Wednesday, 12 September 2012

“తెలంగాణ మార్చ్” భారీ స్థాయిలో సన్నాహాలు
 తెలంగాణ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలించడానికి ఈ నెల 30న తలపెట్టిన ‘తెలంగాణ మార్చ్’ కోసం ఈ ప్రాంత ప్రజానీకం మొత్తం సమాయత్తమవుతోంది. “ఇంటికో మనిషి, చేతిలో జెండా” నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కనీవినీ ఎరుగని పోరాటానికి తెలంగాణ ప్రాంత ప్రజలు సన్నద్ధం అవుతున్నారు.    
        ఇదివరకు నిర్వహించిన అన్ని ఉద్యమాలను తలదన్నే విధంగా ఈ మార్చ్‌ను నిర్వహించేందుకు తెలంగాణ జేఏసీ ప్లాన్ చేస్తోంది. దీనికొరకు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా అన్ని జిల్లాల్లో పర్యటనలు జరుపుతున్నారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపునందుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లాయర్లు, డాక్టర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, కవులు, కళాకారులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మైనారిటీలు తమతమ పరిధిలో సన్నాహక కార్యక్రమాలతో సంఘటితమవుతున్నాయి. జేఏసీలో భాగస్వామ్య రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమొక్రసీలు తెలంగాణ మార్చ్ కోసం కేడర్‌ను సిద్ధం చేస్తున్నాయి.  ఈ మార్చ్ కు ఇప్పటికే సీపీఐ, తెలంగాణ నగారా పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.
       ఇక గద్దర్, ఆకుల భూమయ్య, వేదకుమార్, చిక్కుడు ప్రభాకర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్, కపిలవాయి దిలీప్‌కుమార్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలక్క తదితర ఉద్యమకారుల మద్దతు కూడగట్టెందుకు తెలంగాణ జేఏసీ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. సెప్టెంబర్ 16వ తేదీన కరీంనగర్ టౌనులో కవాతును నిర్వహించడం ద్వారా జిల్లాల్లో ప్రజలను కూడా మార్చ్ కు సన్నద్ధం చేయనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఐదు వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని జేఏసీ జిల్లా కమిటీలకు సూచించింది. మొత్తమ్మీద 30 సెప్టెంబర్ మార్చ్ కు పది లక్షల మందిని తరలించేందుకు ప్రణాళిక సాగుతోంది. పోలీసుల నిషేదాజ్ఞలు ఉన్నా వీరంతా దశల వారీగా హైదరాబాద్‌కు చేరుకునేలా జేఏసీ కార్యాచరణను రూపొందించింది.                                                         
       తెలంగాణ ఉద్యమ ప్రధాన ఘట్టాలపై వీడియో డాక్యుమెంటరీని, తెలంగాణ మార్చ్‌పై  ప్రత్యేకంగా  రూపొందించిన పాటల సీడీలను అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, స్టిక్కర్లు  ముద్రించి జిల్లాలకు పంపించారు.ఇక మార్చ్ కు ప్రజలను ఆహ్వానిస్తూ తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటీ రూపొందించిన గీతం ఇప్పటికే అన్నిచోట్లా మార్మోగుతోంది.మొత్తానికి సెప్టెంబర్ 30 నాడు తెలంగాణను వ్యతిరేకించే వారి వెన్నులో వణుకుపుట్టేలా, ఢిల్లీ నేతలు దిగివచ్చేలా మార్ ఉండబోతోందని తెలుస్తున్నది.   

No comments:

Post a Comment