* సీమాంధ్ర సమైక్యం ఒక్క చేతి చప్పట్లే..
- నన్నే పెళ్లాడాలంటూ విద్యార్థినిని నరికి చంపిన మనోహర్
- ప్రేమించనందుకు యువతిపై యాసిడ్ పోసిన శ్రీనివాసరావు
- ఏ మాత్రం తీసిపోమంటున్న సమైక్యాంధ్ర నేతలు
- కలిసుండాలంటూ తెలంగాణ ప్రజలపై దాడులు
- మాకు దక్కకపోతే.. ఎవరికీ దక్కరాదు!
- హైదరాబాద్‌పై వితండవాదంతో ఉన్మత్త చేష్టలు
- డబ్బు, ఆస్తుల సంపాదనకే నాయకగణం ప్రాధాన్యం
- వన్‌సైడ్ లవ్ కోసం ప్రజల్ని ఉసిగొల్పే యత్నాలు
ఆంధ్రతో తెలంగాణ విలీనం సందర్భంగా నాటి ప్రధాని నెహ్రూ.. తెలంగాణను అమాయక పడుచుగా.. ఆంధ్రను తుంటరి అబ్బాయిగా అభివర్ణించారు! కాపురం పొసగకపోతే ఇద్దరూ విడిపోవచ్చని ఒక కుటుంబ పెద్దగా ఇడుపుకాగితాల సంప్రదాయాన్ని వివరించారు!
కాలం గడిచింది! సంసారం సాగలేదు! తొలినాళ్లలోనే ఆ సంగతి అర్థమైంది! రమారమి ఆరు దశాబ్దాల కాలం అలానే నెట్టుకొచ్చింది ఆ అమాయక పడుచు! ఇక భరించలేనంటూ పన్నెండేళ్లుగా గోసపడింది! విడిపోయే సమయం వచ్చింది!
ఇక్కడే నవీన కాలపు క్రూర ప్రేమ రీతులు జూలు విదిల్చాయి! తననే ప్రేమించాలనిపట్టుపట్టి.. బెదిరించి.. శ్రీలక్ష్మి అనే విద్యార్థినిపై మనోహర్ అనే ఉన్మత్తుడు కత్తితో నరికి చంపినట్లు..!! తనకు దక్కని యువతి.. మరెవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో స్వప్నిక అనే విద్యార్థినిపై శ్రీనివాసరావు అనే మరో దుర్మార్గుడు యాసిడ్ పోసి ప్రాణం తీసినట్లు!! ఇప్పుడు సీమాంధ్ర నాయకుల తీరు సరిగ్గా అలానే ఉంది! దశాబ్దాలుగా అనేక రంగాల్లో అన్యాయం జరిగింది.. ఇక భరించలేం.. విడిపోతాం మొర్రో.. అని ఒక ప్రాంతం మొత్తుకుంటుంటే.. ‘లేదు లేదు.. మేం ఎంత అన్యాయం చేసినా.. మీరు మాతో కలిసే ఉండాలి.. మీరూ మేమూ ఒకే చోట బతకాలి’.. అంటూ వితండవాదాలు చేస్తున్నది సమైక్యాంధ్ర ఉద్యమం! తమ ఏకపక్ష ప్రేమను అంగీకరించాల్సిందేనని భీష్మించుకుని కూర్చుంటున్నది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం! హైదరాబాద్ తమకు దక్కకుండా పోతున్నదన్న దుగ్ధతో.. దాన్ని తెలంగాణకు కూడా కాకుండా చేయాలని తమ వికృత స్వభావాన్ని చాటుకుంటున్నది ‘ఐక్యత’ ముసుగులోని ఆందోళన! రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే.. పది జిల్లాల ప్రజలను వదిలేసి.. కేవలం పదమూడు జిల్లాలే సమైక్యవాదం వినిపిస్తున్న వైచిత్రి! తెలంగాణవారి భాగస్వామ్యంలేకుండానే.. వారు సమైక్య తీర్మానం చేస్తున్న విడ్డూరం! తెలంగాణ ప్రజలకు సంబంధం లేకుండానే సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నవారి ఐక్యతా ప్రవచనం! భళి భళి! ..గిదేం లొల్లిరా భయ్!
హైదరాబాద్: రెండుచేతులు కలిస్తేనే చప్పట్లు! ఒక ఇంట్లో కలిసుందామని చెప్పాల్సింది ఇద్దరు వ్యక్తులు! ఒక సమాజంలో కలిసి బతకాలని తీర్మానించడానికి రెండు పక్షాల ఆమోదం అవసరం! ఇది ప్రాథమిక అవగాహన! ఒకరికి ఇష్టంలేకపోయినా కలిసేఉండాలని బలవంతం చేస్తే? అది ఉన్మాదమే! సరిగ్గా తెలంగాణ ఏర్పాటు డిమాండ్ పట్ల సమైక్యాంధ్ర ఆందోళనకారులు చేస్తున్న వితండవాదం అదే! చెప్పేది సమైక్యత గురించి. అందుకు ఆందోళన చేసేది మాత్రం ఒకవైపు ఉన్న 13 జిల్లాల్లో మాత్రమే! విడిపోతామని తెలంగాణలోని పది జిల్లాలు ఆందోళన చేశాయి. రాజీలేని ఉద్యమాలు నడిపాయి. ఆత్మ బలిదానాలు చేశాయి! లాఠీ దెబ్బలుతిని.. జైళ్లకు వెళ్లాయి! ఎన్ని వంచనలకుగురైనా.. రాజ్యాంగబద్ధమైన తమ ఆకాంక్ష నెరవేరుతుందనే లక్ష్యంతోనే ముందుకు కదిలాయి.. అనుకున్నది సాధించాయి! మరి సీమాంవూధలో జరుగుతున్న ఉద్యమానికి ప్రాతిపదిక ఏమిటి? ఏ లెక్కన వారు కలిసి ఉండాలంటున్నారు? ఏ లెక్కన తెలంగాణ విడిపోకూడదని చెబుతున్నారు? ఏ లెక్కన హైదరాబాద్‌పై హక్కులు కోరుతున్నారు? దేన్ని చూపించి హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదని కుట్ర చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తరచి చూస్తే.. మనోహర్, శ్రీనివాసరావు లాంటి ఉన్మత్త ప్రేమోన్మాదుల చేష్టలే గుర్తుకు వస్తున్నాయి! వద్దన్నా వాళ్లతోనే ఉండాలి. వాళ్లకు దక్కనిదేదీ.. ఇతరులకు దక్కకూడదు! ఇదే వారి సిద్ధాంతమా? అందుకేనా ఈ దాడులు? అందుకేనా ఈ ఉదయంపూట మాత్రమే కొనసాగే గొప్ప ఆందోళనలు?
గత నెలాఖరులో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఒక ప్రజాస్వామిక ఆకాంక్షకు దక్కిన గౌరవం! వెయ్యి మంది తెలంగాణ యువత బలిదానాలకు ప్రతిఫలం. అన్నింటికి మించి.. అన్యాయానికి గురైన ప్రజలు సాధించుకున్న రాజ్యాంగబద్ధమైన హక్కు! నిజానికి ఈ పోరాటం 1956లో తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన కొద్దికాలానికే మొదలైంది. ఐక్యత ముసుగులో మాయమైన తన అస్తిత్వం కోసం ఇప్పటికీ దేవులాడుకుంటూనే ఉన్నది. ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందువరకూ ప్రపంచం ఎన్నడూ చూడని మహోన్నతమైన ప్రజాస్వామిక ఉద్యమానికి తెలంగాణ గడ్డ సాక్ష్యంగా నిలిచింది! అప్పటి దేశ వాతావరణం దృష్ట్యా రాష్ట్రాన్ని విడగొట్టలేని పరిస్థితులను నాటి ప్రధాని ఇందిరాగాంధీ చూస్తే... నేడు తప్పక విడగొట్టాల్సిన బాధ్యతను ఆమె కోడలు సోనియాగాంధీ సమర్థవంతంగా నిర్వహించారు. కానీ.. చివరి అంకంలోనూ సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్ర సిద్ధాంతాలు రచిస్తున్నారు. శాడిస్టు వన్‌సైడ్‌లవ్‌కు నిదర్శనంగా నిలుస్తూ.. విడిపోతామంటున్న సమాజాన్ని కలిసుండాలంటూ బెదిరిస్తున్నారు!
తెలంగాణవారిపై దాడులేనా సమైక్యవాదం?
సమైక్య నినాదాలు చేస్తున్న సదరు ఆందోళనకారులే.. ఈ మధ్య బరితెగిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కలిసుండటానికి ఇష్టపడటం లేదన్న ఆక్కసుతో భౌతిక దాడులకు దిగుతున్నారు. కులాల పేరుతో దూషణభాషణలకు వెరవడం లేదు! ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా టార్గెట్! వితంతువైన సోనియా పట్ల సమైక్యాంధ్ర ఆందోళనకారులు వ్యవహరించిన తీరు.. పత్రికల్లో కూడా ప్రస్తావనార్హం కాని వికృత చేష్ట! తెలంగాణ నేతలపైనా అదే తీరు! గుంటూరులో గ్రూప్ 1 ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హనుమంత్ నాయక్‌ను కేవలం తన కింద పనిచేసే ఒక హాస్టల్ వార్డెన్ వచ్చి బెదిరించేందు సాహసించడం వెనుక ఎంతటి సమైక్యభావన ఉంది? రాష్ట్రం ఇంకా విడిపోలేదు కాబట్టి నేను ఆంధ్రవూపదేశ్ వ్యక్తినేనని, తన చదువు వల్ల వచ్చిన ఉద్యగం చేయడానికి వైజాగ్ వెళ్లిన నిజామాబాద్ యువకుడు నవీన్‌ను దారుణంగా కొట్టి.. నిలువుదోపిడీ చేసిన తీరు ఎలా అర్థం చేసుకోవాలి? సొంత ప్రాంతం అధికారిణిని సైతం ఓర్వలేని తనం ఎక్కడి నుంచి వచ్చింది? తాజాగా వీహెచ్‌పై భౌతికదాడి! గులాబీ పూలు ఇచ్చి గాంధీగిరీ చేస్తామంటూనే.. చెప్పులు విసిరి గూండాగిరీ! కానీ.. తెలంగాణ ఉద్యమం మాత్రం దశాబ్దాలుగా అత్యంత సహనంతో సాగింది! తనను తాను కాల్చుకునేందుకు సిద్ధపడిందే తప్ప.. తెలంగాణలోని సీమాంవూధుడిపై ఏనాడూ చేయి పడిందిలేదు. ఎందుకంటే? సీమాంవూధులైనా.. ఇక్కడ పొట్టపోసుకోవడానికి వచ్చిన సోదర తెలుగువారనే భావనే! ఇదీ.. నిజమైన సమైక్యభావన. విడిపోయినా కలిసిఉండాలనే ఆకాంక్ష! కానీ.. ఎప్పుడైతే సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిందో.. లగడపాటి వంటిరాజకీయ పెట్టుబడిదారీ వ్యాపారవేత్తలు విభజనను అడ్డుకుని తీరుతామని ప్రకటించారో.. తెలుగుతల్లి మెడపై కత్తి వేలాడుతోందని భావోద్వేగాలు రెచ్చగొట్టారో.. అప్పటినుంచి సీమాంవూధలో దాడుల పర్వం మొదలైంది! అక్కడి ప్రజాస్వామ్యవాదుల గొంతునూ నొక్కేస్తున్న విచిత్ర వైఖరికి సమైక్యాంధ్ర ఆందోళనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సీమాంవూధలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగ సంఘాలేవీ ఆందోళనల్లో పాల్గొనడం లేదు. కానీ.. ఈ విషయం ఎందుకు వెలుగులోకి రావడం లేదు?
హైదరాబాద్‌పై వన్‌సైడ్ లవ్
ప్రస్తుతం సీమాంధ్ర నేతలు, ఉద్యమాలు చేస్తున్న ఇతర సంస్థలు చేస్తున్న వాదన కేవలం హైదరాబాద్. ‘హైదరాబాద్‌లో మావాళ్లంతా ఇక్కడే ఉన్నారు... ఇక్కడి నుంచి వెళ్లలేం.’ ‘హైదరాబాద్ మాదనుకుని పెట్టుబడులు పెట్టాం... ఇప్పుడు వెళ్లిపోమ్మంటే ఎక్కడికి పోతాం’ ఈ వాదనలే ఆధారంగా సీమాంవూధలో సమైక్య ఉద్యమం సాగుతోంది. ఎవరు ఏమన్నా.. విభజన ప్రక్రియ మొత్తం రాజ్యాగబద్ధంగా జరుగుతుంది. ఒక పౌరుడి లేదా ఒక ఉద్యోగి న్యాయబద్ధమైన హక్కును రాజ్యాంగం నిరాకరించదు.. పైగా మద్దతిచ్చి.. వెన్నుతట్టి భరోసానిస్తుంది! కానీ.. ఈ వాస్తవం సీమాంధ్ర ప్రాంతంలో ఎందుకు ప్రస్తావనకు రావడం లేదు? ఎన్నో ఏళ్లుగా బెంగాలీలు, మరాఠీలు, కన్నడిగులు, తమిళులు ఎలాంటి భేదభావాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు.
తెలంగాణ సంస్కృతిలో కలిసిపోతున్నారు. కానీ 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన నాటినుంచి సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలతో మమేకం అవ్వడానికి ఏమాత్రం సిద్ధపడలేదన్నది యథార్థం. ఏకపక్షంగా కేవలం సీమాంధ్ర ప్రాంతానికే న్యాయం చేయడానికే తామున్నామన్నట్లుగా చెప్పుకున్న అనేక ఒప్పందాలను తెలంగాణ సమాజం చూసింది. తెలంగాణకు జరిగిన అనేక అన్యాయాలపై నివేదికలను సీమాంధ్ర పాలకులు తొక్కిపట్టిన వైనాన్ని సహించలేక నిలదీసింది. సినిమాల్లో దుష్టపావూతలకే మాత్రమే తెలంగాణ ప్రాంతాన్ని కేటాయిస్తూ.. హీరోయిజాలకు అనకాపల్లి.. అమలాపురాలను ఎంచుకుంటుంటే భరించలేక తిరగబడింది. అది కూడా ఉన్నతమైన ప్రజాస్వామిక విలువలకు లోబడే! ఈ పరిణామాలన్నీ సీమాంధ్ర నాయకుల పట్ల తెలంగాణ ప్రజల్లో ఏహ్యభావాన్ని పెంపొందించాయి. అయినా సరే వారి ధోరణి వారిదేనన్నట్లు పాలకులు ముందుకుపోయారు తప్పించి.. తెలంగాణ మనసు తెలుసుకుని.. వారికిదగ్గరయ్యే ప్రయత్నమే చేయలేదన్నది ఉద్యమకారుల విమర్శ.
పైగా తమ, తమ ప్రాంత ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఈ పరిణామాలు సీమాంధ్ర నాయకులపై పూర్తిస్థాయి అసంతృప్తికి కారణం అయ్యాయి. ఈ అసంతృప్తి జ్వాలలే తమకు ప్రత్యేక రాష్ట్రం వస్తేనే న్యాయం జరుగుతుందనే భావనకు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యమించిన ప్రజలు ఎన్నో కష్టనష్టాలకొర్చి రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను సాధించుకున్నారు. ఈ సమయంలోనే మళ్లీ సీమాంధ్ర నేతలు సమైక్య కుట్రలు బయటపెట్టుకున్నారు. విడిపోబోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగానైనా... నియంతృత్వంతోనైనా.... హేతుబద్ధత లేని ఆందోళనలతోనైనా అడ్డుకోవాలనే ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఇందుకోసం కొత్త మెలిక వేస్తూ.. హైదరాబాద్‌ను వివాదం చేసేందుకు తెగ తాపవూతయపడుతున్నారు. హైదరాబాద్ మాతోనే ఉండాలి... లేకుంటే తెలంగాణకు కూడా ఉండొద్దు అన్న రీతిలోనే సీమాంధ్ర నేతల ఆందోళనలు సాగుతున్నాయి. ఇదంతా చూస్తే.. ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి.. లేదా యాసిడ్ పోస్తానన్నట్లు.. నరికి చంపుతానన్నట్లు సీమాంవూధనేతల తీరు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌పై ప్రేమ కానేకాదు
ఇది దేవదాసు ప్రేమకాలం కాదు. యాసిడ్ ప్రేమకాలం. సమైక్యత అనేది ఇద్దరు మనుషుల మధ్య ఉండే సంబంధం. ఇద్దరికీ సమానమైన హక్కులు, బాధ్యతలుంటాయి. ఎవరికి ఇష్టం లేకపోయినా.. సంపూర్ణంగా విడిపోవచ్చు. సమైక్యవాదానికి నైతిక పునాది, తాత్విక పునాది లేదు. అదొక్క నినాదం మాత్రమే. సమైక్యతలో అంతర్లీనంగా హైదరాబాద్‌పై ప్రేమ మాత్రమే. ఇక్కడున్న సీమాంధ్ర ప్రజలపై కానేకాదు. నాకు దక్కకపోతే నీకూ దక్కొద్దు అన్నట్లుగా దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటున్నారు. సమైక్య నినాదంలో పెట్టుబడిదారుల ప్రయోజనాలు మాత్రమే దాగి ఉన్నాయి.
- ప్రొఫెసర్ హరగోపాల్
No comments:
Post a Comment