* విలీనం కాదు విమోచనకు సిద్ధం కండి..
* అధినేత పిలుపుతో శ్రేణుల్లో సమరోత్సాహం
* నేతలకు మేధోమథన రీచార్జ్
ఇన్నాళ్ల అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇక తమ పార్టీ ఏ పార్టీలోనూ విలీనం కాదని నిర్ణయించుకుంది. విలీనం కాదు తెలంగాణ విమోచనమే తమ లక్ష్యం అంటూ కరీంనగర్ మేధోమథనంలో టీఆర్‌ఎస్ విస్పష్టం చేసింది. అంతేకాదు భవిష్యత్‌లో తామెవరితోనూ పొత్తులు పెట్టుకోమని ప్రకటించింది. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిన్నామొన్నటిదాకా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని జరిగిన ప్రచారంతో ఎక్కడికక్కడ గులాబీ శ్రేణులు నిత్తేజంగా ఉండిపోయాయి. తమ పార్టీ లేకుండాపోతోందని ప్రచారం జరుగుతుంటే తమ భవిష్యత్ ఏమిటీ? ఎంత చేసినా ఏమున్నది అని నిరుత్సాహంలో ఉన్న పార్టీ శ్రేణులకు మేధోమథనం ధైర్యాన్ని ఇచ్చింది.
పూర్తిస్థాయిలో పార్టీని, ఉద్యమాన్ని తద్వారా ప్రజల సమస్యలపై పోరాటం చేయాలనే పిలుపుతోపాటు భవిష్యత్‌లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోం అని స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో కేడర్‌లో ఉన్న అనుమానాలు దాదాపుగా నివృత్తి అయిన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్వరాష్ట్ర సాధన కోసం మడమ తిప్పని పోరాటాలు చేస్తామని అందుకు శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ తమ శ్రేణులను సమాయత్తపరిచేందుకు సరికొత్త ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ప్రజల్లో, ఉద్యమసంఘాల్లో ఏర్పడ్డ భయానుమానాలను తొలగించడం, తెలంగాణ విషయంలో పార్టీలు చేస్తున్న మోసాల్ని ఎండగట్టడం, ఆయా పార్టీల నమ్మిక నాటకాల్ని బట్టబయలు చేయడం కోసమే టీఆర్‌ఎస్ తాజాగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని హామీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహం చేసిందని స్వయాన పార్టీ అధినేత కేసీఆరే స్వయంగా చెప్పారని జరిగిన ప్రచారం ఉత్తదేనని స్పష్టమైంది.
ఒకదశలో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని నిర్ణయించుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ మరోసారి నమ్మకద్రోహం చేసింది. ‘మన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన..అందుకోసం ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. నమ్మిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా ఉద్యమించాలి. అదే సమయంలో తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం. వాళ్లిస్తే మేం వద్దనం. అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి’ అంటూ తెలంగాణ విషయంలో ఎటూ చెప్పని టీడీపీ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుపెట్టి ఆ పార్టీ బండారం బయటపెట్టాలనీ లక్షంగా చేసుకుంది. శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగాం. దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని కరీంనగర్ మేధోమథనం స్పష్టం చేసింది.
చేరికలపై దృష్టి..
పార్టీని పటిష్టం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అన్ని నియోజకవర్గాలలో చేరికలపై దృష్టి సారించాలని మేధోమథనంలో స్పష్టం చేశారు. ‘మండల, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. తెలంగాణపై టీడీపీ వైఖరిలో తేడా ఉంది. స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌లో అస్పష్టత ఉంది’ వీటిని ప్రజలకు వివరిస్తూ చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు అన్ని స్థాయిలో జరిగే విధంగా పార్టీ శ్రేణులు చొరువ తీసుకోవాలని తీర్మానించారు.
సమన్వయంపై సమీక్ష..
జిల్లా, నియోజకవర్గాల నేతల్లో సమన్వయం చేయడంపై పార్టీ దృష్టి సారించింది. నవంబర్30 నుంచి జనవరి10 వరకు నలుభై రోజులపాటు చేపట్టే పల్లెబాట కార్యక్షికమానికి ముందుగానే నేతల్లో సమన్వయం చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ స్వయంగా రోజుకు రెండు జిల్లాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి నేతలతో సమీక్ష చేయనున్నారు. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో సమీక్షలు చేపట్టి నాయకత్వ పనితీరుపై సమీక్షంచుకోవాలని మేధోమథన సదస్సు తీర్మానించింది. నియోజకవర్గాల ఇన్‌చార్జీలు స్థానికంగా క్యాడర్‌కు అందుబాటులోఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకారం చేయాలని సూచించారు. నియోజకవర్గాలను విడిచి కార్యకర్తలకు దూరంగా ఉంటున్న ఇన్‌చార్జిల సమీక్షల అనంతరం కూడా వారి పని విధానంలో మార్పు రాకపోతే అవసరమైతే వారిని మార్చుతామనే హెచ్చరిక సంకేతాలు వెలువడ్డాయి.
సెంటిమెంటే కాదు..
ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో గెలుస్తామనే భ్రమలను వదిలి గ్రామాలకు తరలి నాయకత్వానికి సూచించారు. ప్రజాసమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు. ముఖ్యంగా కార్యకర్తలకు దూరంగా ఉంటూ సెంటుమెంటునే నమ్ముకోకుండా ప్రజలతో మమేకం కావాలని బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ‘ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మిలిటెంటు పోరాటాలకు ప్రజలను సన్నద్ధం చేయాలి. అన్ని వర్గాల ప్రజలను ఉద్యమంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ బలోపేతం చేయాలి’ అని మేధోమథన సదస్సు క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. అదేవిధంగా పనిచేయకుండా పార్టీనే అంటిపెట్టుకొని ఉంటామనే వారికి స్థానం లేదని హెచ్చరిక సంకేతాలను అందించింది. సెంటిమెంటు కాదు ఇక ఉద్యమమే అనే స్ఫూర్తితో కదనరంగంలోకి వెళ్లాలని పార్టీ శ్రేణులను సమయాత్తం చేసింది. (టీమీడియా ప్రతినిధి-వరంగల్)
No comments:
Post a Comment