Thursday 5 April 2012

బలిదానాలొద్దు బరిగీసి కొట్లాడు...


                      వద్దు.. ఆత్మహత్యలొద్దు! తెలంగాణ సాధన సమరం వీరోచిత పోరాటం.. ఆత్మహత్య ఈ పోరాటంలో అస్త్ర సన్యాసమే! తెగించి కొసదాక కొట్లాడుదాం.. తెలంగాణ ప్రజలది బతుకు పోరాటం. విజయానికి తీరంలో ఉన్నాం. పొంగిపోయే సమయం ఇది.. కుంగిపోవద్దు! ఆత్మహత్యలు చేసుకొని మా కళ్లలో నీళ్లు లేకుండా చేసి కొట్లాడే ఆత్మస్థైర్యం లేకుండా చేయొద్దు! కాలిపోకు రాలిపోకు.. ఉద్యమమై వికసించు.. వీరుడవై విప్లవించు! తెలంగాణ సాధ్యమే. తెలంగాణ ఖాయమే. కానీ.. ఆత్మహత్యలతో కాదు.. ఇది భంగ పడిన సమాజం. తెగింపు ఉండాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడుదాం.. పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం.. యువతకు తరతరాలకు సరిపడా స్ఫూర్తినిచ్చిన భగత్‌సింగ్‌కూడా తన బలిదానానికి ఆత్మహత్యను ఎంచుకోలేదు.. శత్రువుపై కొట్లాడాడు! చరివూతలో వీరులంతా పోరుజేసి నోళ్లే.. పోరాటాలను శ్వాశించినవాళ్లే.. చివరకు గెలిచిందీవాళ్లే! వర్తమానమూ అంతే! తెలంగాణలో జరుగుతున్న ప్రతిపోరులోనూ తెలంగాణవాదులే గెలుస్తున్నారు.. ద్రోహులు ఓడిపోతున్న వేళ.. ఆత్మహత్యలతో చులకన కావద్దు! మన కలల తెలంగాణను నిజం చేసుకుందాం.. కండ్లారాచూసుకుందాం.. మన రాజ్యం మనమేలుదాం! యాచక స్థితి నుంచి.. శాసక స్థితికి ఎదుగుదాం!! ఇవీ సమస్త తెలంగాణ ఉద్యమక్షిశేణులు ప్రత్యేక రాష్ట్ర సాధన సమరంలో ఆత్మబలిదానాలకు సాహసిస్తున్న యువతకు చేసిన విన్నపాలు! పోరుబాటలో ప్రజ్వరిల్లాల్సిన శక్తులు.. తమను తాము దహించుకుంటున్న వేళ.. ద్రోహల వాఖ్యలతో కలత చెంది.. కంఠాలకు ఉరిబిగించుకుంటున్న సమయాన.. తెలంగాణ గడ్డ చలించిపోయింది! తల్లుల కండ్లనుంచి ఇక ఒక్క చుక్క కూడా కన్నీరు ఈ గడ్డపై పడకూడదని తీర్మానించుకుంది! ఇప్పటికే ఏడు వందలకు పైగా బలిదానాలు ఉద్యమాన్ని నిత్యజ్వలితం చేసినా.. ఇది కాదు దారి అంటూ పోరుదారి చూపింది! మేమున్నాం అండగా.. రాష్ట్రం సాధించేదాకా జెండా దించేది లేదు.. అంటూ ఉద్యమసారథ్యం ఏకకం నినాదం చేసింది. తెలంగాణ పది జిల్లాల బిడ్డలకు కొండంత బలాన్ని భరోసాను ఇచ్చింది! రాజకీయ జేఏసీ, ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ సహా ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మహిళలు.. సకల శ్రేణులు తమ తమ జేఏసీల ఆధ్వర్యంలో కదం తొక్కగా.. సుందరయ్యపార్క్ నుంచి.. ఇందిరాపార్క్ దాకా సాగిన మహార్యాలీ.. పోరు స్ఫూర్తిని నూరిపోసింది! బతికుండి తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చింది!

No comments:

Post a Comment