* జేఎస్‌పీఎస్ కాలేజీ-ఐఐసీటీ ఆధ్వర్యంలో పరిశోధన
ఎయిడ్స్.. ఎబోలా.. హెపటైటిస్-బి వంటి కీలక వ్యాధుల నుంచి పాము విషం ఉపశమనం కలిగిస్తుందా? హైదరాబాద్‌కు చెందిన జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్యులు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న పరిశోధన ఇది నిజమేనంటోంది. పాము విషం నుంచి తయారు చేసిన క్రొటలస్ హారిడస్‌ను హెచ్‌ఐవీపై ప్రయోగించినపుడు అనుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఈ అధ్యయనంలో ముంబైకి చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ రాజేశ్ షాహ్ ఎయిడ్స్‌కు కొత్త మందును కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఈ మందు హెచ్‌ఐవీ, హెపటైటిస్-బిపై సమర్ధవంతంగా పనిచేస్తుందని జేఎస్‌పీఎస్ కాలేజీ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అయితే తమ అధ్యయనం కచ్చితంగా అడ్వాన్స్‌డ్ పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టిందని, ఉప్పెనలా పరిశోధనలు జరిగే అవకాశముందని చెప్పారు. కాగా ఈ అధ్యయనానికి సంబంధించిన సైంటిఫిక్ పేపర్ ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి (ఐజేఆర్‌హెచ్), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్) ఆన్‌లైన్ ఎడిషన్‌లోనూ ప్రచురితమైనట్లు తెలిపారు.
- నమస్తే తెలంగాణ
No comments:
Post a Comment