Tuesday, 11 September 2012

ఏకశిలపై దేవుళ్లు...
                                                                                        temple
                       ప్రపంచంలోనే   అతి పురాతన దేవాలయం... 300 కోట్ల సంవత్సరాల చరిత్ర... విజయనగర రాజుల అలనాటి సైనిక శిబిరం... పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి నిలు నిదర్శనం. ఇలా చెప్పుకుంటూపోతే ప్రపంచంలో మరే దేవాలయానికి లేని ప్రత్యేకతలను తనలో ఇముడ్చుకున్న అరుదైన దేవాలయ సముదాయం రాక్‌ఫోర్ట్. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఈ అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదనే చెప్పాలి. వినాయకుడు, శివుడు ఒకే చోట వెలసిన... తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్ విశేషాలు... 
                 పేరుకు తగ్గట్టు రాక్‌ఫోర్ట్ టెంపుల్... పర్వతంపై 83 మీటర్ల ఎత్తున శిలలతో అత్యద్భుతంగా మలచబడింది. ఈ కొండపై మొత్తం మూడు దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయ సముదాయాల నిర్మాణం పల్లవుల హయాంలో ప్రారంభమైనప్పటికీ... ఆ తరువాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో మధురై నాయకులు వీటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీరికాలంలో దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఏకశిలను తొలిచి నిర్మించిన రాక్‌ఫోర్ట్ పర్వత శిఖరానికి... ఎంతో కఠినతరమైన 437 ఎగుడు మెట్లు ఎక్కితే గాని చేరుకోలేం.
                 పర్వత పాదాల వద్ద మనిక వినాయకర్ దేవాలయం ఉండగా... పర్వత శిఖరం వద్ద ఉచ్చి పిల్లయార్ కోయిల్ దేవస్థానం ఉంది. ఇక్కడ... ప్రసిద్ధిగాంచిన శివాలయం తాయుమనస్వామి దేవాలయం ఉన్నది. శిలను చెక్కి అపురూపంగా మలిచిన ఈ శివస్థలం పర్యాటకులను కనుప్పవేయనీయదు. ఇక్కడ ఉన్న దేవాలయ సముదాయంలో... లలితాంకుర పల్లవేశ్వరం అనే పల్లవులు నిర్మించిన దేవాలయం కూడా ఎంతో ప్రఖ్యాతి పొందినది. ఇక్కడ ఎన్నో అరుదైన శాసనాలు పల్లవ రాజు మహేంద్ర పల్లవన్ గురించి అనేక విశేషాలను తెలియజేస్తాయి. చోళులు, విజయనగర రాజులు, మధురై నాయకులు ఈ దేవాలయాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా, కొండపై ఉన్న రెండంతస్థుల తాయుమనస్వామి దేవాయలం ఇక్కడి నిర్మాణాల్లోనే తురుపుముక్క అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుత కళానైపుణ్యం ఈ దేవాలయం సొంతం. 
                  ప్రతిరోజు ఇక్కడ ఆరు రకాల పూజలు జరుగుతాయి. చితిరైలో ప్రతియేటా ఒకసారి బ్రహ్మోత్సవం కూడా జరుగుతుది. ఆదిపూరం, ఫ్లోట్ ఫెస్టివల్ జరిగే పంగుని ప్రదేశం కూడా ఇక్కడ ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రదేశం. మధురై నాయకులు నిర్మించిన ఈ రెండు దేవాలయాల్లో ఒకటి శివాలయం కాగా, మరొకటి గణేష్ దేవస్థానం. అద్భుత శిల్పకళారీతులకు ఆలవాలంగా ఉన్న... 7వ శతాబ్దానికి చెందిన దేవాలయాలు ఇవి. ప్రఖ్యాతిగాంచిన ఎన్నో శిల్పరీతులకు పెట్టింది పేరు. పర్వత పాదాల వద్ద ఉన్న వినాయకుడి దేవస్థానం, అలాగే పర్వత శిఖరం వద్ద ఉన్న అతిపెద్ద శ్రీ తాయుమన స్వామి దేవాలయాల్లోకి హిందూయేతరులను అనుమతించరు. పర్యాటకుల సందర్శనార్థం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయాలను తెరచి ఉంచుతారు.
వినాయక దేవస్థానం... 
                 లంకాధీశుడైన రావణుడి అనుంగు సోదరుడైన విభీషణడు... అపహరణకు గురైన సీతాదేవి ని రక్షించేందుకు రాముడి పక్షాన చేరి తన సహాయ సహకారాలను అందిస్తాడు. తరువాత యుద్ధంలో రావణుడి ఓడించిన రాముడు తన ధర్మపత్ని సీతను కాపాడుకుంటాడు. ఈ నేపథ్యంలో తనకు సహాయాన్ని అందించిన విభీషణుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో రాముడు... విష్ణుమూర్తి అవతారమైన రంగనాథస్వామి విగ్రహాన్ని ఇస్తాడు. అయితే ఇది గమనించిన దేవతలు... ఒక అసురుడు విష్ణుమూర్తి అవతారమైన రంగనాథస్వామి విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకెళ్ళడాన్ని సహించలేక పోతారు. దాంతో, దేవతలు ఎలాగైనా విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళకుండా ఆపాలని నిశ్చయించుకొని విఘ్ననాయకుడైన వినాయకుడి సహాయం కోరుతారు. అప్పుడు వినాయకుడు వారి కోరికను మన్నిస్తాడు.
           రాముడు ప్రసాదించిన విగ్రహాన్ని తీసుకొని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరీ నది మీదుగా వెళ్తూ... ఆ నదిలో స్నానం చేయాలని భావిస్తాడు. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటాడు. ఎందుకంటే, ఒకసారి ఆ విగ్రహాన్ని నేలపైన పెడితే మళ్లీ తీయడం అసంభవం. దాంతో ఏం చేయాలి? అని మథనపడుతున్న సమయంలో అక్కడే పశువులను కాస్తున్న బాలుడిలా మారువేషంలో ఉన్న వినాయకుడి చేతికి ఆ విగ్రహాన్ని అందించి... విభీషణుడు స్నానానికి ఉపక్షికమిస్తాడు. విభీషణుడు నదిలో మునగగానే మారువేషంలో ఉన్న వినాయకుడు ఆ విగ్రహాన్ని కావేరీ నది తీరంలో ఉన్న ఇసుకపై పెడతాడు (ఆ విగ్రహం పెట్టిన చోటే... నేడు ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా విరాజిల్లుతున్న రంగనాథస్వామి దేవాలయం). ఇది గమనించిన విభీషణుడు పశువులకాపరిని తరుముతూ వెంబడిస్తాడు. దీంతో ఆ బాలుడు పక్కనే ఉన్న కొండపైకి చచకా ఎక్కేస్తాడు. విభీషణుడు కూడా ఆ కొండపైకి ఎక్కి ఆ బాలుడి నుదిటిపై ముష్టిఘాతం కురిపిస్తాడు. అప్పుడు మారువేషంలో ఉన్న ఆ బాలుడు వినాయకుడిగా మారిపోతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకొని వినాయకుడిని క్షమాపణ వేడుకుంటాడు విభీషణుడు. ప్రసన్నుడైన విఘ్నరాజు విభీషణుడి దీవించి లంకకు పంపిస్తాడు. వినాయకుడి ఎక్కిన ఆ కొండనే ఈ రాక్‌ఫోర్ట్ టెంపుల్. అక్కడ వెలసిన వినాయకుడి దేవస్థానమే ఉచ్చి పిల్లయార్ దేవాలయం.
తాయుమనస్వామి చరిత్ర...
              వినాయకుడి దేవస్థానానికి ఉన్నట్టే, ఈ గుడికి కూడా పురాతన గాథ ప్రచారంలో ఉంది. ఒకనాడు శివభక్తురాలైన రత్నవతి అనే ఆవిడ పురిటినొప్పులతో బాధపడుతూ తన తల్లి రాకకోసం ఎదురుచూస్తుంది. ఎంతసేపటికీ తన తల్లి రాకపోవడంతో... నన్ను ఎలాగైనా రక్షించు స్వామీ అని శివుడిని వేడుకుంటుంది. అప్పుడు శివుడే స్వయంగా రత్నవతి తల్లి రూపంలో వచ్చి పురుడు పోస్తాడు. అప్పటినుండి ఆయనకు తాయుమనస్వామి అనే పేరు స్థిరపడిపోయింది (తాయుం - అన - స్వామి అంటే... తల్లి రూపంలో వచ్చిన భగవంతుడు అని అర్థం). అప్పటినుండి ఈ దేవాలయానికి తాయుమనస్వామి దేవాలయం అనే పేరు సార్థకమైంది.  పర్వతపాద ప్రాంతం నుంచి సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాలయం పైకప్పుపై ఉన్న పెయింటింగ్స్ సందర్శకులను మైమరపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం ఆనాటి పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇక్కడ శివపార్వతులతో పాటు మహాలక్ష్మి విగ్రహం కూడా ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న శివాలయంలో శివుడు అతిపెద్ద లింగాకారంలో ఉంటాడు. అలాగే... పార్వతి దేవి కి ప్రత్యేక గర్భగుడి ఉంది.
చేరుకునేదిలా...
               రాక్‌ఫోర్ట్ టెంపుల్‌కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో తిరుచ్చి ఎయిర్‌పోర్టు ఉంది. చెన్నై మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమాన సౌకర్యం ఉంది. రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు తిరుచ్చి రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా రాక్‌ఫోర్ట్ట్ టెంపుల్ చేరుకోవచ్చు. దక్షిణ రైల్వే పరిధిలో అతిపెద్ద జంక్షన్ తిరుచ్చి. ఇక్కడి నుండి చెన్నై, తంజావూర్, మధురై, తిరుపతి, ట్యుటికోరిన్, రామేశ్వరం తదితర ప్రాంతాలకు మీటర్ గేజీ లైను ఉంది. అలాగే బెంగళూరు, కోయంబత్తూర్, మైసూర్, కొచ్చి, కన్యాకుమారి, మంగళూరు లను కలుపుతూ బ్రాడ్‌గేజ్ లైన్ ఉంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఈ జంక్షన్ నుంచి వివిధ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. దాదాపు దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. ప్రతిరోజూ ఆ నగరాల నుంచి ఇక్కడికి బస్సులు కూడా నడుస్తాయి. ఇక లోకల్‌గా తిరగడానికి సిటీ బస్సులు, టూరిస్ట్ ట్యాక్సీ, ఆటో రిక్షా, సైకిల్ రిక్షా వంటివి అందుబాటులో ఉంటాయి.

No comments:

Post a Comment