Tuesday, 6 November 2012

కాకతీయ ఉత్సవాలపై ప్రభుత్వం వివక్షత..

* టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉపనేత హరీష్‌రావు  

             కాకతీయ ఉత్సవాలపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని టీఆర్‌ఎస్ శాసన సభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 900సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయ ఉత్సవాలను మూడు సంవత్సరాలు చేస్తామని చెప్పిన సీమాంధ్ర ప్రభుత్వం మూడు రోజుల్లో ముగించేందుకు సిద్ధం అయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పండుగల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో కృష్ణదేవరాయాల పాలన 500సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన పంచ శతాబ్ది ఉత్సవాలకు వంద కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలకు 25లక్షల రూపాయలు కేటాయించడంపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ ఉత్సవాలకు రూ.25లక్షలు కేటాయించగానే కాంగ్రెస్ మంత్రులు టపాసులు పేల్చుకుంటున్నారని, ఇది చాలా సిగ్గు చేటన్నారు.
       పంచశతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి రెండు నలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం కాకతీయ ఉత్సవాల నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంపై మండిపడ్డారు. కాకతీయ కట్టడాల విషయంలో యునెస్కో గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సీమాంధ్ర ప్రభుత్వం మాత్రం కట్టడాలను సంరక్షించుటలో విఫలమయిందన్నారు. ఇప్పటికే రామప్ప, వేయిస్తంభాల దేవాలయం, వరంగల్ కోట, ఐనవోలు దేవస్థానం లాంటి ప్రదేశాల్లో కట్టడాలు కూలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో యునెస్కో గుర్తించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన బతుకమ్మ పండుగను లక్షలు కేటాయిస్తానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. చిత్తూరు జిల్లాకు వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా చేపట్టిన శతాబ్ధి ఉత్సవాలకు 1197జీవో ద్వారా 140కోట్లు ఖర్చు చేసిందన్నారు. జిల్లాలోని ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.10కోట్లతో రోడ్లు వేయించారన్నారు. 
             చివరకు చంద్రబాబు నియోజకవర్గానికి కూడా రూ.10కోట్లు ఖర్చు చేసిందన్నారు. శతాబ్ధి ఉత్సవాల సందర్బంగా జరిగిన కార్యక్రమాలు జిల్లా మంచి నీటి వసతుల కోసం రూ.4500కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారని హరీష్‌రావు అన్నారు.తెలంగాణ మంత్రులతో పాటు జిల్లా మంత్రులైన పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యకు సిగ్గు, శరం ఉంటే తెలంగాణ సంప్రదాయాన్ని మంట కలుపుతున్న సీమాంధ్ర పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని, లేని పక్షంలో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హరీష్‌రావు హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య,దాస్యం వినయభాస్కర్, మొలుగూరి బిక్షపతి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment