Monday 17 December 2012

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే..


  ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట్లాడుతున్నారు. అదే విధంగా రాయలసీమకు వెళ్ళి ‘హంద్రీనీవా, సుజల స్రవంతి’ ప్రారంభోత్సవ సభలో రాయలసీమ గడ్డమీద పుట్టి పెరిగినందుకు హంద్రీనీవాను ప్రారంభోత్సవం చేసి ఈ గడ్డ రుణం తీర్చుకున్నానని అన్నారు. అలాగే కోస్తాంధ్ర ప్రాంతానికి పోయి ఎన్ని అవంతరాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును కట్టితీరుతానని ప్రతిజ్ఞ చేశారు. కిరణ్ కుమార్‌డ్డితోపాటు ఉమ్మడి రాష్ర్టంలో ముఖ్యమంత్రులైన సీమాంధ్ర నాయకులు కేవలం తెలంగాణ ప్రాంత నీళ్ళు, నిధులు, భూములు దోచుకోవడమే తమ పరమావధిగా పనిచేశారు, చేస్తున్నారు. ఇంకో తెలంగాణ ప్రాంతం వారు ముఖ్యమంత్రు లు అయ్యింది కొద్దికాలమే. ఆ కాలంలో కూడా తెలంగాణ ప్రాంత వనరుల దోపిడీని అడ్డుకోలేక పోవడంతోపాటు తమ స్వలాభమే ధ్యేయంగా పనిచేశారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరీ వాటి ఉప నదులు తెలంగాణ ప్రాంతంలో పారుతూ జీవన నదులుగా వెలుగొందుతు న్నా తెలంగాణ ప్రజలకు ఒక్కపూట తిండి కూడా లేని పరిస్థితుల్లో పాలమూరు, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వలసపోయి జీవచ్ఛవాలుగా బతుకున్నారు. గుక్కెడు మంచినీళ్ళు దొరకక కృష్ణానది పరివాహాక ప్రాంతంలోని నల్గొండ జిల్లా ప్రజలు ‘ఫ్లోరైడ్ వ్యాధి’తో తల్లడిల్లుతున్నారు. గోదావరి పరివాహాక ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలు మంచినీళ్ళు దొరకక ప్రతి ఏటా వందలాదిగా ‘డయేరియా’ బారిన పడి చనిపోతున్నారు. దేశంలోని మెజారిటీ గ్రామాల్లో చెరువులు కుంటలు, కాలువల పారుదల భూములన్నీ అగ్రవర్ణాలకే చెందినవిగా చరిత్రలో నమోదైనవి. 
       
 అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కృష్ణా, గోదావరి వాటి ఉపనదుల పరివాహాక    ప్రాంతంలోని    నదుల  ఒడ్డున సీమాంధ్ర   భూస్వాములు లక్షలాది ఎకరాలను ఆక్రమించుకొని ఆరు దశాబ్దాలుగా ఆ నదుల నీటిని వాడుకుంటున్నారు. అసలే     ప్రాజెక్టులు లేక,      చెరువులు కుంటలు పూడికలు తీయక తెలంగాణ  ప్రాంత నీటివనరులు  పూర్తిగా అడుగంటి పోయిన తరుణంలో     తెలంగాణ   ప్రాంత  రైతాంగం   సాగునీటి కోసం నానాయాతనలు     పడుతుండగా,    నదుల        ఒడ్డున వ్యవసాయ భూములను       ఆక్రమించుకున్న      సీమాంధ్ర భూస్వాములు సకల సంపదలతో తులతూగుతున్నారు. రెండుపంటలు పండించుకుంటున్న కోస్తాంధ్ర ప్రాంతానికి మూడోపంటకు నీరీచ్చెందుకు దక్షిణ తెలంగాణలోని కృష్ణానది    మీద    పులిచింతల ప్రాజెక్టు, గోదావరి నది   మీద పోలవరం ప్రాజెక్టు కట్టి  తెలంగాణ  ప్రాంత   ఆదివాసులను ఆ    ప్రాజెక్టులో ముంచి సీమాంధ్రకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నం తెలంగాణ ప్రజలను కృంగ తీస్తున్నది.  ఈనేపథ్యంలో   మా   రాష్ర్టం  మాకు   కావాలని అడిగినందుకు  నాటి  ముఖ్యమంత్రి బ్రహ్మనందడ్డి 370మంది తెలంగాణ బిడ్డలను కాల్చిచంపారు. కొద్దిమంది   ఆయన   మంత్రివర్గం    నుంచి బయటకి వచ్చినా,  మళ్ళీ తెలంగాణ   ప్రాంత ప్రజలను   వీరు   కూడా మోసగించారు.   అధికారంలో కాంగ్రెస్, తెలుగుదేశం      ఏపార్టీ  ఉన్నా సీమాంధ్ర నుంచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు తెలంగాణకు చెందిన సకల వనరులు దోచుకోవడం తెలంగాణ ప్రాంత ప్రజలను నట్టెట ముంచడం జరిగింది,  జరుగుత్నుది. ఈ దుర్మార్గానికి          వ్యతిరేకంగా పోరాడుతున్న   ప్రజలను     అణచడమే      ధ్యేయంగా        ముందుకు పోతున్నారు. 
          నాగార్జునసాగర్‌ను నందికొండ ఎగువన ఏలేశ్వరం దగ్గర నిర్మించాలని ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చి నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవడ్డి, సీమాంధ్రకు  చెందిన నీటిరంగ నిపుణుడు కె.ఎల్.రావు సహకారంతో సీమాంధ్రకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమల కాలువల ద్వారా 70% కోస్తాంధ్రకు ప్రయోజనం చేకూర్చేందుకు చేసిన కుట్ర ఫలితంగా దక్షిణ తెలంగాణ ఏడారిగా, కోస్తాంధ్ర ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది. ఇప్పటికీ కుడి కాలువ ద్వారా పారుతున్న నీటిని లిఫ్ట్‌ల ద్వారా కోస్తాంధ్ర రైతాంగం వినియోగించుకునేందుకు అవుతున్న భారం ప్రభుత్వమే భరిస్తుండగా, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలోని లిఫ్ట్‌ల భారం తెలంగాణ రైతాంగమే భరిస్తున్నదంటే ఈ సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణ పట్ల ఎంత వివక్షతో ఉన్నారో అర్థం అవుతున్నది. ఈప్రాజెక్టు రిపోర్టులో లేని కృష్ణా జిల్లాను ఈ ప్రాజెక్టు నీటి వాడకంలో చేర్చి ఖమ్మం జిల్లా రైతాంగం నోట్లో మట్టికొట్టారు. ఈ జిల్లాలో పారవలసిన రెండు లక్షల ఎకరాలకు నీరందివ్వకుండా కృష్ణా జిల్లా లోని ‘నూజివీడు ప్రాంతం’ వరకు లక్షా 60వేల ఎకరాలకు నీరందిస్తున్నారు. 
                ఆసియా ఖండానికే వన్నె తెచ్చిన నిజామ్ షుగర్ ఫ్యాక్టరీని కేవలం మూడుకోట్ల రూపాయలకే సీమాంధ్రకు చెందిన గోకరాజు రంగరాజు అనే పెట్టుబడిదారునికి 49% వాటాను అప్పగించారు. ఆఫ్యాక్టరీ యాజమన్యంలో ఉన్న దాదాపు 1,000 ఎకరాల భూమిని ఆయనకు కట్టబెట్టడంతో పాటు దాదాపు 800 కోట్ల విలువ కల్గిన ఫ్యాక్టరీని అతనికి ధారదత్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజల రక్త మాంసలతో అభివృద్ధి చేసిన నిజాం సర్ఫేఖాస్ భూములను ఐ.ఎం,జి అనే సంస్థకు కట్టబెట్టారు. దాదాపు 22 రకాల కుంభకోణాలతో తెలంగాణ భూములను మింగేసిన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు బినామిగా నేడు చంద్రబాబు ఉన్నారు. నామ నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలో అత్యంత విలువైన గ్రానైట్‌ను చంద్రబాబు హాయంలోనే వందలాది ఎకరాలు కొట్టివేసి అత్యంత సంపన్న వంతునిగా మారి నేడు చంద్రబాబుకు బినామిగా ఉన్నారు. కుకట్‌పల్లిలోని జెఎన్‌టియు ఎదురుగా ఉన్న విలు భూములను దాదాపు ఒక కిలోమీటరు రోడ్ ఫేస్‌లోని భూమిని దక్కించుకొని నేడు నీతి వచనాలు పలుకుతున్న నామ నాగేశ్వరరావు తెలంగాణ ప్రాంత వ్యతిరేకుల జాబితాలో చేరిపోయారు. ఒక దశాబ్దకాలంలోని చంద్రబాబు పాలనలో లక్షలాది కోట్ల రూపాయల సంపద సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ఖాతాలోకి చేరి పోయింది.బోరింగుల ద్వారా తప్ప, కాలువల ద్వారా, చెరువుల ద్వారా, కుంటల ద్వారా సాగునీరు రాని తెలంగాణ ప్రాంత రైతాంగం విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని పోరాడినందుకు బషీర్‌బాగ్ చౌరస్తా సాక్షిగా పదుల సంఖ్యలో ఉద్యమకారులను కాల్చివేశారు. సొంత పార్టీకి చెందిన హన్మకొండ శాసనసభ్యులు దివంగత ప్రణయభాస్కర్ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు గురించి శాసనసభలో మాట్లాడినందుకు చంద్రబాబు చేత తీవ్ర బెదిరింపులకు గురయ్యా రు. తెలంగాణ ప్రాంత వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు 2009, డిసెంబర్ 10న తన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకుని తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును అడ్డుకున్నాడు. 
              తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజలను వంచించారు. అధికారంలోకి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు. తెలంగాణ ప్రాంత సకల వనరులు తన కుటుంబానికి, సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. జలయజ్ఞం పేరుతో వేలాది కోట్ల రూపాయలు దిగమింగిన రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంత నీటి వనరులను సీమాంధ్రకు తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక్క పోతిడ్డిపాడు విస్తరణ ద్వారానే దాదాపు 110 టీఎంసీల నీరును రాయలసీమకు తరలించారు. తెలంగాణ ప్రాంతంలోని ఇచ్చంపల్లి, లోయర్ పెనుగంగ, అప్పర్ పెనుగంగ, కాంతాలపల్లి లాంటి ప్రాజెక్టులకు మోక్షమే లేకుండాపోయింది. తూతూ మంత్రంగా మొదలుపెట్టిన దేవాదుల, ఎ.ఎం.ఆర్ ఫేజ్-2, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, భీమా (సంగం బండ), కల్వకుర్తి, ఆర్‌డీఎస్ లాంటి పథకాలు ‘ఎక్కడేసీన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు మీ కోసం వస్తున్నా నన్నా, షర్మిల నేనున్నానంటూ పాదయాత్రలు చేసినా, కిరణ్‌కుమార్‌డ్డి ఇందిరమ్మ పేరుతో పల్లెబాట పట్టినా అన్నీ పదవి కోసం ఆరాటాలే తప్ప మరేమీ కాదు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలో భాగమైన రాష్ర్ట ఏర్పాటును వ్యతిరేకిస్తూ తన సీమాంధ్ర తత్వాన్ని ఒకరికి మించి మరొకరు చాటుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంలో అందరు ముఖ్యమంత్రుల లాగే కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా భాగమయ్యారు. అందుకే నాటి నీలం సంజీవరెడ్డి నుంచి నేటి కిరణ్ కుమార్‌రెడ్డి దాకా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నడిచినవారే. తెలంగాణ ప్రాంత వనరులను సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు దోచిపెట్టి, అందులో తమ వాటాను పొందిన వారే. వీరికి వ్యతిరేకంగా మడప తిప్పని పోరాటంతో తెలంగాణ సాధనకు నడుం కట్టాలి. తెలంగాణ ప్రజలు ‘ఎప్పటివరకు ఈ పోరాటం అంటే తెలంగాణ వచ్చేవరకు, తెలంగాణ వనరులపై సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల దోపిడీ ఆగేంతవరకు’ అంటూ తెలంగాణ సమస్త ప్రజానీకం పోరాడాలి.
                                                                               -చిక్కుడు ప్రభాకర్

No comments:

Post a Comment