Wednesday, 12 September 2012

స్వదేశీ కవిత్వ ఉద్యమ సారథి

   

          పాల్కురికి సోమనాథుడు 
            రెండు వేర్వేరు సిద్ధాంతాలకు అంకితమై, ఎన్నో కొత్త ఒరవడులకు కారకులైన ఇద్దరు గొప్ప కవులలో నన్నయపైన జరిగినంత అధ్యయనం పాల్కురికి సోమనాథుని విషయంలో జరగక పోవటానికి కారణాలు అనూహ్యం కాదు. సోమనాథుడు మొదలు పెట్టిన సమాజ సంస్కరణోద్యమం గురించీ, అంటరానితనం, కుల వ్యవస్థల నిర్మూలన గురించీ చర్చించడానికి విశ్వవిద్యాలయాలు గానీ పరిశోధకులు గానీ అంతగా ఆసక్తి కనపరచకపోయినా, అభ్యుదయవాదులు కూడా సోమన విషయంలో పెద్దగా స్పందన కనబరచకపోవటమే చరిత్ర పట్ల మనకున్న చిన్నచూపును పెద్దది చేస్తోంది. సోమన స్వదేశీ కవిత్యోద్యమాన్ని గాంధీగారి స్వదేశీ మంత్రంతో మాత్రమే పోల్చగలం. గాంధీ, సోమనలిద్దరూ దాస్యభావజాలం నుంచి జన విముక్తిని సాధించటానికి ఉద్యమాలు నడపటమే ఈ పోలికకు కారణం. 
           మును మార్గ కవిత లోకం/బున వెలయ(గ దేశి కవిత(బుట్టించి తెనుం/గును నిలిపిరంధ్ర విషయం/బున (జన జాళుక్య రాజు మొదలగు పలువురు... లోకం అంతా మార్గ కవిత వెలుగుతోంటే, చాళుక్య రాజులు ఇంకా మరికొందరు దేశికవితను తెలుగులో నిలిపారంటూ క్రీ. శ 1128లో నన్నెచోడుడు మొదటిసారిగా దేశికవిత గురించి ప్రస్తావించాడు. జాయప సేనాని నృత్త రత్నావళి నకీ.శ. 1250?) కాకతీయ యుగంనాటిదే! ఆ రోజుల్లోనే సాంస్కృతికపరమై న స్వదేశీ ఉద్యమానికి మంచి ప్రారంభం జరిగింది. వీరి తరువాతి తరం వాడయిన పాల్కురికి సోమనాథుడు ఈ దేశీయ భావానికి ఒక ఉద్యమ రూపాన్నిచ్చి నాయకత్వం వహించాడు.
          మార్గ, దేశి అనేవి మౌలికంగా సంగీత నాట్యరీతులకు సంబంధించిన పదాలు. నన్నెచోడు డు ఈ మార్గ, దేశి పదాలను తొలిసారిగా తెలుగు కవిత్వానికి ఆపాదించి, ఈ రెండు కవితారీతులకు గల తేడాలను విశ్లేషించాడు. ఆయన వాదాన్ని అందిపుచ్చుకొని, దేశికవితను ఉద్యమించి రాయాల్సిన అవసరం ఉందని భావించినవాడు పాల్కురికి సోమనాథుడు.
         తమిళులు సంగ సాహిత్య సంపదనంతా తమ దేశి సంపదగానే చెప్పుకొంటారు. ఏ భాషలోనయినా మొదట దేశి మాత్రమే ఉంటుంది. పండితుల కారణంగా దేశి అడుగంటి మార్గ వ్యాపిస్తుంది. ఊళ్ళ పేర్లను, మనుషుల పేర్లను సంస్కృతీకరించటం, చెన్నమల్లు అనే ద్రావిడ నామాన్నిశ్రీగిరీశ్వరుడుగా మార్చటం లాంటివెన్నో తెలుగునేల మీద జరిగాయి. తెలుగు శబ్దాలు పూర్తిగా కనుమరుగై పోయి, సంస్కృతమయం అయ్యే ప్రమాదం ఏర్పడింది. మాకు తెలుగు రాదనటం ఇవ్వాళ ఎలా ఘనమైన విషయమో అలానే వెయ్యేళ్ళ క్రితం కూడా మన పూర్వులు చెప్పుకొన్న పరిస్థితి. సంస్కృతం మధ్యతరగతి తెలుగు ప్రజలను అంతగా ప్రభావితం చేసింది. అప్పుడే సంస్కరణ వాదులకు దేశి భావన కలిగి ఉండాలి.
సోమన కాలానికి బహుశా జైన బౌద్ధాల పతనంతో వైదిక ధర్మాల వ్యాప్తి, సంస్కృత ప్రాబ ల్యం కారణంగా నన్నయాదుల చంపూ రీతి బహుళ వ్యాప్తిలో ఉండి ఉంటుంది. తెలుగు ద్వితీ య స్థానానికి దిగిపోవడంతో దేశీయ భాషేతివృత్త ఛందో రీతుల్నీ ద్విపద కావ్య మార్గాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం పాల్కురికి సోమనాథుడు చేయవలసి వచ్చింది. శాస్త్రాలనూ, శాస్త్రార్థాల నూ వివరించటానికి తెలుగు ఛందో రీతులు చాలవనే అభివూపాయాన్ని ఖండించటానికే ద్విపదలో బసవపురాణం, పండితారాధ్యుల చరివూతలను సోమన వెలువరించాడు.
            పాల్కురికి సోమనాథుడు 1160-1230 కాలంవాడు కావచ్చును. వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రీయా దేవి, విష్ణురామ దేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవాడైనా, వీరశైవ దీక్ష తీసుకుని వీర మహేశ్వర వ్రతుడిగా మారాడు. తల్లిదంవూడులు జన్మనిచ్చిన కులాన్ని వదలి శివపార్వతుల్నే తల్లిదండ్రులుగా భావించటం వీర మహేశ్వర వ్రతం. వీళ్ళని జంగమ దేవరలంటారు. కులగోవూతాల పటింపు ఉండదు. ఈ కారణంగానే అంటరానితనాన్ని పాటించే అగ్ర కులాలను కులం పేరుపెట్టి తిట్టగలిగాడు. కులజుండు నతడే యకులజుండు నతడె/ కులము లేకయు నన్ని కులములు నతడేఅన గట్టిగా నమ్మినవాడు సోమనాథుడు. ప్రజలకోసమే అతడు పుట్టాడు-వూపజలే అతడిని అమర కవిని చేశారు అంటారు సమక్షిగాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర! అసమాక్షు కొలవని అగ్రజుండైనా వసుధ మాలల మాలవాడు కాకెట్టు? అని ప్రశ్నించాడు. శివుని కొలవడం అంటే కులమతాలు పాటించకపోవటం, వర్ణవైషమ్యాలు వదిలేసుకోవటం, వైదిక క్రతువులను అంగీకరించకపోవటంగా ఆయన ప్రచారం చేశాడు. వేద భరాక్షికంతులనగబడిన బ్రాహ్మణ గార్ధబంబులతోడ ప్రతిసేసి యాడిన పాపంబు వచ్చునంటాడు. అంటరానితనాన్ని పాటించే బ్రాహ్మణులను మెడలో త్రాడు ఉన్న మాలలు-తాటిమాలలు-అని నిరసించాడు.

బలుపోడతోలు సీరమును బాపసరుల్ గిలుపారు కన్ను వె
న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపు వల్గుపూ
సల గల రేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
వలపు మదిం దలిప్ప బసవా బసవా బసవా వృషాధిపా
 
అంటూ, వృషాధిపశతకంలో సోమనాథుడు స్వదేశీ జానుతెనుగు స్వరూపం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. సోమనది రస ప్రధాన కవిత. వ్యక్తిగా, పాలకుడిగా కన్నడ ప్రాంతాలలో బసవన్న సాధించిన విజయాలను, తెలుగు నేలమీద సోమన తన సాహిత్యం ద్వారా సాధించాడు. పాడుకునేందుకు తెలుగువారికి ద్విపద, ఛందస్సును కానుకగా ఇచ్చాడు. పాల్కురికి సోమనాధుడు శివుని ప్రమథగణాలలో భృంగి అవతారమని వీరశైవులు నమ్ముతారు. ఇతర బ్రాహ్మణ శివకవులకు భిన్నం గా పాల్కురికి సోమనాథుడు బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను నిశితంగా విమర్శించాడు. నన్నయ వైదిక మతోద్ధరణ తన గురుతర బాధ్యతగా భావిస్తే,. సోమన వైదిక ధర్మాలను తుదముట్టించి కుల వర్ణ భేదాలు లేని సమ సమాజ నిర్మాణాన్ని తలపెట్టాడు.
             సోమన కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీనపడిన స్థితిలో ఉన్నాయి. జైన బౌద్ధ చార్వాక దుష్పథ సమయములు/ మూడును నిర్మూలము జేయుదనుక/మూడు రాలను వైతు ముప్పొద్దు నిన్ను అనీ, వసుధలో జినులను వారి నందరను/ నేలపాలుగజేసి అనీ సోమనాథుడు బసవపురాణంలో ముప్పేట దాడులు ఎలా చేయవలసి వచ్చిందో చెప్పుకున్నాడు. జైనులు, బౌద్ధులు రంగం నుంచి దిగజారి పోయిన తర్వాత మతోన్మాద గదాయుద్ధానికి వీరశైవ, వీరవైష్ణవులే మిగిలిరి. వీరు పరస్పరము తిట్టుకున్న తిట్లే ఒక చేట భారతమగును అని సురవరం ప్రతాపడ్డిగారు సోమన కాలంనాటి పరిస్థితులను వివరించారు. కర్మ చండాలురు, వ్రతవూభష్టులు, దుర్జాతులు, పశుకర్ములు, బాపన కూళలు,...ఇవన్నీ వైష్ణవులను తిట్టిన తిట్లే! కాకతీయ ప్రభువుల మద్దతు శైవులపక్షాన ఉంది. రాజాదరణతో గోలకీ మఠాలను సాధించుకున్నారు శివదీక్షను స్వీకరించిన బ్రాహ్మణులు గురుస్థానాలను పొందారు. కానీ, అప్పటిదాకా శివాలయాలలో పూజారులుగా ఉన్న తంబళ్లను తొలగింపచేసి, వారి స్థానంలో ఈ బ్రాహ్మణ గురువులు పూజారులయ్యారని సురవరం వారు పేర్కొన్నారు.
   అల్పాక్షరముల ననల్పార్థరచన కల్పించుటయు కాదె కవి వివేకంబు...? అంటూ, కవిత్వం లో సంక్షిప్తతను ఉద్యమస్థాయిలో సాధించాలని సోమనాథుడు ప్రయత్నించాడు, సంక్షిప్తత వలన సూటిదనం వస్తుంది. అది జన సామాన్యం హృదయాన్ని తాకుతుందని ప్రబోధించా డు. తెలుగుదనాన్ని తేట తెల్లంచేస్తూ, జాతులు రీతులు నేతులుట్టంగ దేశిభాషను తీర్చి దిద్దా డు. పొట్టయిన రత్నంబు చుట్టును పసిడి కట్టిన భావనగా ద్విపదకు కావ్య గౌరవాన్ని సాధిం చాడు. అప్రమాణమనీ, అనాద్యమనీ ద్విపదను ఎవంత ఈసడించినా ఆ దేశిఛందస్సులోనే మహా కావ్యాలు నిర్మించాడు. సంస్కృత భావజాలంలోచి బయ ట పడగలిగితేనే దేశి భాష బాగు పడుతుందని ప్రబోధించాడు. పెళ్ళీ, పేరంటాలకూ; పుట్టుక, చావులకూ దేనికీ తెలుగుని పనికిరాకుండా చేయటాన్ని ఖండించాడు. దేవుణ్ణి స్వంత భాషలో స్వంత పద్ధతిలో ఆరాధించుకోవాలని సూచించాడు. అందుకు అడ్డుపడే బ్రాహ్మణవర్గం పట్ల తన వ్యతిరేకతను స్పష్టంగానే ప్రకటించాడు. తన భావాలను వెల్లడించటానికీ, పరమత ఖండనానికి, స్వమత స్థాపనకూ జనభాషలో సాహిత్య సృష్టిచేయటం ఒక సాధనంగా చేసుకున్నాడు. తెలుగే దేవ భాషగా ఆయన నినదించాడు దెలుగు మాటలనగ వలదు,వేదముల కొలదియు కాజూడుడిల నెట్టులనిన అంటూ, తెలుగు మాటలు వేదముల తో సమానం అన్నాడు. జనవశీకరణకు అమ్మభాషే శరణ్యం అన్నాడు. అసలైన ప్రసన్న కథా కలితార్ధయుక్తి కలగలసిన రీతి లో కథ చెప్పే విధానాన్ని అవలంబించాడు. దేశి భావ జాలాన్ని, దేశి జీవన విధానాన్ని, దేశిభాషను ప్రతిబింబింపచేస్తూ, ప్రజా సాహిత్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. వస్తువులో కొత్తదనం తెచ్చాడు. పాల్కురికి తెలుగు నుడికారాన్ని, తెలుగు ఛందస్సును, తెలుగు శబ్దజాలాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, అందులో సామాన్యుడు వస్తువుగా ఉన్నప్పుడే అది దేశి కవిత అవుతుందన్నాడు. సామాన్యుల్లో అసామాన్యులైన శివభక్తుల జీవితాలను భక్తి సూత్రాలతో బంధించి చిత్రించే ప్రయత్నం చేశాడు. దుర్గవ్వ, కిన్నెర బ్రహ్మయ్య, బెజవాడ కుమ్మరి గుండయ్య, మడివాలు మాచిదేవయ్య, కన్నప్పగా ప్రసిద్ధుడయిన తిన్నడు, మౌళిగ మారయ్య, ముసిడి చెన్నయ్య, మాల శివనాగుమయ్య, మేదర క్షేత్ర య్య, చెన్న మల్లన్న లాంటి సామాన్యుపూందరినో ప్రధాన పాత్రలుగా చిత్రించి వారి చరివూతలు వెలుగులోకి తేవటానికి ఈ స్వదేశీ భావనని ఉపయోగించుకొన్నాడు.
            'ఒక తెలుగు కవి తొలిసారిగా నిర్మించిన స్వతంత్ర పురాణం బసవపురాణం. ప్రప్రథమ ఆంధ్ర ద్విపద భారతి ఈ కృతి’ అని ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం అన్నారు. బసవ పురాణ ము, పండితారాధ్యుల చరిత్ర రచనలతో బాటు సోమనాథుడు వ్రాసిన అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, సోమనాథ భాష్యము, చెన్నమల్లు సీసములు పరిష్కృతమైనవి చాలావరకూ దొరుకుతున్నాయి. ఇంకా, కొన్ని ఉదాహరణ కవితలు, రగడలు, అష్టకాలు,నామావళులు, పంచరత్నాల లాంటి రచించాడు. వీరశైవులు కంఠోపా వల్లించే శివస్తవం సోమనాథకృతమే!
ఎన్నో తెలుగు పదాలను సోమనాథుడు అవలీలగా ప్రయోగించాడు:
    టగ్ ఆఫ్ వార్ అనే తాడాటను రాగుంజుపోగుంజు లాట (పండితా .46) అన్నాడు. కొన్ని పదబంధాల ను స్వయంగా రూపొందించాడేమోననిపిస్తుంది. బసవని చూడటానికి జనసందోహం కదిలి వస్తుంటే, పందిళ్ళు వేసి, వాటి గుంజలకు గాలి ధారాళంగా వచ్చేలా వ్యాసహస్తాలు అమర్చారంటాడు. సీలింగుఫ్యానుకు ఈ వ్యాసహస్తం అనే పేరు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. కుంభవృష్టికురిసిందనటానికి అచ్చతెనుగులో కుండకూలిన యట్టు అంటాడు. రాతిని శిల్పంగా మలచటాన్ని గండరించు అంటాడు. పండిత లోచనాబ్జంబుల యందు గండరించినయట్టి అని ప్రయోగిస్తాడు. 
గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం అని ఎత్తిపొడుస్తాడు. 
తక్కువగా గౌరవించటాన్ని సోల అన్నాడు.
చాలా కొద్ది సమయాన్ని గోరంతపొద్దు అంటాడు,
అసాధ్యం అనడానికి కుంచాలతో మంచుకొలవటం అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు.
భరించటం అనే అర్థంలో తను శిరమై అంటాడు,
విత్తనాలు నాటడాన్నివిత్తులలుకు అనడంలోని పదలాలిత్యం అసాధారణమైనది
మేలము అంటే పరిహాసము (చెన్నమల్లు -5)
దుద్దెక్కుఅంటే పెద్దదగు, లావెక్కు: భక్తి దుద్దెక్కితనలోన దొట్రుకొనంగ (బసవ 1-217)
బుడిబుళులు అంటే గుసగుసలు: నరుల్ బుడిబుడుల్వోవ, బుడిబుళ్ళు వోవుచు భూసురుపూల్ల పుడమీశు కొలవుకు పోయి బసవ7-180)
బిలిబిలి కృతులు: వేగంగా రాసేసిన పనికి మాలిన రచనలు.
బిలిబిలి కాయకంబులు: కొద్దికష్టంతో చేసే పనులు(బసవ5-131)
                  నేలటూరి వెంకటరమణయ్య సోమన భాష అచ్చతెనుగు భాష అనే వాదంతో ఏకీభవించలేదు. సోమనాథుని వాక్యములు జానుదెనుగున నచ్చతెనుగను భ్రమను గలుగ జేయుచున్నను వాస్తవము విచారించగా జానుదెనుగునకు సరియైన యర్ధమది కాదని తోచుచున్నది. ఏలన, సోమనాథుని రచన లచ్చతెనుగు కబ్బములు కావు. ఇతరాంధ్ర కవులను బోలె ఇతడును సంస్కృతాంధ్ర మిశ్రభాషనే వాడియున్నాడు.
లోకమ్ము వీడి రసమ్ము లేదు వ్యాసంలో ఆచార్య కోవెల సుప్రసన్నులు మౌఖికమైనంత మాత్రాన సూత్ర భాష్యాదుల పాండిత్యం లేకుండా అన్నమయ సంకీర్తనలను అర్ధం చేసుకోగలమా...? అని ప్రశ్నించారు. కఠినమైన శాస్త్ర విషయాల ను సామాన్యుడి ముంగిటకు చేర్చగలగటం ఒక శైలి. అది రచయిత ప్రతిభకు తార్కాణం. పామర జన మోదాన్ని కలిగిస్తూనే ఎన్నో రహస్యాలు పండితులు వెదుక్కోగలిగేలా ఏర్పడి చెప్పగలగటం ఒక అన్నమయ్యకు తెలుసు, ఒక సోమనాథుడికి తెలుసు. స్వదేశీయత విషయంలో ఈ ఇద్దరితో పోల్చటానికి మరొక కవి లేరు .
               సోమనాథుని కవితలో పదలాలిత్యం, సంక్షిప్తతలతో పాటు, వైరి సమాసాలను కూడా స్వేచ్ఛగా ప్రయోగించటం అనే లక్షణాన్ని కూడా గమనించవచ్చు. పుష్పవిల్లు, భూమి తీరు, వేడి పయోధార లాంటి ప్రయోగాలు అలవోకగా చేసిన కనిపిస్తాయి. తిరుగుబాటు చేయటమే ఊపిరిగా పనిచేసే ఉద్యమకారుడు రూల్సు పాటిస్తాడా...!. బసవడి పట్ల, శివుడి పట్ల, సమాజంలోని అంటరానివారుగా అణగదొక్కబడిన వారి పట్ల, ఆయన తనది అతిలౌల్యం... అని చెప్పుకొన్నాడు. వర్ణవ్యవస్థ, సంస్కృత భావజాల వ్యతిరేకత పట్లకూడా ఆయన అతిలౌల్యాన్నే ప్రదర్శించాడు. తన ద్విపద కావ్యాన్ని వేదముల కొలదియు కొలువుడు అని చెప్పుకోవటానికి ఒక కవికి ఎన్నెదలు కావాలీ...?
                                                                     -డాక్టర్ జి. వి. పూర్ణచందు

No comments:

Post a Comment