Saturday, 17 November 2012

రామసక్కని ప్రకృతి వరం సీతాఫలం


పండు ప్రకృతి ప్రసాదించే ఒక వరం. అందులో మహాసాధ్వీమణి, సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపమైన సీతమ్మ వారి పేరున పుట్టిన ఫలం గురించి చెప్పవలసిందేముంటుంది! 
- చెట్టుమీదే మక్కిన సీతాలప్పండు, అందులో రామసీతాలప్పండ్ల కమ్మదనం మధురాతి మధురం. మత్తెక్కించే ఆ తియ్యదనాన్ని కృత్రిమంగా సృష్టించడం మానవుల తరం కాదు. చెట్టుమీదే మక్కిన పండ్లు! ఈ ఫలాలను రామచిలుకలు వంటి పక్షులు కొరికి తింటాయి. చెట్టుమీది కాయనుకుని భ్రమ పడి తెంపుతుం కొన్ని చేతిలోనే పిసికి పోవచ్చు. కృత్రిమంగా మక్క కాయల కంటే ఇలా ప్రాకృతికంగా పండిన పళ్లు తినడానికి దొరికితే అదృష్టమే మరి. 
- ఒక్క సీతాఫలాలే కాదు, జామ, మామిడి, అరటి వంటి దాదాపు అన్ని రకాల పండ్లనూ చెట్లమీదే మక్కనిచ్చి తింటే వాటి రుచి, పోషకాల విలువ అత్యధికం. కానీ, పెద్ద మొత్తంలో అమ్ముకోవాలనుకున్నప్పుడు మాత్రం వాటిని చెట్లమీద కాయలుగా ఉన్నప్పుడే తెంపక తప్పదు. చాలావరకు శిత్పల కాయలను చెట్లమీంచి తెంపుకొచ్చి మక్క అమ్మడమే జరుగుతోంది. మూన్నాలుగు రోజులలోనే అవి చక్కగా పండుతాయి. ఊళ్లు, పట్నాలు, నగరాల బజార్లలో అమ్మే గంపల కొద్దీ సీతాఫలాలు దాదాపు ఇలాంటివే. కాయలను సేకరించి, వాటిని ఆకులలో కమ్మేసి, కొద్ది రోజుల్లో వాటిని మాగేలా (మక్క పెట్టడం) చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. శిత్పల కాయల్ని కాల్చి అందులోని గుజ్జును తినడాన్నీ కొందరు ఇష్టపడతారు.
- సీతాఫలాల (కస్టర్డ్ యాపిల్)ను ‘పేదవారి సేప్పండు’ అనీ అంటారు. ‘చక్కెర యాపిల్’ లేదా ‘స్వీట్ సోప్’ అనీ దీనిని పిలుస్తారు. బాగా పెద్దగా పెరిగిన, ఒక రకమైన మధురమైన పండ్లని ‘రామసీతాఫలాలని’ మనం అంటాం.
- శాస్త్రీయంగా సీతాఫలచెట్టు ‘అనోనాసియా’ అనే కుటుంబానికి చెందింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా రకాలున్నాయి. ప్రధానంగా రెండు రకాలను చెప్తారు. 
అవి: పింక్స్ మమ్మూత్ (హిల్లరీ వైట్), ఆఫ్రికన్ ప్రైడ్స్.
 ఇవి రెండూ తియ్యగానే కాక మంచి గుజ్జురసంతో సుమధురమైన రుచినే కలిగి ఉంటాయి. పింక్స్ మమ్మూత్ సీతాఫలాలైతే మరీ పెద్దగా ఉంటాయి. ఈ రకాల ఒక్కో చెట్టు ఒకో విడత కనీసం 3 కేజీల పళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్రికన్ ప్రైడ్స్ మధ్యస్త పరిమాణంలో ఉంటే, ఒక్కో పండు సుమారు 500-00 గ్రా. బరువు తూగుతుంది.
- సీతాపండు చర్మం సన్నగా ఉన్నా గట్టిదనం ఎక్కువే. చెట్టుకు పూచే పూలన్నీ కాయలై, అవి ఎదిగి, పక్వమవడానికి సాధారణంగా 20-25 వారాల సమయం పడుతుంది. కాయ పండయ్యాక లోన తెల్లని గుజ్జు ఏర్పడి, ఒక్కో గింజ చుట్టూ విడివిడిగా అదంతా అతుక్కుని పోతుంది. ఇందులోని నల్లని గింజల సంఖ్యను బట్టి దాని చర్మంపైన గుండ్రని భాగాలు ఉంటాయి. ఒక్కో గుండ్రని భాగంలో సాధారణంగా ఒక్కో గింజ తెల్లగుజ్జు మధ్య కప్పబడి ఉంటుంది. కొన్నిటిలో అసలు గింజలు లేకుండా కేవలం గుజ్జు మాత్రమే ఉంటుంది. ఇక, సగటున ఒక్కో పండులో సుమారు 55 నుంచి 60 లేదా 75 దాకా గింజలు ఉంటాయి.
- సీతాఫలం స్వస్థలం వెస్ట్ ఇండీస్. కానీ, ప్రాచీన కాలంలోనే మధ్య అమెరికా గుండా దక్షిణాది మెక్సికోకు తేబడింది. పెరూ, బ్రెజిల్‌లలో సుదీర్ఘకాలంగా ఈ చెట్లు పెంచుతున్నారు. 
                            బహమాస్ దీవులలో సీతాఫల చెట్లు సర్వసాధారణం. బెర్ముడా, దక్షిణాది ఫ్లోరిడాలలో సమయానుసారం పెరుగుతాయి. ఆఫ్రికాకు 17వ శతాబ్దపు ఆరంభంలో వచ్చింది. భారతదేశంలో మొదట్లో కోల్‌కతలోనే వీటిని ప్రత్యేకించి పండించారు. తర్వాత అనేక వన్య ప్రాంతాలకు ఇది విస్తరించింది. మలయా తూర్పుతీరంలో సీతాఫలాలు విస్తారంగా లభ్యమవుతున్నాయి. అమెరికాకు చెందిన గువామ్ దీవిలోకి గత ఏళ్ల క్రితమే ఇవి వచ్చాయి. ఇక, హవాయి ప్రజలకైతే సీతాఫలాలు అంటే ఏమిటో పూర్తిగా తెలియదు.
- సీతాఫలంలో పోషకాలు పుష్కలం. మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు బాగా ఉపయోగపడే ‘విటమిన్-సి’ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ (ఆక్సీకరణ నిరోధకాలు) వీటిలో ఉంటాయి. గుండె, హృద్రోగ వ్యాధుల నుండి మనల్ని రక్షించే పొటాషియం, మెగ్నీషియంలూ ఈ పళ్లలో అధిక పాళ్లలో లభిస్తాయి. మెగ్నీషియం మన దేహంలోని నీటి సమతుల్యతను కాపాడటమే కాక కీళ్లలోని అవాంఛనీయ రసాయనాలను తొలగిస్తుంది. ఫలితంగా కీళ్లవ్యాధి (రుమాటిజం), కీళ్లవాతం (ఆర్థిరిటిస్) లక్షణాలు తగ్గుముఖం పడతాయి.
- సగటున ఒక 100 గ్రాముల సీతాఫలం గుజ్జులో కొవ్వు పదార్థాలు 0.5-0.6 గ్రా. కార్బోహైడ్రేట్స్ 20-25.2 గ్రా. క్య్రూడ్ ఫైబర్ 0.9-6.6 గ్రా. కేలోరీలు 0-101 వరకు, తేమ 6.3-0.1 గ్రా. ప్రొటీన్లు 1.17-2.47 గ్రా. ఉంటాయి. కాల్షియం 17.6-27 మి.గ్రా. ఫాస్పరస్ 14.7-32.1 మి.గ్రా. ్వల్ప పాళ్లలో ఐరన్, క్యారోటిన్, థియామైన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, అబ్జార్బిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి.
- సీతాఫలాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే కాక దీని చెట్టు ఆకుల నుండి బెరడు దాకా అన్నీ వివిధ రకాల వ్యాధులు, అనారోగ్యాల చికిత్సకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఆకు డికాషన్‌ను జీర్ణాశయంలోకి తీసుకుంటారు. ఆకులను నూరి లేదా గుజ్జు పేస్టును కురుపులు, పొక్కులు, వ్రణాలు, అల్సర్ పుండ్ల చికిత్సకు ఉపయోగిస్తారు. దీని పక్వం కాని కాయ గుజ్జును అతిసార వంటి వ్యాధుల చికిత్సలోనూ వాడతారు. బాగున్నాయి కదాని అదే పనిగా, అతిగా సీతాఫలాలను ఆరగించరాదనీ నిపుణులు సలహా ఇస్తున్నారు. 
- సీతాఫల గింజలు చాలా గట్టిగా ఉంటాయి. వీటిని పండు గుజ్జుతోపాటు పొరపాటున మింగేసినా పెద్ద ప్రమాదమేమీ జరగదు. అవి మలవిసర్జనలోంచి తేలిగ్గానే బయటకు వచ్చేస్తాయి. నిజానికి ఈ గింజలు చాలా విషతుల్యమనీ నిపుణులు అంటారు. సీతాఫల గింజలేకాదు, ఆకులు, కాయలు అన్నీ మంచి క్రిమి సంహారకాలుగానూ ఉపయోగపడతాయి. చిత్రంగా దీని ఆకుల నుంచి తీసిన రసం తలలోని పేలును చంపేస్తుందంటున్నారు. 
ఆరోగ్యానికి ఎంతో మంచివి:
                            ప్రతి ఏడాది వచ్చే సీతాఫలాల కోసం చాలామంది ముఖ్యంగా పిల్లలు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. కారణం వీటి మధురమైన రుచి. ఆ కమ్మదనం మరే పండులోనూ దొరకదు. సీజన్ పొడుగునా శ్రుతి మించకుండా వీటిని తింటూ పోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటారు. పొద్దంతా బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన వారు తమ భోజన పదార్థాలలో ఈ పండ్లు చేర్చడం మంచిది. ఇందులోని పొటాషియం కండర బలహీనతను పోగొడుతుంది. మనలోని రక్తపోటును ఈ పండ్లు చక్కగా నియంవూతిస్తాయి. వీటిలోని ‘విటమిన్-ఎ’ చర్మం, తల ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఈ పండ్లు తినడం వల్ల కళ్లకూ ఎంతో మేలు చేకూరుతుంది. అజీర్ణ సమస్య తొలగుతుంది. మలబద్దకం నివారణవుతుంది. ఇక, అతిసార (డయేరియా), రక్త లేదా జిగట విరేచనాలు (డైసెంటరీ)ల చికిత్సకూ సీతాఫలాలు చక్కగా ఉపయోగపడతాయని నిపుణులు అంటారు. అంతేకాదు, రక్తహీనత (అనేమియా)తో బాధపడే వారికైతే ఈ ఫలాలు ఎంతో మంచివి. ఎందుకంటే, ఇందులోని కేలరీల శాతమూ తక్కువేమీ కాదు.
                                                                       - దోర్బల బాలశేఖరశర్మ

No comments:

Post a Comment