Friday 9 November 2012

శాంతి ముగిసింది..ఇక యుద్ధమే



నాలో ఉగ్ర నరసింహుడిని చూస్తారు
ఇక డెడ్‌లైన్‌లు లేవు.. కాంగ్రెస్‌కు డెత్‌లైనే
- కన్నీళ్లు లేని తెలంగాణ కాంక్షించాం
- కాంగ్రెస్‌లో విలీనానికీ సిద్ధమయ్యాం
- కానీ.. కాంగ్రెస్ మోసం చేస్తున్నది
- ఉద్యమాలు.. రాజకీయాలు..
  టీఆర్‌ఎస్‌కు రెండు పార్శాలు
- యువకుల్లారా.. అశ్రువులై రాలకండి.. 
  అస్త్రాలై శత్రువును చీల్చండి
- బంగారు తెలంగాణ సాధిద్దాం
- టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు
- ముందస్తు ఎన్నికలు రావొచ్చని వ్యాఖ్య
- ఎన్నికల ప్రస్థానం కరీంనగర్ నుంచే..
- ముగిసిన టీఆర్‌ఎస్ మేధోమథనం
- ఉద్యమ షెడ్యూలు ఖరారు
- డిసెంబర్ 9న నల్ల జెండాలతో నిరసనలు
            ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై..అంటూ సాగే పద్యాన్ని కేసీఆర్ చదివి వినిపించారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా.. ఎంతమంది విద్రోహులు అడ్డుతగిలినా.. గమ్యాన్ని ముద్దాడేవరకు ధీరులు పోరాటం చేసి తీరుతారన్నది ఇందులోని అర్థం.
          తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో శాంతి ముగిసిందని, ఇక జరిగేది యుద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎంపీ కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇకపై తెలంగాణ కోసం డెడ్‌లైన్‌లు ఉండవని, ఇక కాంగ్రెస్‌కు డెత్‌లైనేనని తేల్చి చెప్పారు. తెలంగాణ అంశాన్ని నాన్చుతూ, మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు నువ్వులు, నీళ్లు వదిలేశామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌తో సంధి సంబంధాలుండవని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని ప్రకటించారు. సమావేశం నిర్ణయాలను అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇవ్వాలంటే టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలని కాంగ్రెస్ షరతు పెట్టిందని తెలిపారు. ‘కాంగ్రెస్  పెట్టిన షరతులపై మేధావులతో చర్చించి, కన్నీళ్లు లేని తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధపడ్డాం. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీని విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకొని త్యాగనిరతిని చాటాం. అయినా కాంగ్రెస్ మోసపూరిత వైఖరినే అవలంబిస్తోంది’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 ప్రబల రాజకీయ శక్తిగా ఎదుగుతాం:
             ఉద్యమాలు, రాజకీయాలు అన్న రెండు పార్శాలతో ముందుకు సాగనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమాలను మహోధృతంగా నిర్వహించి, రాజకీయంగా ప్రబలశక్తిగా ఎదుగుతామని చెప్పారు. ‘‘వ్యూహాత్మకంగానే మౌనాన్ని పాటించాను. ఆ మౌనాన్ని బద్దలు చేశా. ఇక అందరికీ అందుబాటులో ఉంటా. కేసీఆర్‌లో నరసింహ ఉగ్రరూపాన్ని చూస్తారు’’ అని కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణకు కాంగ్రెస్ మోసం చేసింది. టీడీపీ దగా చేసింది’ అని చెప్పారు. ‘బాబూ! జై తెలంగాణ అంటే నోటి ముత్యాలు రాలిపోతాయా? కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై లేఖ ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశానికి సంబంధమేమిటి?’ అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలు తెలంగాణ ద్రోహ పార్టీలేనని ఆయన దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, వంద అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలే లక్ష్యంగా బరిలో దిగుతామని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని కేసీఆర్ విమర్శించారు. ప్రస్తుతం సంకీర్ణ యుగమే నడుస్తోందని, ఏ పార్టీ కూడా సొంతంగా వంద సీట్లు సాధించే స్థితిలో లేదని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ. ఆ పార్టీతో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. 
శాశించి తెలంగాణ సాధిస్తాం:       
                 యాచించి కాదు, శాసించి తెలంగాణను సాధిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ఆత్మవంచనతో కుమిలిపోవడం కన్నా పార్టీని వీడిబయటకు రావాలని సూచించారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పదుల సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యేలు క్యూ కట్టారని, వారి వివరాలను వెల్లడించడం మంచిది కాదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీలోకి అందరినీ ఆహ్వానించలేమన్నారు. పార్టీపరంగా గతంలో చేసిన తప్పులు పునరావృతం కానీయబోమని తెలిపారు. రాజకీయంగా ఎంతో పరిపక్వత సాధించామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటూ కాంగ్రెస్ చచ్చేదాక సొల్లు పురాణం చెబుతుందా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటాలు చేస్తామని, దీనికి ఇంత కాలమంటూ ఏమీ లేదన్నారు. 18మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలున్న తాము అసెంబ్లీ, పార్లమెంట్‌లను స్తంభింపజేశామని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 
టీజేఏసీతో కఠిన భేదాభిప్రాయాలు కావు..:
           ‘టీజేఏసీతో విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయితే మళ్లీ కలుసుకోలేనంత కఠిన భేదాభివూపాయాలు కావు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నిక సందర్భంగా మా అభ్యర్థి విజయానికి టీజేఏసీ సహకరించకుండా ద్రోహం చేసింది. ఇది నన్ను కలచి వేసింది. చాలా బాధపడ్డా. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలనూ కలుపుకెళ్లాన్నదే మా లక్ష్యం. మహబూబ్‌నగర్ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థిని నిలబెడితే ఓడించారు. ముస్లింలను రజాకార్లతో పోల్చుతూ బీజేపీ ప్రచారాన్ని నిర్వహించింది. ఇది ప్రజాస్వామ్య పద్ధతా? అయినా హైదరాబాద్ వెళ్లగానే టీజేఏసీ నాయకులను పిలిచి మాట్లాడుతా. అంతా కలిసి ఏకోన్ముఖులుగా ఉద్యమిస్తాం. ఈ విషయంలో దుష్ప్రచారం చేయవద్దు’ అని కేసీఆర్ అన్నారు. గమ్యాన్ని ముద్దాడే వరకు ఎత్తిన జెండాను దించేది లేదని పునరుద్ఘాటించారు. 
అస్త్రాలై శత్రువును చీల్చండి:             
              తెలంగాణ రాష్ట్ర సాధనలో జరుగుతున్న జాప్యంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘యువకుల్లారా! ఆత్మహత్యలకు పాల్పడకండి. చావులు మంచిది కాదు. అశ్రువులై రాలకండి.. అస్త్రాలై శతృవును చీల్చండి. చెతుపూత్తి దండం పెడుతున్నా. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. చావులతో కృంగదీయకండి. మనసులో బాధ ఉంటే నేరుగా నా వద్దకు రండి’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 
బలాన్నిచ్చిన కరీంనగర్:
                  తెలంగాణ ఉద్యమంలో కరీనగర్ జిల్లా మహోన్నత పాత్ర పోషిస్తున్నదని కేసీఆర్ చెప్పారు. ‘తెలంగాణ ఉద్యమ బావుటాను ద్విగుణీకృతం చేసి కరీంనగర్ జిల్లా ప్రజలు ఉద్యమాన్ని హిమాలయమంత ఎత్తుకు తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వేయి ఎనుగుల బలాన్నిచ్చారు. 2001లో మొదట సింహగర్జన ద్వారా ఉద్యమ జ్వాలను రగిలించారు’ అన్నారు. కరీంనగర్ జిల్లావాసులు, పార్టీ కేడర్ రెండు రోజులపాటు మేథోమధనానికి చక్కటి ఆతిథ్యాన్నిచ్చారంటూ కేసీఆర్ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల ప్రస్థానం కూడా కరీంనగర్ నుంచే ప్రారంభమవుతుందని కేసీఆర్ ప్రకటించారు. 
తెలంగాణ కోసమే విలీనానికి సిద్ధపడ్డాం: 
           ‘పన్నెండేళ్లుగా హోరాహోరీగా సాగుతున్న తెలంగాణ ఉద్యమంలో అనేక మలుపులు, ద్రోహాలు, జయాలు, అపజయాలు ఎదుర్కొన్నాం. పుష్కరకాలంగా ఉద్యమాన్ని సజీవంగా, పట్టుసడలకుండా కాపాడుకున్నాం. సకల జనుల సమ్మెద్వారా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాం. 55మంది టీజేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులతో ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశాం. ఉద్యమ స్వరూపాన్ని వివరించాం. ముందు ఉద్యమ వేడిని తగ్గించాలని, మెడమీద కత్తిపెడితే కష్టమని ప్రధాని కోరడంతో తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు మొండి వైఖరి వద్దనుకుని ప్రధానికి వెసులుబాటు కల్పించాం. ఆ తరువాత కొంతకాలానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలకు నన్ను ఆహ్వానించింది. ఢిల్లీ వెళ్లాలా? వద్దా? అని పార్టీలో, మేధావులతో చర్చించా.ఢిల్లీ వెళ్లాలన్న మేధావుల సలహాతో కాంగ్రెస్ నేతలు పలువురితో చర్చలు జరిపా. టీఆర్‌ఎస్‌ను విలీనం చేయమంటూ కాంగ్రెస్ కండిషన్ పెట్టింది. కన్నీళ్లు లేని తెలంగాణ కోసం పార్టీని కూడా విలీనం చేసేందుకు సిద్ధపడ్డా. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలన్నాం. అయినా కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని వీడలేదు. తెలంగాణపై నాన్చుడు ధోరణిని అవలంబిస్తూ దగా చేస్తోంది’ అని చెప్పారు. ‘బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ ఉండాల్సిందే. త్యాగానికి సిద్ధపడినా కాంగ్రెస్ మోసపూరిత నైజాన్ని వీడటం లేదు’ అన్నారు.
స్వీయ అస్థిత్వం సాధిస్తాం:
                ‘ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు నన్ను బిడ్డగా ఆదరిస్తున్నారు. వారి కోసం టీఆర్‌ఎస్ కరదీపికగా నిలుస్తుంది. ఉద్యమం, రాజకీయం అన్న పార్శాలతో పోరాడుతాం. ప్రజల రాజకీయ శక్తిగా ఎదుగుతాం. దోపిడి నుంచి బయటపడాలి. స్వీయ రాజకీయ అస్థిత్వాన్ని సాధిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముస్లింల కోసం ప్రత్యేక ఎజెండాను రూపొందించనున్నట్లు తెలిపారు. 
డిసెంబర్ 9న నల్లజెండాలతో ప్రదర్శనలు:                     
               టీఆర్‌ఎస్ ఉద్యమ షెడ్యూల్‌ను కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులంతా నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయాలని కోరారు. ఈనెల 15న పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌డ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా లక్షలాది మందితో సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. 23న నల్లగొండ జిల్లా సూర్యాపేటలో లక్షలాది మందితో సమరభేరి నిర్వహిస్తామన్నారు. 29న దీక్షా దివస్‌ను నిర్వహించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేయి, రెండు వేల మందితో, మొత్తంగా రెండు లక్షల మందితో సామూహిక దీక్షలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 30 నుంచి జనవరి 10వ తేది వరకు 40రోజులపాటు పల్లెబాటను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ సర్కార్ మోసాలను ప్రతి గుండెకు తట్టే విధంగా ప్రజలను జాగృతం చేయాలన్నారు. బూత్ కమిటీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునేందుకు కేడర్ కృషి చేయాలన్నారు. స్థానిక సమస్యలపై మరిన్ని ఉద్యమాలను నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని డిసెంబర్ 7న అఖిల పక్ష సమావేశంలో తెలంగాణను అంగీకరించి.. టీడీపీ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. జగన్ పార్లమెంట్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకున్నారని గుర్తు చేశారు. 
             కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణ ద్రోహ పార్టీలేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్కాలర్‌షిప్‌లను రూ. 535 నుంచి రూ.1500లకు పెంచాలని, సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లను ఆరు బదులుగా 12 సిలిండర్లు సరఫరా చేయాలని, తుఫానుకు దెబ్బతిన్న పంట, ఆస్తి నష్టానికి యుద్ధ ప్రాతిపదికన పరిహారం మంజూరు చేయాలని, ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాకతీయ ఉత్సవాల కోసం రూ.150కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలకు రూ.100కోట్లు, చిత్తూరు జిల్లా ఉత్సవాలకు రూ.140కోట్లు విడుదల చేసిన ప్రభుత్వాలు కాకతీయ ఉత్సవాలకు రూ.25లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పద్యాలతో అకట్టుకున్న కేసీఆర్
                   విలేకరుల సమావేశంలో కేసీఆర్ పలు పద్యాలు పాడుతూ, వాటి అర్థాలు వివరిస్తూ.. వాటిని తాజా రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్‌తో చర్చలకు అనుసంధానించడంతో సమావేశం ఆసక్తికరంగా సాగింది. 
‘‘ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతో త్సాహులై
ప్రారద్దార్థం బుజ్జగింపరు సుమీ! ప్రజానిధుల్ గావునన్’’
అర్థం: మానవులలో అధములు, మధ్యములు ఆలంకాలకు బెదరి కార్యములు చేపట్టబోరు. ధీరులైన వారు విఘ్నములను అధిగమిస్తూ దూసుకెళ్లారు. ప్రజ్ఞానిధులు ఖర్మ, తలరాత అనే మాటలకు తావివ్వకుండా లక్ష్యాన్ని సాధిస్తారు.
పద్యం ఆంతర్యం: నిర్దేశించుకున్న లక్ష్యానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని అవరోధాలు, విద్రోహులు ఎదురైనా గమ్యాన్ని ముద్దాడే వరకు పోరాటం చేసి తీరుతారన్నది ఇందులోని అర్థం. పుష్కరకాలంగా తెలంగాణ సాధనకోసం చేస్తున్న ఉద్యమాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎదురైనా, చివరకు తాము అనుకున్న లక్షాన్ని సాధిస్తామని తేల్చిచెప్పారు. ఇటీవలి కాంగ్రెస్‌తో చర్చల విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలు, కరుణ శ్రీ రచించిన విజయశ్రీ నుంచి కొన్ని పద్యపాదాలు చదివి వినిపించారు.
‘‘ఐనను పోయి రావలయు హస్తినకచ్చటి సంధిమాట యొట్లైనను/ శత్రు రాజుల బలాబల సంపద చూడవచ్చు నీ’’
మరో పద్యం: ‘‘అయినవి సంధి సంబరం వాయుధముల్ ధరియింపుడయ్య/ దాపైనది వీర భారత మహారణ రంగం’’
కాంగ్రెస్ పార్టీ కపట బుద్ది తెలిసినా.. ఆవిర్భావనం నుంచి నేటివరకు తెలంగాణకు చేసిన ద్రోహం తెలిసినా.. పోయిరాక తప్పలేదు. దీని ద్వారా మరోసారి కాంగ్రెస్ కపట బుద్ధిబట్టబయలైంది. మన త్యాగశీలత బయట పడింది. ఇక చర్చలు, సంప్రతింపులు పూర్తయ్యాయి. లక్ష్యసిద్ధి కోసం మహారణ రంగమే చేయాల్సి ఉందంటూ ఆకట్టుకున్నారు.
                                   -(కరీంనగర్ నుంచి టీ మీడియా ప్రత్యేక ప్రతినిధి)

No comments:

Post a Comment