గన్ రాక్:
సికింద్రాబాద్ క్లబ్‌కు సమీపంలోని తిరుమలగిరి ప్రాంతంలో ఎత్తైన కొండపై ఉన్న మంచినీటి రిజర్వాయరే గన్‌రాక్. తిరుమలగిరి బొల్లారం, బోయిన్‌పల్లి ప్రాంతాలలో బ్రిటీషు మిలిటరీ దళాలు 1836లో స్థిరపడినాక స్థానికులకు మంచినీటి సౌకర్యం కోసం రిజర్వాయర్ అవసరమైంది. ఇందుకోసం తిరుమలగిరికి దగ్గరలో ఉన్న ఎత్తైన చిన్న కొండ ప్రాంతపై మంచినీటి రిజర్వాయర్ నిర్మించారు. ఇది ఆనాటి బ్రిటీష్ ఇంజనీర్ల సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మచ్చుతునక. దీన్ని ఆకర్షణీయమైన కోట మాదిరిగా నిర్మించడం విశేషం.
విజయ మేరీ చర్చి:
హైదరాబాద్ చింతల్ బస్తీలోని మహావీర్ ఆసుపత్రి కి దగ్గరలో ‘విజయమేరీ చర్చి’ ఉంది. దీన్ని ‘ఆరోగ్యమాత చర్చి’ అనీ స్థానికులు పిలుస్తరు. 1905లో ఇది నిర్మితమైంది. తరువాత నూతన ప్రార్థన మందిరానికి ఆనాటి ఏడవ నిజాం ప్రభువు శంకుస్థాపన చేశారు. కొత్త భవనం 1959లో పూర్తయింది. దీన్ని ఎనిమిది భుజాలతో నిర్మించారు. చర్చి లోపల మధ్య భాగంలో ఏర్పాటు చేసిన ప్రధాన ఆరాధనా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటది.
మహబూబ్ మాన్షన్:
ఆరవ నిజాం ప్రభువు నవాబ్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ (1869-1911) కొంతకాలం పాటు నివాసం ఉన్న ప్యాలెస్‌నే ‘మహబూబ్ మాన్షన్’ అంటున్నరు. ఎత్తైన ప్రవారీ గోడల మధ్య ఈ ప్యాలెస్ సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో, విశాలమైన గదులతో అత్యద్భుతంగా నిర్మితమైంది. ప్రస్తుతం మహబూబ్ మాన్షన్ చుట్టూ అనేక కాలనీలు వెలిశాయి. ఇండో- యూరోపియన్ శైలిలో నిర్మితమైన ఈ మాన్షన్ సందర్శకులకు కనువిందు చేస్తోంది.
మలానీ రెసిడెన్సీ:
గొప్ప సంఘసేవకులు, దానకర్ణుడిగా ప్రఖ్యాతి పొందిన సేఠ్ దీవాన్ బహదూర్ రాంగోపాల్‌కు చెందిన నివాస భవనమే మలానీ రెసిడెన్సీ. హైదరాబాద్ బేగంపేటలో 1936 ప్రాంతంలో రాంగోపాల్ తన కోసం నిర్మించుకున్న ఈ భవనం నేటికీ చెక్కు చెదరక ఆనాటి నిర్మాణ శైలిని సందర్శకుల కళ్ళెదుట నిలుపుతోంది. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ ప్యాలెస్ నాటి నిర్మాణ కళా వైభవానికి మచ్చుతునక. ఇది జర్మనీ దేశీయ నిర్మాణ శైలిలో ఆకట్టుకుంటోంది.
మహబూబ్ మజీద్:
లాడ్ బజార్‌కు సమీపంలో ఆరవ నిజాం రాజు మహబూబ్ ఆలీ పాషా నిర్మించిన మజీద్‌కు ఆయన పేరే స్థిరపడింది. ఇది క్రీ.శ. 1817లో నిర్మితమైంది. పురాతన పద్ధతిలో నిర్మించిన ఈ కట్టడం పై భాగంలో మసీదును నిర్వహిస్తుండగా, కింది భాగంలో కొన్ని దుకాణాలను నిర్వహిస్తున్నరు. ఈ వాణిజ్య సముదాయాల నుండి వచ్చే ఆదాయాన్ని మసీదు కమిటీకి చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రార్థనా మందిరం అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ప్రతి రంజాన్, ఈద్ ఉల్ పీతర్ సమయంలో వేలాది మంది మస్లిం భక్తులు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తరు.
No comments:
Post a Comment