Thursday, 23 April 2015

మీకు వసతులు కల్పిస్తాం.. మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి

* పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ పిలుపు
* మేకిన్ తెలంగాణకు ఆహ్వానం
* నాతో చిట్‌చాట్ చేసినంత సమయంలో కొత్త పరిశ్రమలకు క్లియరెన్స్‌లు
* పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా
* గత పాలకుల అభివృద్ధి పునాదిరాళ్లకే పరిమితం
* ఆ పునాదిరాళ్లతో ఓ ప్రాజెక్టే కట్టొచ్చు
* మహీంద్రా కొత్త ప్లాంటు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ 
* హైదరాబాద్‌లో 100 మిలియన్ డాలర్లతో 
* పరిశ్రమ ఏర్పాటుకు శామ్‌సంగ్ ముందుకొచ్చిందని వెల్లడి       
  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, అందుకు ప్రతిగా ఆయా యూనిట్లలో తమ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పారిశ్రామికవేత్తలను కోరారు. పారిశ్రామికాభివృద్ధికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మేకిన్ తెలంగాణ అని పారిశ్రామికవేత్తలను పెట్టుబడులతో ఆహ్వానిస్తున్నది. పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు సర్కారు రాజమార్గం కల్పిస్తుంది అని సీఎం చెప్పారు. మెదక్‌జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమోటివ్ ప్లాంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. రూ.250 కోట్లతో తెలంగాణలో మొదటి ఆటోమోటివ్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సంస్థ యాజమాన్యాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వసతులు మేం కల్పిస్తాం. సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో దగాపడ్డ మా తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. తెలంగాణ దగాపడ్డ ప్రాంతం. నెత్తురు ధారపోసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మీ పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, కరెంట్, ఇతర కేటాయింపులు, వసతులు కల్పిస్తాం. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలు తీసుకోవాలి అని చెప్పారు. ఈ విషయంలో మహీంద్రా అండ్ మహీంద్రా ముందుండాలని ఆ సంస్థ ప్రతినిధులకు కేసీఆర్ సూచించారు.
రెండువారాల్లోనే అనుమతులు
పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. మధ్యవర్తులెవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే ప్రభుత్వ ప్రొటోకాల్ అధికారి మీ వద్దకు వస్తారు. నేరుగా నా వద్దకు తీసుకువస్తారు. రెండు వారాల్లో అన్ని అనుమతులు ఇప్పిస్తాం అని చెప్పారు. పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ వేస్తామని స్పష్టంచేశారు. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులందిస్తామన్నారు. పూర్తిగా అవినీతిరహితంగా అనుమతులు, కేటాయింపులుంటాయని చెప్పారు. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం..తెలంగాణ ఐ పాస్‌ను ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఫార్మా, ఐటీ ఏ రంగంలోనైనా పూర్తి పారదర్శకంగా దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులిస్తామని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. గతంలో మధ్యవర్తుల ప్రోత్సాహం ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికిందని చెప్పారు. స్వయంగా తనను కలిసి కంపెనీ గురించి మాట్లాడుకున్నంత సమయం (చిట్‌చాట్)లోనే అనుమతులిస్తామని చెప్పారు.
పెట్టుబడులకు పోటీ పడుతున్న పరిశ్రమలు
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో ప్రపంచ స్థాయిలో పేరుపొందిన పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతున్నాయని కేసీఆర్‌చెప్పారు. ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్‌సంగ్ హైదరాబాద్‌లో 100 మిలియన్ అమెరికన్ డాలర్లతో యూనిట్ నెలకొల్పడానికి ముందు కొచ్చిందని వెల్లడించారు. మెదక్ జిల్లా సదాశివపేటలోని ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల తనను కలిసి రూ.980 కోట్లతో పరిశ్రమను విస్తరించి, వెయ్యిమందికి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడాన్ని సీఎం సంతోషంగా గుర్తుచేశారు. కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతున్న మహీంద్రాసంస్థకు 5% పన్ను రాయితీ కల్పిస్తున్నట్లు సీఎం సభలో ప్రకటించగానే సంస్థ యాజమాన్యం, కార్మికులు హర్షధ్వానాలు చేశారు.
పరిశ్రమలకు నిరంతరాయ కరెంట్
గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు కరెంట్ కోతలుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం చెప్పారు. పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఈ విషయంలో పారిశ్రామికవేత్తలు స్వయంగా ఫోన్లు చేసి సంతోషం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఈ చర్య తీసుకున్నామని వెల్లడించారు. 
జహీరాబాద్‌కు వరాలు
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ ప్రాంతంలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ సంస్థల ఏర్పాటుతో స్థానిక నిరుద్యోగులకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి, ఇక్కడి సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించవచ్చునని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి జహీరాబాద్ సమీపంలో 220 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాన్నారు. 
గత పాలకుల అభివృద్ధి పునాదిరాళ్లకే పరిమితం
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాల అభివృద్ధి కేవలం పునాదిరాళ్లకే పరిమితమైందని కేసీఆర్ ఎద్దేవాచేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జహీరాబాద్‌ప్రాంతంలో నారింజ ప్రాజెక్టు ఆధునీకరణ, 220 కేవీ సబ్‌స్టేషన్లతోపాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగినా పనులు మొదలు కాలేదని మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి సీఎం దృష్టికి తీసుకురావడంతో కేసీఆర్ పైవిధంగా స్పందించారు. ఒక్క మెదక్ జిల్లాలోనే కాదు మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పది జిల్లాలో సమైక్యరాష్ట్రంలో సీమాంధ్ర సీఎంలు ఎన్నో అభివృద్ధి పనులకు పునాదిరాళ్లు వేశారు. ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి మొత్తం పునాదిరాళ్లకే పరిమితం చేశారు. తెలంగాణ బతుకును అంధకారంచేశారు. ఎన్నికల సమయంలో స్కీముల పేరుతో ఇక్కడి ప్రజలతో ఆడుకున్నరు. ఎంతో మోసం చేశారు. గత పాలకులు వేసిన పునాదిరాళ్లతో ఓ ప్రాజెక్టే నిర్మించుకోవచ్చు అని ముఖ్యమంత్రి అన్నారు. 
మాట ఇస్తే తలతెగిపడినా వెనక్కితగ్గం
గత పాలకులు పోయారు. ప్రభుత్వాలు పోయాయి. అప్పటి ముఖ్యమంత్రుల్లా ఏదిపడితే అది చెప్పం. మాట ఇస్తే తలతెగిపడినా వెనక్కితగ్గబోం అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. వాటర్‌గ్రిడ్‌ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరందిస్తామని చెప్పారు. జహీరాబాద్‌కు సింగూరు ప్రాజెక్టు దగ్గరగా ఉన్నదని, ఏడాదినుంచి 15నెలల్లోనే ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇంటింటికీ నీరందిస్తామని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధికోసం తాను, మాజీ ఎంపీ బాగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాగన్నలు కొంత కృషిచేశామని గుర్తుచేశారు. సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్ చెరువు, ఝరాసంఘంలోని ఏడాకులపల్లి, బెడంపేట చెరువుల అభివృద్ధికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతంలో రెండు రోజులు పర్యటిస్తానని, ఇక్కడి ఎన్‌ఎస్‌ఎఫ్ పరిశ్రమలో రాత్రి బసచేసి, సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెదక్ మట్టిలో పుట్టిన. ఎంత చెప్పినా జిల్లాపై మమకారం ఉంటది అన్న సీఎం.. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
250 కోట్లతో ప్లాంట్ విస్తరణ: పవన్ గోయెంకా
రూ.1100 కోట్ల పెట్టుబడులతో 3500 మందికి ఉద్యోగాలు కల్పించామని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోయెంకా, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా చెప్పారు. ఇప్పటికే ఉన్న ఆటోమోటివ్ ప్లాంట్‌లో ఏడాదికి 75 వేల వాహనాలు తయారవుతున్నాయన్నారు. మూడు చక్రాల వాహనాలతోపాటు అదనంగా 4 చక్రాల వాహనాలను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లుతెలిపారు. ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తున్నదని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడంద్వారా దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణను ఉన్నత స్థానంలో నిలుపుతామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సీఎం విజ్ఞప్తికి గోయెంకా స్పందించారు. తమ సంస్థలో పనిచేయడానికి గల అర్హతలున్న స్థానికులకు తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్తగా తయారు చేసిన మహీంద్రా 4 చక్రాల ఆటోను ముఖ్యమంత్రి నడిపి ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్లాంట్లను సందర్శించారు. 
- నమస్తే తెలంగాణ

No comments:

Post a Comment