- ఊసరవెల్లులను మరిపిస్తున్న పార్టీలు
- తెలంగాణ రాకముందు ఒక తీరు
- సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత మరోతీరు
- దశాబ్దాల ఆకాంక్షపై స్వార్థంతో నిప్పులు
- మండిపడుతున్న తెలంగాణవాదులు
హైదరాబాద్ (టీ మీడియా): రాష్ట్రంలోని రాజకీయ పార్టీల తీరు చూస్తే.. ఊసరవెల్లుల స్థాయిని నేతలు ఎప్పుడో దాటేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని మరింపించేలా రంగులు మార్చుతున్న రాజకీయ నాయకులు..
తెలంగాణ విషయంలో తమవి నాలుకలు కావని.. తాటిమట్టలని చెప్పకనే చెబుతున్నారన్న విమర్శలు వెల్లు ఇప్పటికే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు, టీడీపీ, వైఎస్సార్సీపీలు గతంలో చెప్పిన మాటలను మార్చి.. తెలంగాణ వ్యతిరేకతను చాటుకుంటున్న తరుణంలో బీజేపీ తాను సైతం తక్కువ కాదని నిరూపించుకుంటోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ పార్టీలన్నీ తెలంగాణకు గతంలో మద్దతు పలికినవే. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు సైతం అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. టీడీపీ తాను ఎప్పుడో ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చేశానని ప్రకటించుకుంది.
ఇచ్చే శక్తి.. ఆపే శక్తి లేదంటూనే.. తెలంగాణ ప్రజల మనోభీష్ఠాన్ని గౌరవిస్తామని వైఎస్సార్సీపీ ప్రగల్భాలు పలికింది! బీజేపీ అయితే.. మీరు ఇస్తే ఇవ్వండి.. లేదంటే మేం వచ్చాక ఇవ్వడం ఖాయం అంటూ ఊదరగొట్టింది! కానీ.. రెండు పదుల రోజులు గడిచేలోపే వారి అసలు స్వరూపాలు విస్పష్టంగా బయటపడిపోయాయని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ నాలుగు పార్టీల నాయకులు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమం విజయం సాధించాక మాట ఎలా మార్చారు? గమనిస్తే ఎంతటి రాజకీయ పండితులకైనా దిమ్మతిరగక తప్పదు. ఒక పార్టీ.. ప్రజల ఓట్లు.. అభిమానాలు సంపాదించుకోవాల్సిన రాజకీయ సంస్థ.. ఒక ప్రాంత ప్రజాభీష్ఠంపై ఇంతలా మాట ఎలా మార్చేస్తారన్న సందేహం.. తలను వేయి వక్కలు చేయక తప్పదు! కానీ.. అందరికీ వారి వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే తెలంగాణ విషయంలో అన్ని పార్టీలూ యూటర్న్ తీసుకున్నాయని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
సీమాంధ్ర నేతల ధిక్కార స్వరాలు
సీమాంధ్ర నాయకులు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్ఠానాన్ని ఒత్తిడి చేశారు. అదే సమయంలో పార్టీ అధ్యక్షురాలిదే తుది నిర్ణయమని, దానికి కట్టుబడి ఉంటామంటూ గొప్ప క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ఫోజులు కొట్టారు! నిర్ణయం తీసుకునే ముందు కూడా పార్టీ పెద్దలు చెప్పినదాన్ని పాటిస్తామన్నారు. తీరా స్వయంగా అధినేత్రి తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకునేసరికి.. వారికి గొంతులో వెలక్కాయపడింది. స్వరం మారిపోయింది! రాజీనామాలు వరుసబెట్టాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్రం విభజించవద్దన్న స్వరంలోనే మాట్లాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పైగా సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ సమైక్య ఉద్యమానికి ప్రభుత్వ తరఫున పరోక్ష సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చింది మొదట కాంగ్రెస్ నేతలు. 1999లో సీఎల్పీ నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ 42 మంది తెలంగాణ ఎమ్మెల్యేల చేత ఆనాడు హైదరాబాద్‌లో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సోనియాగాంధీకి రిప్రజెంటేషన్ ఇప్పించారు. అప్పటి నుంచి తాము తెలంగాణకు అనుకూలమనే వాదననే ఆ పార్టీ నేతలు వినిపిస్తూ వచ్చారు. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత మాట మార్చేశారు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నారు. అందుకు తగిన ప్రతిఫలాన్ని తెలంగాణ ప్రాంత ఉప ఎన్నికల్లో అనుభవించిన తర్వాత అసలు సంగతి అధిష్ఠానానికి అర్థమైంది.
పార్టీని బతికించుకోవడానికి సమాయత్తమై.. జూలై 30న తెలంగాణకు అనుకూల ప్రకటన చేసింది. దానికి ముందే సీఎం, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పార్టీ కోర్‌కమిటీకి రోడ్‌మ్యాప్‌లు సమర్పించారు. అప్పుడు కూడా సీమాంధ్ర నేతలైన కిరణ్, బొత్స తెలంగాణకు వ్యతిరేకంగా వాదించారు. ఒక్క తెలంగాణ నేత, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాత్రం తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని విస్పష్టంగా చెప్పారు. తాము వ్యతిరేకంగా ఉన్నా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కిరణ్, బొత్స బహిరంగంగా ప్రకటించారు. కానీ.. నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి ధిక్కార స్వరాన్నే కిరణ్, బిత్స వినిపిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. సీమాంధ్రలో సమైక్య వాదం పేరిట జరుగుతున్న ఉద్యమాలకు వీరే ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు.
మాట మార్చుడే టీడీపీ వైఖరి!
టీడీపీ అధినేత చంద్రబాబు ఒకసారి తెలంగాణకు ‘సై’ అన్నారు. డిసెంబర్ 9 ప్రకటన రాగానే ‘నై’ అన్నారు. మళ్లీ ఎన్నికల అవసరాలు గుర్తొచ్చేసరికి తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడగానే ఆయన సైతం కంగుతిన్నారు. ఇక్కడే టీడీపీలో వింతనాటకానికి తెర లేచింది. అధినేత తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతారు.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ను చీల్చే హక్కు కాంగ్రెస్‌కు ఎవరిచ్చారని అదే పార్టీ నేతలు సీమాంధ్ర ఆందోళనల్లో గొంతు చించుకుంటారు! సీమాంవూధలో ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనలు.. నిరాహార దీక్షలు, పార్లమెంటులో రగడ.. అన్నీ చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది.
చంద్రబాబు కూడా తెలుగుజాతికి ఆత్మగౌరం పోయిందని, టీడీపీని దెబ్బతీయడానికే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకున్నదని విమర్శిస్తున్నారు. టీడీపీ టీ ఫోరం నేతల నుంచి తీవ్ర ప్రతిఘటనతో చంద్రబాబు తన ఆత్మగౌరవ యాత్ర నుంచి వెనక్కుతగ్గారేకానీ.. రెండు రోజులు గడిస్తే.. ఆయన అసలు స్వరూపం నిలు దర్శనమిచ్చేదని అంటున్నారు. టీడీపీ తెలంగాణ విషయంలో అనుసరిస్తూ వచ్చిన వైఖరి గమనిస్తే.. దాని భవిష్యత్ వ్యూహం అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా టీడీపీ పొలిట్‌బ్యూరో 2008 అక్టోబర్ 9న నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజేస్తూ 2008 అక్టోబర్ 18న ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి చంద్రబాబు లేఖ రాశారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్‌తో 2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అనేక కారణాలు చంద్రబాబును ప్రతిపక్షంలోనే కూర్చుండబెట్టాయి.
కేసీఆర్ దీక్షతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు 2009 డిసెంబర్ 9న ప్రకటించింది. దీనికి ముందు నాటి సీఎం రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నేతలు తెలంగాణకు మద్దతు పలికారు. దానికి ముందు అసెంబ్లీలో కూడా సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు.. తెలంగాణపై తీర్మానం మీరు ప్రవేశ పెడతారా? లేక నన్నే ప్రవేశ పెట్టమంటారా? అని తెలంగాణపై ప్రేమ ఒకలబోశారని తెలంగాణవాదులు గుర్తు చేస్తున్నారు. కానీ.. డిసెంబర్ 9 ప్రకటన మరుసటి రోజే ఆ పార్టీ యూటర్న్ తీసుకుంది. వచ్చిన తెలంగాణను కాంగ్రెస్‌తో కలిసి ఆడిన రాజీనామా డ్రామాతో అడ్డుకుంది. 2009 డిసెంబర్10న అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తెలంగాణ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తెలంగాణ ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌నుంచే కృత్రిమంగా సమైక్య ఉద్యమాన్ని చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో పార్టీ దారుణ స్థితికి చేరుకుంటున్న పరిస్థితుల్లో.. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదనే నినాదాన్ని ఎత్తుకున్నారు.
ప్రధానికి 2012 సెప్టెంబర్ 26న ఒక లేఖ రాస్తూ.. తెలంగాణ సమస్యను పరిష్కరించాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తమ అభివూపాయం చెపుతామని పేర్కొన్నారు. ఆ మేరకు 2012 డిసెంబర్ 28న కేంద్ర హోమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. గతంలో తాము రెండు లేఖలు ఇచ్చామని, వాటిని అమలు చేయాలని కోరుతూ మూడో లేఖ అందజేశారు. అనంతర పరిణామాల్లో చివరకు జూలై 30న తెలంగాణ ఇవ్వాలని సీడబ్ల్యూసీ, యుపీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో టీడీపీ సీమాంధ్ర నాయకులు మరోసారి సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారు. హరికృష్ణ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆమోదించుకున్నారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రకు సిద్ధపడ్డారు. ఇవన్నీ గమనిస్తే మొత్తంగా టీడీపీ వ్యవహారం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే ఉందని తెలంగాణవాదులు తేల్చి చెబుతున్నారు.
తెలంగాణను వదిలేసుకున్న వైఎస్సార్సీపీ
తెలంగాణ విషయంలో ఎలాంటి శషభిషలు లేకుండా తొట్టతొలి వ్యతిరేకతను చాటుకుంది వైఎస్సార్సీపీ. తనకు తెలంగాణలో పార్టీ అవసరం లేదని నిర్భయంగా ప్రకటించేసింది. నిర్ణయం రాకముందే పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దాన్ని తెలంగాణలోని పార్టీ నేతలు వ్యతిరేకిస్తే.. సీమాంధ్ర ప్రయోజనాలకే రాజీనామా చేశారు తప్పించి తెలంగాణ వ్యతిరేకతతో కాదని నమ్మబలికే యత్నాలు చేశారు. ఆ తర్వాత ఆ ముసుగూ తొలగించేసి.. తెలంగాణ ఇస్తే సీమాంధ్ర ఏడారేనంటూ ఏకవాక్య సిద్ధాంతం పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా సమరదీక్షలు చేస్తున్నారు. మధ్యలో తెలంగాణవాదం ఎత్తుకున్నా.. మొదటి నుంచి వైఎస్.. ఆయన పేరుతో పార్టీ పెట్టుకున్న కొడుకు జగన్ తెలంగాణ వ్యతిరేకులేనని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలని వైఎస్ అంటే.. జగన్ పార్లమెంటులో సమైక్య ప్లకార్డు పట్టుకుని తన బాట ఏంటో ఆనాడే చెప్పారని మండిపడుతున్నారు. తన తండ్రి మరణానంతరం సొంత పార్టీ పెట్టుకున్న జగన్.. 2011 జూలై 9న ఇడుపుల పాయలో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణపై కేంద్ర నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించబోమని ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ చెప్పారు. 2012 డిసెంబర్ 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. తీరా తెలంగాణపై జూలై 30న కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగానే యూటర్న్ తీసుకున్నారని, పచ్చి తెలంగాణ వ్యతిరేకతను చాటుకుంటున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మారుతున్న బీజేపీ స్వరం
తెలంగాణకు తమ అంతటి గొప్ప మద్దతుదారుల్లేరని అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారు. ఈ క్షణాన బిల్లు పెట్టినా.. ఆమోదింప చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ఇవ్వకుంటే ఎన్డీయే రాగానే తెలంగాణ గ్యారెంటీ అన్నారు. కానీ.. వారికి కూడా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా కనిపిస్తున్నాయని పలువురు తెలంగాణ ఉద్యమనేతలు చెబుతున్నారు. తెలంగాణపై బీజేపీ స్వరం మారుతున్నదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. సమైక్యాంధ్ర డిమాండ్‌తో సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం సందర్భంగా బీజేపీ అనుసరించిన తీరు ఈ అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోందని పేర్కొంటున్నారు. గతంలో టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం లోక్‌సభలో పట్టుపట్టారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. చరివూతలో ఎన్నడూ లేని రీతిలో సొంత పార్టీ ఎంపీలనే కాంగ్రెస్ పెద్దలు సస్పెండ్ చేయించారు. ఆ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడని బీజేపీ నేతలు.. వారి సస్పెన్షన్‌ను సమర్థించారు.
అదే బీజేపీ నేతలు.. ఇప్పుడు సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకున్నందుకు స్పీకర్ సస్పెండ్ చేస్తానంటే మాత్రం ఒంటికాలిపై లేచి.. సభ వాయిదాకు కారకులయ్యారు. తెలంగాణపై సీడబ్లూసీ నిర్ణయాన్ని తప్పుపట్టే రీతిలో కూడా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతుండటం విశేషం. ఈ నెల 12న రాజ్యసభలో జరిగిన తెలంగాణపై చర్చలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు.. కాంగ్రెస్ నిర్ణయంతో రాష్ట్రం తగులబడుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై నిర్ణయం తీసుకున్నదని విమర్శించారు. సీఎం, పీసీసీ చీఫ్, సీమాంధ్రకు చెందిన తొమ్మిది మంది మంత్రులతో చర్చించకుండా రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని ఎలా చీలుస్తారంటూ రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ తీర్మానం చేసిన బీజేపీ.. ఆనాడు టీడీపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా అటకెక్కించిందని, ఇప్పుడు తెలంగాణపై కసరత్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేయాల్సిన బీజేపీ దీనికి విరుద్ధంగా సీమాంధ్ర ఎంపీలను పార్లమెంటులో సస్పెండ్ చేయాలని చూస్తే దానిని అడ్డుకోవడం సందేహాలకు దారి తీస్తున్నదని తెలంగాణవాదులు అంటున్నారు.
No comments:
Post a Comment