Friday 21 September 2012

కొండా లక్ష్మణ్‌బాపూజీ కన్నుమూత

      స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ(97) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో సెప్టెంబర్ 21 ఉదయం   తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్‌ 27, 1915లో ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో లక్ష్మణ్‌బాపూజీ జన్మించారు. 1942  క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1952లో నాన్‌ముల్కీ, 1969లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.  1969లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ.. శాసనసభ ఉప సభాపతిగా కూడా పని చేశారు.తెలంగాణ సాధన సమితి సభ్యునిగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.  తెలంగాణ ఉద్యమం కారణంగా మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించారు. హైదరాబాద్‌లో అఖిలభారత పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.      
            కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాపూజీ మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు అని  కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూసి చనిపోవాలని బాపూజీ కలలు కన్నారని ఆయన తెలిపారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, గీతారెడ్డి, సునీతాలక్ష్మా రెడ్డి, ఉత్తమ్‌కుమార్, ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, గాయని విమలక్క , ప్రజాగాయకుడు గద్దర్ బాపూజీ మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ కోసం బాపూజీ నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర కోసం ఆయన ముందుండి పోరాటం చేశారని గద్దర్ తెలిపారు. 

No comments:

Post a Comment