Friday 21 December 2012

కాకతీయ వైభవం..


                                    
 ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం విశిష్టమైంది. అందుకు కారణం వారు అనుసరించిన ఉదార విధానాలు, చేసిన కళాసేవ. 
                                                              - ఆచార్య పోలవరపు హైమవతి
               అసలు కాకతీయులు అనగానే గభాలున గుర్తొచ్చేది వారి నీటి పారుదల విధానం. ఆలయాల నిర్మాణం కంటే చెరువుల నిర్మాణంపైనే వారు ఎక్కువ ఖర్చు చేశారు. దీక్షతో నిర్వహించారు. జలసాధన సంతోషాన్ని శిల్పం ద్వారా ప్రకటించి, ఆ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. వారు నిర్మించిన తటాకాలు నేటికీ వేలాది ఎకరాల సాగుకు ఉపయోగ పడుతున్నాయి. వారి నిర్మాణాలు ముఖ్యంగా ఆలయాలు, అందులోని శిల్పకళా ఖండాలు వారి ఉన్నతాభిరుచిని, నాటి కళాకారుల నైపుణ్యాన్ని, భావ ఔన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్తున్నాయి. వారి స్మృతి చిహ్నాలుగా మిగిలిన వీటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
             కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా సుమారు క్రీ.శ.1000 నుండి 1157 వరకు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగాను 1158 నుండి 1323 వరకు స్వతంత్రులుగాను పాలించారు. శాసనాధారాలను బట్టి కాకర్త్య గుండ్యన ఈ వంశ మూల పురుషుడు. ‘కాకతీయ’ అనే పదానికి సంస్కృతీకరణమే ‘కాకర్త్య’.
      కాకతీయుల కులదేవత ‘కాకతి’ అనీ, మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారనీ, ఆ తర్వాత స్వయంభూదేవుని ఆరాధకులయ్యారనీ చారిత్రక సమాచారం ఉంది. కాజీపేట శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ సాంప్రదాయానికి (తీగకు) చెందిన వారని తెలుస్తోంది. 
            జైన దేవత గుమ్మడమ్మ (కుషాండిని) కి మరోపేరు కాకతి. ఈమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత. కాకతీయులు తమను తాము ‘దుర్జయుల’మని చెప్పుకున్నారు. అంటే ‘జయింప శక్యం కాని వారు’ అని అర్థం. కాకలు తీరిన వీరులుగా వీరు కాకతిని యుద్ధదేవతగా కొలిచారు. ‘కాకతికి సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉంది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచర్లలో ఉంది. కొన్ని శాసనాల్లో ‘కాకతి’ వీరి కులపురమని చెప్పబడింది. అయితే, ఆ గ్రామం లేదా పట్టణం ఎక్కడ ఉందో గుర్తించటం ఇప్పుడు కష్టంగా ఉంది.
    కాకతీయ వంశానికి సంబంధించి లభ్యమైన శాసనాల్లో మొట్టమొదటిది క్రీ.శ. 956 నాటి మాగల్లు శాసనం. ఈ శాసనాన్ని బట్టి గుండియ రాష్ట్రకూటుడు కాకతీయుల మూల పురుషుడు. గణపతిదేవుని సోదరి మైలమ (ధర్మకీర్తి) తన తల్లి బయ్యలదేవి పుణ్యం కోసం చెరువు తవ్వించి బయ్యవరం గ్రామాన్ని సకల సదుపాయాలతో నిర్మించి శాసనం చేయించింది. దాని ప్రకారం తొలి కాకతీయుల వంశవృక్షం ఇలా ఉంది. దుర్జయ వంశంలో- వెన్ననృపుడు - గుండయ(1)-గుండయ(2)-గుండయ(3)- ఎరియ లేదా ఎర్రనృపుడు- (పిండి) గుండయ(4)-బేత(1)పోల(1)-బేత(2)పోల(2)-రుద్రదేవుడు-గణపతిదేవుడు అనేవారు జన్మించారు.
       క్రీ.శ.973లో రాష్ట్రకూటుల అధికారం పతనమయ్యేవరకు వారికి విధేయుడిగానే ఉన్నాడు. ఆ తర్వాత నేటి తెలంగాణగా ఉన్న ప్రాంతం చాలా వరకు పశ్చిమ చాళుక్యుల వశమైంది. ఈ పరిస్థితుల్లో గుండయ పశ్చిమ చాళుక్యుల వైపుగాని తూర్పు చాళుక్యుల వైపుకాని చేరకుండా తటస్థంగా ఉన్నాడు. ఇంతలో ముదిగొండ చాళుక్యులు విజృంభించి కొరవిసీమను ఆక్రమించుకున్నారు. ఆ ఘర్షణలలో గుండయ ముదిగొండ చాళుక్యుల చేతిలో హతమయ్యాడు. అతని సోదరి కామసానమ్మ మేనల్లుడైన బేతనను దగ్గరకు తీసి పశ్చిమ చాళుక్యులతో దౌత్యం నెరపి కొరవిసీమ నుండి హన్మకొండ వరకు కాకతీయాధికారాన్ని నిలిపింది. ఈ విధంగా కాకతీయ యుగంలో స్త్రీల సాధికారతకు బీజం వేసింది కామసానమ్మ. ఆమె భర్త విరియాల ఎర్రభూపతి గొప్ప సేనానాయకుడు.
           కాకతీయ బేతరాజు మొదట వేల్పుకొండ (జఫర్‌గడ్) కేంద్రంగాను, హన్మకొండ వరకు అధికారం విస్తరించిన తర్వాత హన్మకొండ రాజధానిగాను క్రీ.శ.1052 వరకు పాలించాడు. తర్వాత అతని కుమారుడు ప్రోలరాజు క్రీ.శ. 1052 నుండి 1076 వరకు పాలించాడు. తర్వాత రెండో బేతరాజు క్రీ.శ. 1076 నుండి 1108వ సంవత్సరం వరకు పాలించాడు.
       ఇతని కొడుకు దుర్గరాజు క్రీ.శ.1108 నుండి 1117 వరకు పాలించాడు. ఆ తర్వాత ఏ కారణం వల్లో దుర్గరాజును త్రోసిరాజని రెండో ప్రోలరాజు అధికారంలోకి వచ్చాడు. ఈతడే స్వయంభూ ఆలయాన్ని ఏకశిలా నగరంలో మొదటగా నిర్మించాడు. ఏకశిలానగర (కోట నగరం) నిర్మాణానికి దీంతో బీజం పడినట్లైయింది.
రెండో ప్రోలరాజు క్రీ.శ.1117 నుండి 1157 వరకు పాలించాడు. ఈయన గొప్ప వీరుడు. తన ప్రభువైన చాళుక్య రెండో జగదేకమల్లుని అధికారం నేటి తెలంగాణగా ఉన్న ప్రాంతమంతటా విస్తరింపజేసి అది సుస్థిరమయ్యేందుకు తీవ్ర కృషి చేశాడు. అనేక బావులను, చెరువులను, పంటకాలువలను తవ్వించి ‘దారిద్ర్య  విద్రావణ’ అనే బిరుదును పొందాడు. ‘దరిద్ర్యాన్ని నీరుగార్చి పారదోలిన వాడని’ దీని అర్థం.

స్వతంత్ర పాలకులుగా కాకతీయులు నకీ.శ.1158-1323):

         రెండో ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు క్రీ.శ. 1158-1195 సంవత్సరాల మధ్యకాలంలో కాకతీయ రాజ్యాన్ని పాలించాడు. క్రీ.శ. 1163 నాటి వేయిస్తంభాల గుడి శాసనం ఇతని విజయాల గురించి వివరిస్తున్నది. కర్ణాటకంలో బిజ్జులుని విజృంభణతో ఆంధ్రదేశంలో తానూ స్వతంవూతించి రాజ్యపు ఎల్లల్ని విస్తరింపజేశాడు. ఇంతవరకు కాకతీయులు తెలంగాణంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాల్లో చేసిన కృషివల్ల వ్యవసాయం మీద ఆధారపడి నడిచిన పరిక్షిశమలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తుల్ని సాధించాయి. వాటికి అంతర్జాతీయంగా గిరాకీ సాధించాలంటే ఓడరేవు పట్టణాలు కావాలి. అందుకోసం సాగరసీమను జయించాలనుకున్నాడు. పల్నాటి యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నపుడు నాయకురాలు నాగమ్మకు సైనిక సాయం అందించి బాగా లాభం పొందాడు. అపర కురుక్షేత్ర సంగ్రామంగా పేరు పొందిన పల్నాటి యుద్ధంతో కర్నూలు, గుంటూరు, కృష్ణా దిగువ నల్గొండ జిల్లా ప్రాంతాల్లో దిగజారిన పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని ఆయా ప్రాంతాలపై కాకతీయాధికారాన్ని స్థాపించాడు. గోదావరీ తీరంపై దాడికి వెళ్లక ముందే సబ్బిసాయిర మండలం (కరీంనగర్) పైకి దేవగిరి పాలకుడు జైతుగి దండెత్తి వచ్చాడని తెలిసి హుటాహుటిన కొంత సైన్యంతో తిరిగి వచ్చాడు. కాని, దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో (1195) లో మరణించాడు.
       ఈయన అరివీర భయంకరుడై తాను రాజ్యానికి రాగానే తిరుగుబాటు చేసిన వారిని కఠినంగా శిక్షించి తెలంగాణం నుండి సాగరసీమలో పశ్చిమ ప్రాంతమంతా తన అధికారాన్ని నెలకొల్పగల్గాడు. సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయ నిర్మాత ఈయనే. అంతేకాదు. తండ్రి తలపెట్టిన కొత్త రాజధాని ప్రణాళిక ప్రకారం అనేక నిర్మాణాలను చేశాడు.
రుద్రదేవునికి సంతానం లేకపోవడం వల్ల తమ్ముడు మహాదేవుని కుమారుడు గణపతిదేవుని దత్తత తీసుకున్నాడు. ఈయన మరణం అనుకోకుండా యుద్ధరంగంలో జరగటం వల్ల మహాదేవుడు క్రీ.శ 1195లో అధికార బాధ్యతలు చేపట్టాడు. రుద్రుని మరణానికి కారణమైన జైత్రపాలునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో మహాదేవుడు యాదవ రాజ్యంపై దండెత్తి యుద్ధరంగంలో మరణించాడు. గణపతిదేవుడు యాదవులకు బందీగా చిక్కాడు. ఏ కారణం చేతనో యాదవులు 11 నెలల అనంతరం గణపతిదేవుని చెరనుండి వదిలివేశారు. కాకతీయ రాజ్యంలో రాజు లేకపోయినా సామంతులు, సేనా నాయకులు, మంత్రులు ఒక్క అంగుళం భూభాగం కూడా పోగొట్టకుండా రాజ్యాన్ని కాపాడారు. బహుశా గణపతిదేవునికి యాదవ రాకుమ్తాతో వివాహ ప్రతిపాదనకు అంగీకరించి విడుదల చేయించి ఉంటారు. ఈ వివాహం గురించిన ప్రస్తావన ప్రతాప చరివూతలోను, చింతలూరు శాసనం లోనూ ఉంది.
         ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయ ప్రభువులందరిలో గొప్పవాడుగా ఎన్నదగినవాడు గణపతిదేవుడు. గొప్ప ఉదార పాలకుడు. అన్ని వర్గాల వారిని కలుపుకుపోవాలని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలనా పద్ధతులను తీర్చిదిద్దాలనీ, మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని, జానపద, గిరిజన కళలను, సంస్కృతులను ప్రోత్సహించి పండిత పామరవర్గాల మధ్య దూరాన్ని తగ్గించాలని ఇలా ఎన్నో రకాలుగా కృషి చేసి గొప్ప పాలకుడిగా చరివూతలో నిలిచిపోయాడు. ఈయన క్రీ.శ. 1199 నుండి 1259 వరకు అంటే తన పాలనాకాలానికి షష్టిపూర్తి అయ్యేంత వరకు పాలించాడు. తర్వాత రుద్రమదేవికి సలహాదారుగా 1269 వరకూ రాజ్య వ్యవహారాలు చూశాడు.
    తన పెదతండ్రి ఆశయమైన అఖిలాంవూధావని స్థాపనను సాధించాలని తన సైన్యాలను బెజవాడవైపు నడిపించి వెలనాటి పృధ్వీశ్వరుణ్ణి ఓడించాడు. దివిసీమ వైపు నడచి అక్కడ అయ్యపు పినచోడుని ఓడించి అతని కుమ్తాలైన నారాంబ, పేరాంబలను వివాహమాడి, వారి సోదరుడైన జాయపసేనానిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ రాణులకు కల్గిన సంతానమే ఈ తర్వాత ధరణికోటను పాలించిన గణపాంబ, అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన రుద్రమ. ఆ తర్వాత ఆయన తన సైనిక విజయాలతో ఉత్తరాన బస్తర్ జిల్లా నుండి దక్షిణాన కంచి వరకు, తూర్పున సముద్రం నుండి పశ్చిమాన దాదాపు ఔరంగబాద్ వరకు, ఈశాన్యాన గంజాం జిల్లా వరకు గల తెలుగు వారి అధికారాన్ని నెల కొల్పాడు. రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చింది ఈయనే.
     తిక్కసిద్ధి గణపతిదేవుని సాయం కోరటానికి వచ్చి ముందుగా వెలనాటి యుద్ధంలో గణపతిదేవునికి సాయం చేశాడు. అంతేకాదు, తుదివరకు ఎన్ని సమస్యలు వచ్చినా నెల్లూరు వారికి బాసటగా నిలవటమేకాక అఖిలాంవూధావనిని ఏకచ్ఛవూతాధిపత్యం కిందికి తెచ్చినా శరణు వేడిన నెల్లూరు రాజ్యాన్ని మాత్రం ఆక్రమించలేదు. ఆ తరువాత గోదావరీ పరీవాహక వూపాంతాన్ని కాకతీయ రాజ్యంలో కలపటానికి సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం ఉదయగిరి, గంజాం, బస్తరు, చక్ర కూటం, మంథెన, కాడి, గోగులనాడు, కొలను, మాడియం, ద్రాక్షారామం మొదలైన ప్రాంతాలను కాకతీయ రాజ్యంలో కలపటంలో విజయాన్ని సాధించింది. గోదావరీ తీర ప్రాంతంలో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమను చాళుక్య యువరాజు వీరభద్రునికిచ్చి వివాహం చేశాడు.
       క్రీ.శ.1248లో తిక్కభూపతి మరణించాడు. మళ్లీ జాతుల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. గణపతిదేవుడు ఈసారి కూడా నెల్లూరును ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి తిక్కన సోమయాజి రెండో మనుమసిద్ధి తరుఫున ఓరుగల్లుకు మారువేషంలో వచ్చి గణపతి దేవుని దర్శనభాగ్యం పొంది సమస్యను వివరించాడు. గణపతిదేవుడు రెండో మనుమసిద్ధికి సాయం చేయటానికి సబ్బి మండలాన్ని (కరీంనగర్ ప్రాంతం) పాలించే సామంత భోజుని నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు.
గణపతి దేవుడు దేవగిరి సేనలతో కూడా సత్సంబంధాలను కొనసాగించాడు. ఆయన పాలనా కాలంలో దేవగిరి నుండి ఒక్క దండయాత్ర కూడా రాలేదు. పైగా ఆయన చేసిన యుద్ధాలలో వారి సైన్యం, సైనికాధికారులు పాల్గొని గణపతిదేవుని విజయానికి కృషి చేశారు. 
     గణపతి దేవుడు తన సుదీర్ఘ పాలనా కాలంలో అనేక ఘన విజయాలను సాధించాడు. ఇంతవరకు ఓటమిని చవిచూడలేదు. అందుకు కారణం వినవూమతతో కూడిన ఆయన వ్యక్తిత్వం, ధర్మచింతనతో కూడిన ఆయన కార్యాచరణ ప్రణాళిక. వాటివల్లనే ఆయన తన అనుచరుల సహాయ సహకారాలను పూర్తిగా పొందాడు. కాని చివరి దశలో తాను నమ్మిన దేవగిరి పాలకుల ద్రోహచింత వల్లను, దుర్నీతిని పాటించిన పాండ్యుల కుటిలతంత్రం వల్లను 1262లో ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సైన్యం ఓడిపోయింది.
          అప్పటికే అంటే క్రీ.శ.1259లో రుద్రమను పట్టోధృతిగా ప్రకటించడం ఇష్టం లేని యాదవ సైన్యం హృదయ పూర్వకంగా కాకతీయుల సైన్యంతో కలసి నెల్లూరును రక్షించడంలో పాల్గొనలేదు. బహుశా పాండ్యులు, నెల్లూరు, ములికి నాటి ప్రాంతాలలో ఉన్న అసంతృప్తికారుడు అంబదేవుడు కూడా కాకతీయులకు వ్యతిరేకంగా జరిగే కుట్రలో యాదవులను భాగస్వాములు చేశాడు. ఒక విభాగానికి నాయకత్వం వహించి ద్రాక్షారామంలో పాండ్యులపై విజయం సాధించిన గణపతిదేవుడు తన సైన్యంతో నెల్లూరు వైపు నడుస్తున్న సమయంలో అర్థాంతరంగా కాకతీయ సైన్యం కకావికలమైంది. బహుశా యాదవుల, ఇతర కాకతీయ తిరుగుబాటు నాయకుల సైన్యం కాకతీయ సేనలతోనే తలపడడంతో గందరగోళంలో పడి వెనుదిరగక తప్పలేదు. ఎదురు చూడని ఈ పరిణామంతో ఏర్పడిన ఉపవూదవ పరిస్థితుల్లో యుద్ధం కొనసాగించడం అవివేక మౌతుందని గణపతిదేవుడు భావించాడు.
              క్రీ.శ.1262లో ముత్తుకూరు వద్ద జరిగిన ఈ యుద్ధ సన్నివేశంతో గణపతిదేవుడు తానిక క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకోవాలనే ఒక ముఖ్య నిర్ణయం తీసుకుని, పాలనాధికారాలతో పాటు సైనికాధికారాలు కూడా రుద్రమకు ఇచ్చి ‘రుద్రమదేవమహారాజు’ అనే పేరుతో ఆమెకు పట్టాభిషేకం చేశాడు. ఇప్పటివరకు ‘మహామండలేశ్వరులు’గా చెప్పుకున్న కాకతీయ సంప్రదాయాన్ని మార్చి ‘మహారాజుంగారు’ గా రుద్రమను పరిచయం చేయటంలో విశేషం ఉంది. స్త్రీ రాజ్యపాలన చేయడం కొత్త విషయం. అందువల్ల కొందరు (అంబదేవుని వంటివారు) చులకన చేయవచ్చు. శత్రువులు తక్కువ అంచనా వేయవచ్చు. అందువల్ల ఎన్నో రకాలుగా ఆమె సాధికారతను సుస్థిరం చేయాల్సి ఉంది. అందుకే, గణపతిదేవుడు దానికి అవసరమైన దర్పాన్ని కల్పించి, అందుకు తగిన వస్త్రధారణను కూడా సూచించాడు. ఆమె ఎప్పుడూ పురుషవేషంలోనే ఉండి రాజ్యకార్యాలను నిర్వహించేది. అంతేకాదు, ఆమె మనుమడైన ప్రతాపరుద్రుని రుద్రమకు దత్తత నిప్పించాడు. ఈ విధంగా ఆమె రాజకీయ జీవన బాటను సాధ్యమైనంత వరకు నిష్కంటకం చేసి క్రీ.శ. 1269-70 ప్రాంతంలో కన్నుమూశాడు.
       రుద్రమ అఖిలాంధ్రావనికే పాలకురాలైతే, ఆమె సోదరి కోట రాజ్యాన్ని 40 సంవత్సరాల పాటు సమర్థవంతంగా పాలించి మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల మన్ననలు పొందింది. మోటుపల్లి ఓడరేవు పట్టణం ఆమె రాజ్యంలో ఒక బహుళజాతి పట్టణంగా వెలుగొందింది. వివిధ దేశాలకు, భాషలకు చెందిన వారు ఈ పట్టణంలో నివసించేవారు. ఆమె తన శక్తి సామర్ధ్యాలతో పరిశ్రమలను, వర్తక వాణిజ్యాలను అభివృద్ధి పరచిందనీ, దాతృత్వంతో ప్రజల హృదయాలను చూరగొన్నదని, మర్యాద పూర్వక ప్రవర్తనతో విదేశీయుల మన్ననలను పొందుతున్నదని అభిప్రాయపడ్డారు. మార్కోపోలో వ్రాశాడు.
           స్త్రీ పురుష సమానత్వ సాధనకే గాక వివిధ వర్గాలు సామాజికంగా సమానత్వాన్ని సాధించాలనే తపన గణపతి దేవునిలో కనపడుతుంది. తన సైన్యంలో అన్ని వర్గాల వారికి, కులాల వారికి సమాన అవకాశాలిచ్చాడు.
రుద్రమదేవి (క్రీ.శ.1259 - 1289)
                               
తండ్రికి తగిన తనయగా రుద్రమదేవి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఒక ప్రసూతి ఆలయం, జ్వరాలయం, విద్యాకేంవూదాలతో గోళకి మఠాన్ని నెలకొల్పేందుకు వీలుగా విశ్వేశ్వర శివాచార్యులకు వెలగపూడితో సహా మందర(డం) గ్రామాన్ని దానం చేసింది. రుద్రమ రాజ్యానికి రావటం ఇష్టం లేని దేవగిరి రాజు మహాదేవుడు తన మేనల్లుడైన హరిహర మురారి దేవుల తరుఫున కాకతీయ రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. వీరు గణపతిదేవునికి మహాదేవుని సోదరి అయిన సోమలదేవి వల్ల కలిగిన సంతానం.
      గణపతి దేవునికి నారాంబ, పేరాంబల వల్ల కల్గిన సంతానం గణపాంబ, రుద్రమలు. వీరి సవతి తమ్ముళ్ళు హరిహర, మురారి దేవులు. వీరిని కాదని క్రీ.శ.1259 లో గణపతి దేవుడు రుద్రమను ‘పట్టోధృతి’ గా ప్రకటించడం మహాదేవునికి మింగుడు పడని విషయమైంది. అప్పటివరకు కాకతీయ సైన్యంలో 60 సంవత్సరాల పాటు ప్రతి యుద్ధంలో కీలకపాత్ర నిర్వహించిన యాదవులు క్రమంగా శత్రుభావాన్ని పెంచుకున్నారు. బహుశా ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సైన్యం ఖంగు తినడానికి కారణం యాదవులు అంబదేవునితో కలసి శత్రువులైన పాండ్యులతో కలసి కుట్ర పన్నడమే. అందువల్లే ఇక ఆగకుండా గణపతిదేవుడు వెంటనే 1262లోనే రుద్రమకు సైనికాధికారాలను కూడా అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. విధవను అపశకునంగా భావించే ఉత్తరాది సంస్కృతికి భిన్నంగా దక్షిణాదిన వితంతువులైన స్త్రీలు ప్రశాంతంగా సజ్జీవనం గడుపుతూ సమాజసేవలో సమర్థులుగా తమను తాము నిరూపించుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మధ్య తరగతి నుండి వచ్చిన నాయకురాలు నాగమ్మ పధానిగా), పాలకవర్గం నుండి వచ్చిన కోట గణపాంబ, రుద్రమ, చాగి ముప్పలదేవి, విరియాల సాగసాని, కోట బయ్యలదేవి మొదలైన వారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కూలిపని చేసుకునే ఒంటరి స్త్రీలు కూడా సమాజసేవలో, తటాక నిర్మాణాల్లో ఏ విధంగా పాలు పంచుకున్నదీ బసవపురాణం చెప్తూంది.
          ఏమైతేనేం, రుద్రమ రాజ్యానికి రాగానే యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపైన దండెత్తి రావటంతో రుద్రమ రణరంగంలో వీర విహారం చేసి మహాదేవుని బెడద కోట (బీదర్) వరకు తరిమి కొట్టింది. తాను ఓరుగల్లు కోటలో బంధించిన యాదవ సైనికులను పెద్ద మొత్తంలో (కోటి బంగారు నాణాలు) యుద్ధ నష్టపరిహారం తీసుకుని వదిలి పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుద్రమ ‘రాయగజకేసరి’ బిరుదును ధరించింది. పాలకురాలిగా రుద్రమ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఆమె అత్తింటి వారు నిడదవోలు ప్రాంతంలో స్వతంవూతంగా పాలించడం మొదలు పెట్టారు. వారిని చూసి ఇరుగుపొరుగు గవర్నర్లు కూడా స్వతంవూతంగా శాసనాలు జారీ చేయడం మొదలైంది. ఇదే అదనుగా తూర్పు నుండి కళింగ గంగరాజు భానుదేవుడు గోదావరి తీరంలోకి చొచ్చుకు రావాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ విషమ పరిస్థితుల్లో రుద్రమ విజ్ఞతతో ప్రవర్తించి పరిస్థితులను చక్కదిద్దింది. గాంగులపై విజయాన్ని సాధించటమే గాక తూర్పున గోదావరి తీరాన్ని కాకతీయ రాజ్య సరిహద్దుగా పటిష్టం చేసింది.
                  కడప పాలకుడైన అంబదేవునికి రుద్రమ రాజ్యానికి రావడం ఇష్టం లేదు. అతని పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వారు కావటం వల్ల ఆ అభిమానంతో బహుశా రుద్రమ తమ్ముళ్లు హరిహర మురారి దేవుల పక్షపాతిగా ఆమెపట్ల శతృత్వభావం వహించాడు. పాండ్యులను, దేవగిరి పాలకులను కూడా ఆమెకు వ్యతిరేకంగా కూడ గట్టి తిరుగుబాటు చేశాడు. వల్లూరు రాజధానిగా స్వతంత్రతను ప్రకటించాడు. అంబదేవుని ఆగడాలను ఎదుర్కోవడానికి రుద్రమ తన సైన్యాన్ని సిద్ధం చేసింది. ప్రతాపరుద్రుడు వ్యుహరచన చేశాడు. సైన్యం మొత్తం మూడు భాగాలుగా విడిపోయి ముక్కోణంలో శత్రువులను ఎదుర్కొన్నారు. ఒక విభాగానికి ప్రతాపరుద్రుడు రెండో విభాగానికి అడిదం మల్లుసేనాని, మూడో విభాగానికి స్వయంగా రుద్రమ నాయకత్వం వహించారు. దురదు ష్టవశాత్తూ త్రిపురాంతకం వద్ద అంబదేవునితో జరిగిన యద్దంలో రుద్రమ ప్రాణాలు కోల్పోయింది. ఆమె వయస్సు అప్పటికీ 80 సంవత్సరాలకు పైబడే ఉంది. క్రీ.శ 1289 నవంబర్‌లో ఆమె సైన్యాధికారి మల్లికార్జున నాయకునితో సహా యుద్ధ రంగంలో ప్రాణాలు విడించిందని నల్గొండ జిల్లా చందుపట్ల శాసనం వల్ల తెలుస్తోంది. ఈ విధంగా మొక్కవోని పట్టుదలతో ఆంధ్రరాజ్య పరిరక్షణ కోసం 80 సంవత్సరాల పైబడిన వృద్ధాప్యంలో కూడా స్వయంగా యుద్ధరంగంలో పోరాడుతూ వీరమరణం పొందిన రుద్రమ చరిత్రపుటల్లో మహిళా శక్తికి ప్రతీకగా నిలచింది.
          నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా ప్రజాపాలనను గాని, అభివృద్ధి కార్యక్షికమాలను గాని రుద్రమ నిర్లక్ష్యం చేయలేదు. ఓరుగల్లు కోటకు మరమ్మత్తులు చేయించి రాతి కోటకు లోవైపున మెట్లు కట్టించింది. మట్టికోటకు బురుజులను, అగడ్తను నిర్మించి కోటను దుర్భేద్యంగా మార్చింది. రుద్రమ తర్వాత ఆమె దత్తపుత్రుడు (మనుమడు) అయిన ప్రతాపరువూదుడు రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ. 1289లోనే రుద్రమ మరణించినా 1295 వరకు ఇతడు శాసనాల్లో కుమార ప్రతాపరువూదుడిగానే కన్పిస్తాడు. బహుశా రుద్రమ వీరమరణం, దాని తర్వాత ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితిని చక్కదిద్ది, అంబదేవునిపై ప్రతిచర్య తీసుకునే వరకు పట్టాభిషేకాన్ని జరుపుకోరాదని భావించి ఉండవచ్చు. ముందుగా ప్రతాపరుద్రుడు సైనికశక్తిని పటిష్టం చేయటానికి పూనుకున్నాడు. నాయంకర విధానాన్ని రూపొందించి సైనిక వ్యవస్థను క్రమబద్ధీకరించాడు. క్రీ.శ. 1291లో అంబదేవుని త్రిపురాంతకం నుండి పారవూదోలారు. అంబదేవునితో చేతులు కలిపి రుద్రమ వీరమరణానికి కారకులైన పాండ్యులను, దేవగిరి పాలకుల్ని పలుచోట్ల ఓడించి క్రీ.శ. 1294 నాటికి తుంగభద్ర అంతర్వేది ప్రాంతంలోని పటిష్టమైన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయాల తర్వాత క్రీ.శ. 1295 లో కుమార ప్రతాపరువూదుడు ‘వీర ప్రతాపరుద్ర మహారాజుగా’ పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత పాండ్యులను కంచి నుండి పారవూదోలాడు.
ఢిల్లీ సుల్తానుల దాడులు:
    
అల్లా ఉద్దీన్ ఖిల్జీ నుండి మహ్మద్ బిన్ తుగ్లక్ వరకు ఢిల్లీ సుల్తానులు క్రీ.శ.1303-1323 సంవత్సరాల మధ్య ఏడు సార్లు దండెత్తి రాగా కొన్నిసార్లు కాకతీయులు విజయం సాధించారు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించక దక్షిణ దండయాత్రల్లో ఉండడం వల్ల సంధి చేసుకోవలసి వచ్చింది.
పతనం: చివరగా 1323లో ఉల్లూఖాన్ (యువరాజైన మహ్మద్‌బిన్‌తుగ్లక్) నాయకత్వంలో రెండుసార్లు దండెత్తాడు. మొదటిసారి వచ్చిన దండయావూతలో కాకతీయ సైన్యం ఘనవిజయం సాధించింది. విజయ కేతనాలను ఎగురవేసి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కోటలో ఉన్న ధాన్యాన్ని కూడా ప్రతాపరువూదుడు ప్రజలకు పంచిపెట్టాడు. ఇంతలో అనుకోకుండా ముస్లిం సేనలు హఠాత్తుగా వచ్చిపడ్డాయి. చుట్టు పక్కల గ్రామాలను తగులబెట్టారు. మండువేసవి. నీరు కోటలోకి పోకుండా గండ్లు కొట్టారు. కోటను చుట్టుముట్టారు. బొబ్బాడ్డి అనే నాయకుణ్ణి తమవైపుకు తిప్పుకున్నారు. బహుశా లంజపాతరదిబ్బ వద్ద మట్టి కోటకు గండికొట్టారు. కోటలో ప్రవేశించిన పద్మనాయక వీరులు ధైర్యం వీడక పోరాడుతూ ఒక్కొక్కరూ బలైపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, స్త్రీలు హాహాకారాలు వినలేక ప్రతాపరువూదుడు కోట బయటకు వచ్చి లొంగిపోయాడు. ఈసారి ఉల్లూఖాన్ సంధికి అంగికరించలేదు. ప్రతాపరువూదుని ఢిల్లీకి బందీగా పంపుతుండగా అవమానంతో దారిలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చారివూతకాధారాల వల్ల తెలుస్తూంది.
                 ప్రతాపరుద్రుడు ఓడిపోయిన తర్వాత సంధి చేసుకుంటాడని, ఆ తర్వాత తమ శక్తి సామర్థ్యాలను, పద్మనాయకుల అసమర్థతను అంగీకరించి తమకు తగిన స్థానాన్ని కల్పిస్తాడని బొబ్బాడ్డి, అతని అనుచరులు ఆశించారు. అనుకోకుండా జరిగిన పరిణామానికి చింతించారు. ఓరుగల్లుకు ‘సుల్తాన్‌పూర్’ అని ఉల్లూఖాన్ నామకరణం చేశాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన నాయకులకు ఉన్నత పదవులిచ్చాడు. ప్రతాపరువూదుని కటక (కోట) పాలకుడైన కన్ను (నాగయగన్నయ) ఉల్లూఖాన్ మన్ననకు పాత్రుడై మతాంతరీకరణ చెందిన మాలిక్ మక్బూల్‌గా ఇక్కడ గవర్నర్‌గా నియమింపబడ్డాడని షామ్సీసిరాజ్ అఫీస్ రచనను బట్టి తెలుస్తూంది. ఈ అంశం కూడా మంత్రుల, సామంతుల ద్రోహచింతన పట్ల అనేక అనుమానాలకు తావిస్తున్నది. సామంతుల సైన్యం ఎక్కువై ప్రభువు సైన్యం తక్కువైనపుడు ప్రభువు పని చిక్కుల్లో పడుతుంది. అదే కాకతీయ రాజ్య పతన సమయంలో జరిగింది.
కాకతీయ రాజ్య పతనానికి ఇంకా ఎన్నో అంశాలు దోహదపడ్డాయి. ఎన్నో సంవత్సరాలుగా శ్రమించి సాధించిన తెలుగువారి ఐక్యత దెబ్బతిన్నది. ఆంధ్రదేశం ముక్క చెక్కలైంది. ఓరుగల్లు బావురుమన్నది. దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. పంటలు, పరిక్షిశమలు నాశనమయ్యాయి. శాంతి భద్రతలు కరువై, వర్తక వాణిజ్యాలు అడుగంటాయి.
              మళ్ళీ ఓరుగల్లుపై ఆధిపత్యం కోసం వివిధ రాజ్యాల మధ్య పోరు ప్రారంభమైంది. ఇక్కడ కాకతీయులు సాధించిన జలసమృద్ధి, వ్యవసాయ, వర్తక వాణిజ్యాల అభివృద్ధి తత్ఫలితంగా ఓరుగల్లు రవాణాకు కూడలిగా మారటం వంటివి ఈ ఆకర్షణకు మూల కారణాలు.
కాకతీయాధికారం అంతమైనా, వారి పాలనా ప్రభావం దానిలోని ఉన్నత లక్షణాల వల్ల, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వల్లనూ, ఆ తరువాత ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రభువులు, ముఖ్యంగా విజయ నగరాధీశులు, కుతుబ్‌షాహీ సుల్తానులు, కాకతీయ పాలనాంశాలను చాలా వరకు అనుసరించి కొనసాగించారు. విజయ నగరాధీశుల అమర నాయంకర విధానానికి పునాది వేసినవారు కాకతీయులే. 16,17 శతాబ్ధాల్లో ఆంధ్రదేశాన్ని పాలించిన కుతుబ్‌షాహీల పాలనలో కాకతీయుల పన్నిద్ధరు ‘ఆయగాండ్ర’ పద్ధతి ‘బారాబలవంతుల’ పద్ధతిగా మారి గ్రామ పాలనలో కొనసాగింది. నీటి తీరువాలో కాకతీయులు ప్రవేశపెట్టిన దశబంధ విధానాన్ని, పూడికతీత కార్యక్షికమాలను సుల్తానులు యధాతథంగా కొనసాగించారు. సైనిక వ్యవస్థలో కాకతీయుల లెంకల విధానాన్నే ‘ఖాసాఖైల్’ పద్ధతిగా కొనసాగించారు. అదే విధంగా వ్యవసాయాభివృద్ధిలోను, ఉద్యానవన కృషిలోను కాకతీయుల విధానాలను కుతుబ్‌షాహీలే కాక ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ కూడా అనుసరించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ వద్ద ఉపవూపధానిగా ఉన్న మాలిక్ మక్బూల్ (గన్నయ నాయకుడు) దశబంధ విధానాన్ని ఢిల్లీ రాజ్యంలో ప్రవేశపెట్టడమే గాక ఉద్యానవన కృషి ద్వారా రాజ్యపుటాదాయాన్ని పెంచడానికి కృషి చేశాడు. ఈ విధంగా కాకతీయ పాలన సమకాలీన ప్రభువులకు, తదనంతర పాలకులకు సైతం మార్గదర్శకం అయింది.
           ఇప్పటికే చాలా వరకు చెరువులు పూడికలు తీయక కప్పులు, సాసర్ల రూపంలోకి మారాయి. నాడు అతి విశాలంగా, లోతుగా ఉండి సమువూదాలుగా పిలువబడిన బాల సముద్రం వంటి జలశయాలు ఇళ్ల స్థలాలుగా మారి చిరునామా కోల్పోయాయి. ఉన్నవాటిని పరిరక్షించుకోవటం, బాగా పాడైన వాటిని పూడికలు తీయించి వాడకంలోకి తేవటం ప్రస్తుత కర్తవ్యం. అదే మనం ఆనాటి నిర్మాతలకు సమర్పించే నివాళి. అప్పుడే అది మన తరానికి, ముందు తరాలకి వారసత్వంగా వచ్చిన తరగని పెన్నిధి అవుతుంది.
కాకతీయులు గరుడాంక చిహ్నం కలిగిన రాష్ట్రకూటులు కాబట్టి, వారు రాష్ట్రకూట వంశస్థులని, మహారాష్ట్ర ప్రాంతం నుండి ఆంధ్రదేశానికి వలన వచ్చిన వారని గుండయ, ఎరియల పేర్ల చివర ఉన్న రాష్ట్రకూట శబ్ధమే ఇందుకు తార్కాణమని కొందరు అభివూపాయపడ్డారు. కానీ, ఇది ఏ మాత్రం సబబు కాదనిపిస్తుంది. ఎందుకంటే, రాష్ట్రకూట శబ్ధం ఇందుకు ముందు చెప్పుకున్నట్లు రట్టడిగా గ్రామాధికారులకు కూడా చాళుక్య శాసనాల్లోనూ ఉంది. రాష్ట్రకూటుల వద్ద సైనిక వృత్తిలో ఉన్నమాట వాస్తవమే, కానీ, రాష్ట్ర కూటుల ఆక్రమిత ప్రాంతాలైన ఆంధ్రదేశంలోనే వారున్నారు తప్ప మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న దాఖలాలు లేవు. పైగా వారి పేర్లన్నీ అచ్చతెలుగు దేశీయపదాలే, వ్యవసాయ సంస్కృతికి చెందిన పేర్లు. ‘గుండము’ అంటే ‘లోతైన చెరువు’ అని అర్థం. ‘గుండయ’ పేరు దానికి సంబంధించిందే. చలమయ్య అనే పేరు కూడా నాటికీ నేటికీ ఆంధ్రదేశంలో సాధారణమైన పేరు. అది కూడా నీటి చలమకు సంబంధించిందే. బేతరాజు పేరు భూతక్షిగాహస్వామి (పోతురాజు) నుండి వచ్చిందే. ఈ పేరు పంటలకు చీడపీడలు రాకుండా పూజింపబడే దేవుడిదే. ప్రోలయ నూర్పిడి సమయంలో పూజింపబడే దేవత ప్రోచేరాజుగా పోలరాజు) శివుడు కూడా పూజితుడయ్యాడు. బ(వ)య్యలమ్మ (చదువుల తల్లి), మైలమ (భూదేవి) కుందమ్మ (వ్వ), మేడలమ్మ, రుయ్యమ్మ, ముమ్మడమ్మ (ముగ్గురమ్మల మూలపుటమ్మ) ముప్పమ మొదలైన కాకతీయ కుటుంబీకుల పేర్లు అచ్చ తెలుగు పదాలతో కూడినవి. రుద్రదేవునితోనే సంస్కృత పేర్లతో కాకతీయ ప్రభువులు కనిపిస్తారు.
     తెలంగాణాన్ని హృదయసీమగా చేసుకుని అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన కాకతీయుల సాంస్కృతిక వారసత్వం మహోన్నతమైందిగా ప్రశంసలందుకుంది. దానికి మూల కారణం కాకతీయులు బహుముఖంగా అనుసరించిన ఉదాత్త విధానమే. అన్ని వర్గాలను- స్త్రీలను, పురుషులను, శిష్ఠులను, జానపదులను, పాలకులను, పాలితులను - అందరినీ కలుపుకుపోయే ధోరణే వారి విధానాలకు వెన్నెముక అయింది. పండితులు రూపొందించిన కళారూపాలకు, జానపదులు పొందు పరచుకొన్న కళారూపాలకు సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేసి దానిలో వారు విజయాన్ని సాధించారు. అదే వారికి చరివూతలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. 

‘రాయ గజకేసరి’ రుద్రమదేవి
- పి.వి.పరబ్రహ్మ శాస్త్రి

కాకతి రుద్రమదేవి ఒక వీరవనిత. గణపతి దేవుడి కూతురు. క్రీ.శ. 1262లో కాకతీయ రాజ్యానికి ఆమె పాలకురాలైంది. గణపతి దేవుడికి పుత్రులు లేని కారణంగా ఆమెనే పుత్రుడుగా భావించి రాజనీతితోబాటు కత్తి డాలు పట్టి ఆనాటి కదన విద్యలో మేటి యోధురాలుగా తీర్చిదిద్ది, తన రాజ్యానికి వారసురాలుగా ‘రువూదదేవుడ’నే పురుషనామంతో ఆమెను సింహాసనాధిష్ఠితురాలిని చేశాడు. ఇది సహించని కొందరు రాజ్యానికి ఉత్తరం వైపున సేవుణ రాజ్యాధిపతిఅయిన యాదవ మహాదేవరాజును ఓరుగల్లు కోటపై దండెత్తడానికి ప్రోత్సహించారు. అయితే, దేవగిరి యాదవ రాజసైన్యం ఓరుగల్లు కోటను సాధించలేక పోయింది. శత్రుసైన్యాన్ని యాదవుల రాజ్యంలో చేరిన బీదరు కోటను విడిచిపోయేట్లు రుద్రమదేవి తరిమికొట్టి ఆ కోటను తాను ఆక్రమించుకొంది. ఆ కోటకు కాకతి సైన్యాధిపతిని అధ్యక్షుడిగా నియమిస్తూ ఒక శిలాశాసనాన్ని కన్నడభాషలో గద్య పద్యాలతో రాయించి ప్రతిష్టించింది. ఇది రుద్రమదేవి మొదటి మహా విజయం. ఈ నేపథ్యంలోనే తండ్రి బిరుదైన ‘రాయ గజకేసరి’ అనే బిరుదాన్ని తాను కూడా వహించినట్లు స్పష్టమవుతోంది.

ఈ విజయ సూచకంగా ఓరుగల్లు కోటలో స్వయంభు దేవాలయానికి ముందు అనేక శిల్పాలతో అలంకరించిన రంగ మండపాన్ని ఆమె నిర్మించారు. దాని చూరుకి నలుమూలల తాను కొత్తగా వహించిన రాయగజకేసరి (శవూతురాజులైన ఏనుగులకు సింహం వంటిది) బిరుదాన్ని శిల్పరూపంలో అంటే ఏనుగు తలమీద విక్రమించిన సింహం, దాని మీద కత్తి, డాలు రెండు చేతులతో పట్టుకొని స్త్రీ యుద్ధం చేస్తూ కూర్చున్నట్లు ఆ శిల్పం మలచబడింది. ప్రస్తుతం ఈ శిల్పాలు ఓరుగల్లు కోటలో రంగ మండప శిథిలాల్లో భాగంగా కనిపిస్తున్నాయి. ఇది రుద్రమదేవి రూపమని చరివూతకారులు భావిస్తున్నారు. 
దేవతా రూపమే అయితే, నాలుగు చేతులుండాలి. ముందు రాక్షసుడు కూడా కనిపించాలి. శిల్పంలో ఆ గుర్తులు లేవు. కనుక, ఈ శిల్పాలు ‘రాయగజ కేసరి’ బిరుదానికి తగినవిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆనాటి శంభునిగుడి నాలుగు తోరణ ద్వారాల నడుమ ఇది ఉన్నట్లు అర్థమవుతోంది. దాని శిథిలాలే ఇప్పుడు మిగిలాయి.

(వ్యాసకర్త కాకతీయుల శాసనాల పరిశీలన ద్వారా ఎన్నో సత్యాలను వెలికి తీశారు. అందులో మీరు చూస్తున్న కాకతి రుద్రమదేవి శిలా చిత్రాన్ని గుర్తించింది కూడా వీరే. అట్లే, బయ్యారం చెరువు శాసనం ఆధారంగా కాకతీయుల మూలాలను వెలికి తీయగలిగారు. అంబదేవునితో జరిగిన యుద్ధంలో చందుపట్ల శాసనం ద్వారా కాకతి రుద్రమదేవి మరణించిన సంవత్సరం క్రీ.శ.1290గా నిర్ధారించటం, రాయగజకేసరి బిరుదు ముద్ర ఆధారంగా కాకతీయులు వేయించిన నాణాలను గుర్తించడం, రుద్రదేవుని హనుమకొండ శాసనాన్ని పునర్వ్యాఖ్యానించడం -ఇలా కాకతీయుల చరిత్ర నిర్మాణంలో పి.వి.పి. గా పేరొందిన వీరి కృషి ప్రసిద్ధం. ‘కాకతీయలు’ పేరిట వారు రచించిన పరిశోధనా గ్రంథం ఓ ప్రామాణిక రచనగా సర్వామోదం పొందింది.

No comments:

Post a Comment