Monday, 5 November 2012

గిరిదుర్గం.. ఖిల్లా ఘణపురం

          కాకతీ గణపతి స్వయంగా పాలించినందువల్ల ఆయన పేరుతోనే ‘ఘనపురం’ ఏర్పడిందని, తర్వాత అది ‘ఘణపురం’గా మారిందని చరిత్ర కారులు తమ రచనల్లో పేర్కొన్నారు. అయితే, ఇది పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మితమైన గిరిదుర్గమనీ మనం మరవరాదు.
keela
             మహబూబ్‌నగర్ జిల్లా చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే అనేక రాజవంశాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలోని అనేక ప్రాంతాలలో లభించిన శాసనాలు, చరివూతకు సాక్ష్యంగా నిలిచిన గిరి, వన, జలదుర్గాలు, రాజ భవనాలే ఇందుకు నిదర్శనం. హిందూ, మహమ్మదీయ రాజుల ఏలుబడిలో సంస్థానాలు ఒక వెలుగు వెలిగాయి. కొన్ని ప్రాంతాలను రాజరిక దర్పం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం ఉపయోగించుకోగా, మరి కొన్నింటిని యుద్ధ స్థావరాలుగా, ధన, ధాన్య కోశాగారాలుగా వినియోగించుకున్నారు. పాన్‌గల్, చంద్రఘడ్, కోయిలకొండ, ఘణపురం ప్రాంతాలను నాటి రాజులు గిరిదుర్గాలుగా మలచుకొని యుద్ధ వ్యూహాలను అమలు చేసినట్లు చారివూతక ఆధారాల వల్ల స్పష్టమవుతోంది.క్రీ.శ. 1040 నుండి 1687 వరకు హిందూ, మహమ్మదీయ రాజులు ఆయా ప్రాంతాలపై ఆధిపత్యం కోసం యుద్ధాలు చేశారనడానికి తెలంగాణలోని పలు జిల్లాలలో నాటి రాచరికపు జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో లభించిన శాసనాలు, కట్టడాలను పరిశీలిస్తే కందూరి చోడులు, విజయనగర రాజులు, రేచర్ల పద్మనాయకులు, మునుసూరి ప్రభువులు, బహమనీ సుల్తానులు, గోలకొండ ప్రభువులు ఈ ప్రాంతాలలో పరిపాలన సాగించినట్లుగా స్పష్టమవుతోంది. 
         కాకతీ గణపతి కాలంలో అరివీర భయంకరులుగా పేరు గడించిన రేచర్ల పద్మనాయకులు సేనాధిపతులుగా, సామంత రాజులుగా ప్రధాన భూమికను నిర్వహించారు. వీరి కాలంలోనే గజ, అశ్వ, పదాతి తివిధ) దళాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రాచీన యుద్ధ పద్ధతులకు స్వస్తి పలికి ఫిరంగులను ఉపయోగించినట్లు చరిత్ర అధ్యయనం ద్వారా స్పష్టమవుతోంది. 
kondalu
          రేచర్ల పద్మనాయకులు స్వతంత్ర రాజులుగా ఎదిగి తమ ప్రభువుపై భక్తితో ఘణపురం కోటను నిర్మించి దానికి తమ ప్రభువు పేరునే పెట్టుకొన్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాకతీ గణపతి స్వయంగా ఈ ప్రాంతాలన్ని పాలించినందువల్ల ఆయన పేరుతోనే ‘ఘనపురం’ ఏర్పడిందని, తర్వాత అది ‘ఘణపురం’గా మారిందని మరి కొందరు చరిత్రకారులు తమ రచనల్లో పేర్కొన్నారు. కాకతీ గణపతి పాలన క్రీ.శ. 1198-1262 వరకు, రేచర్ల పద్మ నాయకుల పాలన క్రీ.శ.1326 నుండి 1482 వరకు, 1518 నుండి 1687 వరకు 8 మంది కుతుబ్షాహీ వంశీయుల వరకు పరిపాలన జరిగినట్లు చరిత్ర చెబుతోంది. యుద్ధ వ్యూహాలకు అనువుగా ఖిల్లా ఘణపురం కోట నిర్మాణాన్ని చేపట్టినట్లు దాని నిర్మాణ శైలి, స్థల ఎంపికను పరిశీలించిన వారికి అర్థమవుతుంది. మెట్లదారి నుండి పైకి వెళ్ళిన తర్వాత ముందుగా దర్శనమిచ్చేది ఆంజనేయుని గుడి. ఇక్కడి నుండి మరికొంత దూరం వెళ్తే మొదటి ద్వారాన్ని చేరుకోవచ్చు. ఈ ద్వారం గుండా ముందుకెళ్తే రెండుగా చీలిన రెండవ ద్వారం వస్తుంది. దీనిని కూడా దాటి ముందుకు సాగితే మూడవ ద్వారం వస్తుంది. ఈ ద్వారం పైకి వెళ్ళేందుకు చిన్న మెట్లదారి ఉంది. ద్వారం పైకప్పు, పక్క గోడలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడంతో పెచ్చులూడి పోయాయి. దీనికి దగ్గరలోనే గచ్చుబావి ఒకటి ఉంది. దీనిని ‘స్నాన వాటిక’గా ఉపయోగించుకునే వారని, పక్కనే ఉన్న గుండం ఏనుగులు, గుర్రాల కోసం తవ్వించారని, అందుకే, దీనిని ‘ఏనుగుల గుండం’గా పిలుస్తారనీ స్థానికులు తెలిపారు.
                      కోట పైభాగంలో మరో రెండు జలాశయాలు ఉన్నాయి. ఫిరంగి ఏర్పాటు చేసిన అరుగుకు కొద్ది దూరంలో నేతిగుండం, పాలగుండం పేరుతో నీటిని నిల్వ చేసుకొనే నిర్మాణాలున్నాయి. వీటిలో ఇప్పటికీ స్వచ్ఛమైన నీరు లభించడం విశేషం. ఇక్కడికి దగ్గరలోనే ‘తాటి గుండం’ పేరుతో మరో కొలను ఉంది. పక్కనే నివాస భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ కోటలో చీకటి గది నిర్మాణాన్ని మరో విశేషంగా చెప్పుకోవచ్చు. కోటపైకి వెళ్ళేందుకు రెండు దారులుండగా ఒకటి రహస్య రహదారిగా నిర్మించుకొని వినియోగించుకున్నారని, అందుకే దీనిని ‘దొంగలదారి’గా స్థానికులు పిలుస్తారనీ తెలుస్తోంది. అయితే, స్థానికుల సహకారం లేకుండా కోటపైకి వెళ్ళడం పర్యాటకులకు కష్టం.

No comments:

Post a Comment