Monday, 10 June 2013

బీజేపీలో మోడీ శకం


- ఎన్నికల ప్రచార కమిటీ పగ్గాలు అప్పగింత 
- మోడీ ఎంపికతో అద్వానీకి ఎదురుదెబ్బ.. చివరివరకూ నిరోధించిన
  అగ్రనేత!
- ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో మోడీకే బాధ్యతలు
-  మోడీ ఎన్నిక ఏకగ్రీవం ఇది బీజేపీ విజయానికి బాట : రాజ్‌నాథ్
-  జనం విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్
-  దేశం నుంచి ఆ పార్టీని తరిమేయాలి 
-  వాజపేయి ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయాలి
-  కొత్త బాధ్యతల స్వీకరణ అనంతరం మోడీ

        
తీవ్ర ఉత్కంఠ.. తర్జనభర్జనలు.. వ్యతిరేకతల నడుమ బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు గుజరాత్ సీఎం నరేంవూదమోడీకి దక్కాయి. పార్టీలో వాజపేయి తర్వాత కురువృద్ధ నేతగా ఉన్న అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించినా.. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు, అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ బాసట తోడవడంతో ప్రతికూల పరిస్థితులను మోడీ సునాయాసంగానే అధిగమించగలిగారు.

మోడీని జాతీయ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమించినట్లు రాజ్‌నాథ్‌సింగ్ గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు అనంతరం విలేకరులకు వెల్లడించారు. మోడీ ఎంపిక.. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి బాటగా అభివర్ణించారు. ఇది ఏకగ్రీవ ఎన్నికని చెప్పిన రాజ్‌నాథ్.. మరిన్ని వివరాలు వెల్లడించకుండానే వెళ్లిపోయారు. రెండు రోజుల సమావేశానికి అనారోగ్య కారణాలు చూపి అద్వానీ డుమ్మా కొట్టడం ద్వారా మోడీ ఎన్నికను నిరోధించేందుకు ప్రయత్నించినా.. రాజ్‌నాథ్ వర్గీయులే పై చేయి సాధించినట్లు అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు మోడీకి దక్కడంతో అద్వానీకి బీజేపీలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడిన మోడీ.. రాజ్‌నాథ్‌ది పెద్దమనసని చెప్పారు. తనకు ఇంతటి బాధ్యతను, గౌరవాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధించిన గుజరాత్ సీఎం.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఆ పార్టీని దేశం నుంచి తరిమివేయాలని, కాంగ్రెస్ నుంచి భారత్‌ను విముక్తి చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

వాజపేయి ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేసేందుకు బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని కాంగ్రెస్ గతంలో అనేకసార్లు దుర్వినియోగం చేసిందని మోడీ ఆరోపించారు. రాజ్‌భవన్‌లు కాంగ్రెస్ భవన్‌లుగా మారాయని విమర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్‌వారు సీబీఐని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జాతీయ సలహా మండలిలోనే కాదు.. ప్రణాళికా సంఘంలోనూ నక్సల్స్‌తో ములాఖత్ అయినట్లు ఆరోపణలు ఉన్న వ్యక్తి ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్‌గా మోడీ పేరును ప్రకటించగానే.. సమావేశంలో దాదాపు ఐదు నిమిషాలు ఆగకుండా మోగిన చప్పట్లు.. ఇక బీజేపీలో మోడీ శకం ప్రారంభమైందనడానికి, అద్వానీ శకం ముగిసిందనడానికి సంకేతాలని విశ్లేషకులు అంటున్నారు.

మోడీతో అధికారం.. అధికారంతో తెలంగాణ
* ప్రత్యేక రాష్ట్రం వచ్చేస్తుందంటున్న బీజేపీ టీ నేతలు
    గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎన్నుకోవడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మోడీ రాకతో తమ పార్టీ విజయావకాశాలు మెరుగయ్యాయని, ఫలితంగా బీజేపీ అధికారంలోకి వచ్చి, తెలంగాణ ఇవ్వడం ఖాయమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మోడీని ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఎంపిక చేయడం మంచి పరిణామంగా బీజేపీ నేతలు ప్రచారం చేయనున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100రోజుల్లో తెలంగాణ ఇస్తామని గతంలో ఆపార్టీ అధినేతగా ఎల్‌కే అద్వానీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ గుజరాత్ అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలు, వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వంటి అంశాలు నరేంద్ర మోడీ చేసే ప్రచారానికి ఓట్ల రూపంలో ప్రతిఫలం ఇవ్వనున్నాయని అంటున్నారు. గుజరాత్ అభివృద్ధిపైనే కాకుండా ఆంధ్రవూపదేశ్‌పైనా మోడీ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మోడీని ఇక్కడి బీజేపీ నేతలు కొనియాడుతున్నారు. మోడీ బీసీ నేత అయినందున ఈ అంశాన్ని కూడా ప్రచారం అస్త్రంగా వాడుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు సీనియర్లు చెబుతున్నారు.

No comments:

Post a Comment