది. రుద్రమదేవి 1261 ప్రాంతం నుంచీ స్వతంత్రంగా పరిపాలించినట్లు కనబడుతుంది. కొన్ని శాసనాల్లో 1279 వరకు పట్టాభిషక్తురాలు కాలేదేమో అనే భావం కలిగించే రాతలున్నాయి.
ధీర వనిత
రుద్రమ దేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి దాయాదుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్టించగానే ఎదురు తిరిగారు. తిరుగుబాట్లు లేవదీశారు.
         అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. పరిపాలనా దక్షతలో నేర్పరి అయిన రాణీ రుద్రమ వారి అసూయను అణిచి వేసింది. దక్షిణాదిని పాలించే చోళులు, మరాఠా ప్రాంత యాదవులను సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడిన యోధురాలు రాణీ రుద్రమ. దేవగిరి యాదవ మహాదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై పదిరోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది. రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. 
ప్రజా సేవలో..
రాణీ రుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజులూ అర్థం చేసుకోలేదు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియ తిరిగింది. ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మహామంత్రీ! గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇకపై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు అని ప్రకటించింది.
          రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది. విరాజిల్లింది. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు ధీటైన పేరిణీ శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుపోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణీ నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్ప కళ, నృత్యం కలగలిసిపోయి విరాజిల్లాయి. 
అంబదేవుని దొంగదెబ్బ
అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదునుకోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకింది.
          అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు. 
శత్రువుల పాలిట సింహస్వప్నం..
మన రుద్రమ అసమాన పరాక్రమశాలి. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనం. రుద్రమ్మ భుజశక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ స్వప్నమైంది. అంతఃశత్రువులు, బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన చత్తీస్‌ఘడ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం.. అంటే అస్సోం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే రుద్రమ దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారు పేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలనా పటిమను, మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. 
ఎప్పుడు చనిపోయింది?
రుద్రమ తన ప్రసిద్ధ సేనాని గోన గన్నారెడ్డితో కలిసి కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో పలు దుర్గాలు వశపరుచుకుంది. గోన గన్నారెడ్డి వారి రాజ్యరక్షామణియైన విఠలనాథ దండనాథుడు మాలువ, హాలువ మొదలైన దుర్గాలు సాధించిన తర్వాత సర్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణ కోసం రాయచూరులో దుర్గం నిర్మించినట్లు అతని శాసనం(1294) చెబుతోంది. రాయచూరు విజయం రుద్రమ దేవి కడపటి విజయమని భావిస్తున్నారు. కావున 1295 ప్రాంతమున మహారాజ్ఞి రుద్రమ శివసాయుజ్యం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో రుద్రమదేవి 1289 నవంబర్ 27న మరణించినట్లు అవగతమవుతున్నది. దీనిని ఇతర శాసనముల సాక్ష్యముతో సమన్వయించి నిర్ధారించవలసి ఉంది.
వీరభద్రునితో వివాహం
     పద్నాలుగవ యేటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు ఇరవై ఐదో యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రునితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ముమ్మడమ్మ, రుయ్యమ్మ. తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. విధి ప్రాతికూల్యం చేత రుద్రమ దేవి భర్త చాళుక్య వీరభద్రుడు క్రీ.శ. 1266 నాటికే మృతిచెందినట్లు ఆయన తల్లి ఉదయ మహాదేవి పాలకొల్లు శాసనంలో ఉంది. భర్త మరణానికి సమీప కాలంలోనే రుద్రమదేవికి మరొక తీరని దుఃఖం కలిగింది. వృద్ధుడైన గణపతి దేవ చక్రవర్తి 1267లో శివసాయుజ్యం చెంది ఆమెను నిస్సహాయురాల్ని చేశాడు. రుద్రమకు ఇద్దరు కూతుళ్లే కాక మరో కూతురు కూడా ఉందా? అనే అనుమానం ఆ మధ్య ఒక శాసనం కలిగించింది. ప్రకృతశాసనంలోని ఎల్లన దేవుని భార్య కూడా రుద్రమదేవి తనయ అని ఆ శాసనం చెబుతోంది. 

Monday, 7 July 2014

గవర్నర్ పాలనకు కుట్ర

- బాబు లాబీయింగ్‌కు తలొగ్గుతున్న కేంద్రం.. 
- గవర్నర్ అధికారాల పేర రాష్ర్టానికి సర్క్యులర్
- సీమాంధ్రుల పరోక్ష పాలనకు రంగం సిద్ధం?
- సినీ, రాజకీయ పెద్దల చీకటి సమావేశం.. హైదరాబాద్‌ను యూటీ చేయాలని పట్టు 
- కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు.. భూ పరిపాలన గవర్నర్‌కు ఇవ్వాలని డిమాండ్
- రాష్ర్టానికి అందిన కేంద్రం సర్క్యులర్
- రెండు కమిషనరేట్లు, రంగారెడ్డి పోలీసింగ్ గవర్నర్‌కు
- హైదరాబాద్‌కు జనాభా దామాషాలో సీమాంధ్ర పోలీసులు
- ఉమ్మడి పోలీస్ సర్వీస్ బోర్డు ప్రతిపాదన
- తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ 
- ప్రతిపాదనలకు దీటైన జవాబు పంపడానికి సిద్ధం
తెలంగాణవాసుల నెత్తురు మరిగే అంశం.. హైదరాబాద్‌ను యూటీచేసే పథకం.. అవును.. సరిగ్గా అదేకుట్ర మళ్లీ ముందుకు వస్తున్నది. కాకపోతే గవర్నర్ పాలన ముసుగులో.. మరో రూపంలో. ఆరు దశాబ్దాలుగా తాము కట్టుకున్న అక్రమ సామ్రాజ్యాలను తెలంగాణవాడు బద్దలుకొడుతుంటే.. గురుకుల్, గోకుల్, ఎన్‌కన్వెన్షన్, ఎఫ్‌డీసీ.. ఇలా ఒక్కటొక్కటిగా చేజారిపోతుంటే గుండెజారిన సీమాంధ్రబాబులు, అక్రమ రియల్టర్లు, సినీ, మీడియా, పెట్టుబడిదారులు రహస్య సమావేశాలుపెట్టి పథకాలు పన్నుతున్నారు. అలుపెరుగని ఉద్యమం, పన్నెండు వందల మంది బలిదానాలతో సాధించిన స్వరాష్ట్రం గుండెలమీద సీమాంధ్రులు రాజ్యం సాగించే కుట్రచేస్తున్నారు. సందేహం లేదు.. ఈ చీకటి కుట్రకు కథానాయకుడు మళ్లీ చంద్రబాబే. స్వాతంత్య్రం సాధించిన ఆనందం తెలంగాణవాసుల ముఖంమీద తాజాగా ఉండగానే కండ్ల ముందే దాన్ని కబళించే కుట్రకు ఆయనే తెరతీశారు. గవర్నర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మీదకు ఉసిగొల్పుతున్నారు. ఈ విపత్కర స్థితిలో తెలంగాణ సమాజానికి అప్రమత్తత అవసరం. తస్మాత్ జాగ్రత్త. 
   తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ సీమాంధ్ర కుట్రలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ను దొంగదారిలో ఏలేందుకు పచ్చమూకలు కుట్రలకు పాల్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అక్రమ కబ్జాలపై యుద్ధం ప్రకటించడంతో బెంబేలెత్తిన సీమాంధ్ర శక్తులు నగరంలో తెలంగాణ సర్కారే లేకుండా చేయాలని పథకం రచించాయి. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్ అధికారాలు పెంచాలని, కీలకమైన రెవెన్యూ భూపరిపాలన కూడా గవర్నర్‌కే అప్పగించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. శాంతిభద్రతలు పూర్తిగా గవర్నర్ చేతిలో పెట్టాలని, నగరంలోని ఇద్దరు కమిషనర్లు సహా డీఎస్‌పీలు, సీఐలుకూడా గవర్నర్ అధీనంలోనే ఉండాలని అందులో డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం వద్ద బలమైన లాబీయింగ్ జరిపారు. 
    ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు అనేక అధికారాలు కట్టబెట్టే ప్రతిపాదనలున్న 12 అంశాలతో కూడిన ఒక సర్క్యులర్‌ను కేంద్రం రాష్ర్టానికి పంపింది. ఇందులోని అంశాలే కనుక అమలు చేస్తే తెలంగాణ రాజధానిలో తెలంగాణ ప్రభుత్వమే ఉండదు. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లాలను గవర్నర్ చేతికి అప్పగించాల్సి వస్తుంది. రాజధానిపై తెలంగాణ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు కూడా గవర్నర్ రద్దు చేయవచ్చునంటూ ఇందులో పొందుపరిచిన ఒక్క నిబంధనే చాలు.. ఈ సర్క్యులర్ ఎవరికోసం..ఎందుకోసం రెక్కలు కట్టుకుని వాలిందో...! ఈ ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్థికి విరుద్ధంగా చేసిన ప్రతిపాదనలకు కేంద్రానికి దీటైన జవాబు పంపడానికి సంసిద్ధమయ్యారు. ఆదివారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై పార్లమెంటులో పోరాడాలని ఆ పోరాటం దేశమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. 
అసలు కథ ఏంటి?
    తెలంగాణ భూములు అడ్డంగా కబ్జా చేసి కోట్లు కొల్లగొట్టిన సినీ పరిశ్రమ పెద్దలు, సీమాంధ్ర పెట్టుబడిదారులు, రెండు ముఖ్య పార్టీల రాజకీయ పెద్దలు ఇటీవలే ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నిఘావర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల స్వాధీనం అంశాన్ని ప్రముఖంగా చర్చించారు. ప్రభుత్వం ఇంకా పలు కబ్జాలపై దృష్టి సారించనున్న నేపథ్యంలో వీటిని అడ్డుకోవాలంటే రాజధానిని యూటీగా మార్చేలా ఒత్తిడి చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. 
సాధ్యపడని పక్షంలో విభజన చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించి గవర్నర్ చేతికి హైదరాబాద్ పాలన అప్పగించేలా లాబీయింగ్ చేయాలని నిర్ణయించారు. తద్వారా తమ అక్రమ ఆస్తులు రక్షించుకోవడంతో పాటు పదేళ్ల పాటు హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ చీకటి సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారని నిఘా వర్గాల సమాచారం. తర్వాత ఈ కుట్రదారులంతా కేంద్రం పెద్దలను కలిసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని యూటీగానీ ఆ తరహా విధానం కానీ అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని నామమాత్రంగా మార్చాలని వీరంతా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఈ కుట్రకు లాబీయింగ్ జరిపిన వారిలో సినీ హీరో పవన్ కల్యాన్, నాగార్జున వంటి వారు కూడా ఉన్నట్టు తెలిసింది. 
కేంద్రానికి చంద్రబాబు లేఖ...
ఈ సమావేశాలు, లాబీయింగ్ తర్వాత ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పాత్ర, అధికారాలపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్ పరిపాలన గవర్నర్ చేతికి అప్పగించాలని అందులో కోరారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ మొత్తం గవర్నర్‌కే అప్పగించాలని, ఉమ్మడి రాజధానిలో ఇరు ప్రాంతాల పోలీస్ సిబ్బందిని నియమించాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని స్ఫూర్థి నిలపాలంటే రాజధానికి సంబంధించిన రెవెన్యూ, భూ పరిపాలన అంశాలు కూడా గవర్నర్‌కే అప్పగించాలని ఆయన అందులో కోరారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లా ఎస్పీలు తెలంగాణ ప్రభుత్వంతో పనిలేకుండా నేరుగా గవర్నర్‌కే రిపోర్ట్ చేసేలా సిఫారసు చేయాలని చంద్రబాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు. 
కేంద్ర హోంశాఖ నుంచి లేఖ...
ఇదిలా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ పదేళ్ల ఉమ్మడి రాజధానిలో తన పాత్ర, అధికారాల పరిధిపై కేంద్ర హోంశాఖను కొన్ని వివరాలు గతంలో అడిగారు. అపుడు సమాధానం పంపని కేంద్రం చంద్రబాబు లేఖ అందగానే గవర్నర్ లేఖను సాకుగా చూపుతూ కేంద్ర హోంశాఖ పేరు మీద తెలంగాణ ప్రభుత్వానికి ఒక సర్క్యులర్ పంపింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని పోలీస్ వ్యవస్థలో కామన్ పోలీస్ బోర్డు ఏర్పాటు చేసి, అందులో ఇరు రాష్ర్టాల పోలీస్ అధికారులకు స్థానం కల్పిస్తామని ప్రతిపాదించింది. ఇంకా అందులో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం...హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి ఎస్పీలు శాంతి భద్రతల నివేదికలు నేరుగా గవర్నర్‌కే సమర్పిస్తారు. తీవ్రమైన అంశాల్లో గవర్నర్ ఆదేశాల మేరకే రక్షణ వ్యవస్థ పనిచేయాలి. పోలీసు సర్వీస్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు ఉంటారు. వీటి పరిధిలోని పోలీసుల బదిలీలన్నింటిపైనా అధికారం గవర్నర్‌దే. రాజధాని అంతా జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను నియమిస్తారు. తెలంగాణ ఇతర జిల్లాల్లో కూడా అవసరమైతే శాంతి భద్రతలకు సంబంధించి నివేదికలను గవర్నర్ నేరుగా అడగవచ్చు. మొత్తంగా రాజధానిని సీమాంధ్ర పోలీసులతో నింపడం. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం అనేదే లేకుండా చేయడం ఈ సర్క్యులర్ ప్రధాన లక్ష్యంగా కన్పిస్తోంది. 
సీఎం కేసీఆర్ యుద్ధ ప్రకటన...
ఈ సర్క్యులర్‌లోని అంశాలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది తీవ్ర విఘాతమని ఆయన భావిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎంపీల సమావేశంలో ఈ అంశంపై ఆయన విస్తతంగా చర్చ జరిపారు. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఎక్కడా అమల్లో లేని వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలనడం చూస్తే కేంద్రం కక్షకట్టినట్లే అవుతుందని అన్నట్లు సమాచారం. ఫెడరల్ స్ఫూర్తిగా పూర్తిగా విరుద్ధమైన అంశాలతో కేంద్ర పంపిన సర్క్యూలర్‌కు దీటైన సమాధానం పంపిస్తామని, సర్క్యూలర్‌లోని అంశాలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. 
తెలంగాణ పోలీసుల్లో అలజడి...
ఇదిలాఉంటే హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి పోలీస్ వ్యవస్థను గవర్నర్‌కే అప్పగిస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై తెలంగాణ పోలీసుల్లో అలజడి మొదలైంది. 60 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఏకపక్షనిర్ణయాలతో తెలంగాణ పోలీసులను తీవ్ర ఇబ్బందులు గురిచేసిన వైనాలు పునరావృతమవుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ అధికారులను మార్చి, వారికి సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈశాన్య రాష్ట్ర ఐపీఎస్‌లను ఆ పోస్టుల్లో నియమించేందుకే గవర్నర్ పాలనకు తెరదీస్తున్నారని ఉన్నతాధికారులు సైతం భయపడుతున్నారు. 
సర్క్యులర్‌లోని అంశాలు....
-ఉమ్మడి రాజధాని పరిధిలో తీసుకునే నిర్ణయాలతో పాటు, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను కూడా సమీక్షించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుంది. 
-హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీలు శాంతిభద్రతలకు సంబంధించిన నివేదికలను గవర్నర్‌కే అందించాలి
-తీవ్రమైన, అత్యంత తీవ్రమైన అంశాల్లో గవర్నర్ ఇచ్చే అదేశాల మేరకే రక్షణ వ్యవస్థ పనిచేయాలి
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలు (హేట్‌క్రైమ్) పెరిగినప్పుడు నిరోధించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి ఐజీస్థాయి ర్యాంకు అధికారి బాధ్యుడిగా ఉంటారు. హేట్‌క్రైమ్ విషయంలో సత్వర చర్యల అధికారం గవర్నర్‌దే
-అంతర్గత భద్రత విషయంలో కూడా స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి కూడా ఐజీస్థాయి అధికారి బాధ్యుడిగా ఉంటారు.
-పోలీస్ సర్వీస్‌బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు ఉంటారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓల బదిలీల అధికారం గవర్నర్‌దే
-రెండు కమిషనరేట్ల పరిధిలో జాయింట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. రాష్ర్టాల ఫేర్‌షేర్ ప్రకారం డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వోలు ఉండాలి
-గవర్నర్ అవసరం అనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అదనపు బలగాలను అడుగవచ్చు
-శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నివేదికలను కోరవచ్చు.