Wednesday 19 December 2012

జనవరిలో తెలంగాణ?...


- ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం!
- నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం
- ప్రకటించడమే తరువాయి?
- ఇకపై పార్టీలో చర్చలుండవు
- రెడిఫ్ సంచలనాత్మక కథనం
న్యూఢిల్లీ: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైందా? జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుందా? అవుననే అంటున్నది రెడిఫ్‌డాట్‌కామ్ వెబ్‌సైట్. ఈ మేరకు ఒక సంచలనాత్మక కథనాన్ని వెబ్‌సైట్ పోస్ట్ చేసింది.
      తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం చేయజాలమని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించిందని రెడిఫ్ తన కథనంలో పేర్కొంది. కాంగ్రెస్‌లోని అత్యున్నత స్థాయి విశ్వసనీయవర్గాలు చెబుతున్నది నిజమే అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ నెరవేరే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని తెలిపింది. అతి త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకోనున్నట్లు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాలు తమకు తెలిపాయని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఇకపై తెలంగాణ విషయంలో తదుపరి చర్చలు ఉండబోవని తెలిపింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారని, ఒక నిర్ణయానికి వచ్చేశారని రెడిఫ్ కథనం పేర్కొంది. ఈ నిర్ణయం వెలువరించడానికి నిర్దిష్ట కాలపరిమితి ఏమీ లేనప్పటికీ.. వచ్చే ఏడాది జనవరిలో ప్రకటన ఉంటుందని అంటున్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకోలేని స్థితిలో తాను ఉన్నానని కాంగ్రెస్ భావిస్తోందని వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐదు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని, ఉద్యమం కోసం ఇప్పటికే వెయ్యి మందికిపైగా యువత ఆత్మబలిదానాలు చేశారని రెడిఫ్ డాట్‌కామ్ తన కథనంలో ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. ఈ మూడు ప్రాంతాల్లో విస్తీర్ణం రీత్యా తెలంగాణ అతిపెద్దది. మొత్తం 41శాతం భూభాగాన్ని కలిగి ఉంది. 
                  మొత్తం రాష్ట్ర ఆదాయంలో 76 శాతం తెలంగాణ నుంచే వస్తున్నదని రెడిఫ్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న రాజశేఖర్‌డ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందని ఆ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. అత్యధిక నిరసనలు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచే వచ్చాయని, ఒక దశలో తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులే నడిపారని తెలిపింది. చాలా కాలం ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన శక్తిమేరకు ప్రయత్నించిందని, అయితే పార్టీ నుంచి జగన్‌మోహన్‌డ్డి వెళ్లిపోవడంతో పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించింది. జగన్ ఏర్పాటు చేసుకున్న వైఎస్సార్సీపీ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు షేర్‌ను స్వాహా చేసిందని పేర్కొంది. జగన్ అరెస్టయి జైల్లో ఉన్నప్పటికీ.. పార్టీని ఆయన తల్లి, సోదరి నడిపిస్తున్నారని పేర్కొంది. ప్రత్యేక తెలంగాణకు జగన్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయనకు మద్దతు లభిస్తున్నదని తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందేందుకుగాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఈ దశలో ప్రకటించడం ఉత్తమ నిర్ణయం కాగలదన్న భావనలో కాంగ్రెస్ ఉందని రెడిఫ్ కథనం వ్యాఖ్యానించింది. తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రాజధాని హైదరాబాద్ విషయంలో అనేక అంశాలు తలెత్తుతాయని పేర్కొంది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని స్పష్టం చేసి వెబ్‌సైట్.. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌ను వేరు చేసే అవకాశాలు లేవని పేర్కొంది. ఇది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు కనీసం ఐదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.

No comments:

Post a Comment