Saturday, 8 June 2013

రాష్ట్ర సాధనకు ఇదే ఆఖరి పోరాటం


-టీఆర్‌ఎస్‌కు 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు రావాలి
- ఢిల్లీ దిగివచ్చి కేసీఆర్ వద్ద మోకరిల్లి తెలంగాణ ఇస్తుంది
- జనగామ టీఆర్‌ఎస్ శిక్షణ శిబిరంలో కేకే, కడియం, హరీశ్
జనగామ, జూన్ 7(టీ మీడియా):‘ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు సాధించి పెడితే, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా కేసీఆర్ వద్ద మోకరిల్లి తెలంగాణ ఇస్తుంది.రాష్ట్ర సాధనకు ఇదే ఆఖరిపోరాటం’అని టీఆర్‌ఎస్ సీనియర్ నేత కే కేశవరావు చెప్పారు. శుక్రవారం వరంగల్ జిల్లా జనగామలో నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతు లు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ తెలంగాణపై మాటిచ్చి నాలుగున్నర కోట్ల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం వెయ్యిమంది ప్రాణత్యాగాలు చేస్తే మనిషిగా పుట్టినందుకు తాను చలించిపోయి కాంగ్రెస్‌పార్టీని, పదవులను వదలిపెట్టి, రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాతో ముందుకుపోతున్న టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు తప్ప, ఇంకెప్పుడు తెచ్చుకోలేమని ఉద్వేగంగా అన్నారు. 

టీడీపీ ముఖంలోనే తెలంగాణ వ్యతిరేకత కనిపిస్తుందని, బీజేపీని క్షేత్రస్థాయిలో ప్రజలు నమ్మడంలేదని, అనుకూలమంటున్న సీపీఐకి ప్రజాబలం లేదని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎన్నికల్లో 15 ఎంపీ, 100 ఎమ్మెల్యే స్థానాలను గెలిస్తే, కేసీఆర్ కాళ్లు మొక్కి తెలంగాణ ఇస్తారని చెప్పారు. తెలంగాణపై రెండు నాల్కల ధోరణి, రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీని గ్రామాల్లో అడుగుపెట్టనివ్వొద్దని పిలుపునిచ్చారు. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవూరి ఇప్పటికైనా ప్రజలను మోసం చేసి ఆత్మవంచన చేసుకోవద్దని కోరారు. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా చంచల్‌గుడా జైలుకు పోతారని జోస్యం చెప్పారు. తప్పుచేసి ప్రజలకు ముఖం చూపించుకోలేకే కోడలిని గ్రామాల్లో తిప్పుతున్నారని, ఆయనను, కుటుంబాన్ని నిలదీయాలని 
పిలుపునిచ్చారు.

ఓటుతో బుద్ధిచెప్పాలి:హరీశ్‌రావు
వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిస్తే దెబ్బకు ఢిల్లీ దిగివచ్చి కేసీఆర్ కాళ్లముందు మోకరిల్లి తెలంగాణ ఇచ్చి తీరుతుందని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు చెప్పారు. స్వీయ రాజకీయశక్తితో ఎదిగేందుకు ఓటుతో సీమాంధ్ర పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. యాచించి కాకుండా శాసించి తెలంగాణ తెచ్చుకోవాలంటే టీఆర్‌ఎస్ బలమైన రాజకీయశక్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకం కావాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలో తెలంగాణ నేతలు డిప్యూటీ పదవులకే పరిమితమవుతారని, ఎన్నటికీ సీఎం, పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ, శాసనమండలి చైర్మన్లు కాలేరన్నారు. తెలంగాణకు ‘ఒక్క రూపాయి ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేస్కో’ అని సీఎం కిరణ్ ఆహంకారాన్ని ప్రదర్శిస్తే సభలో ఉన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు మద్దతు ఇవ్వలేదని, అలాంటి వాళ్లకు ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. 14న చలోఅసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు 
పాల్గొన్నారు.

No comments:

Post a Comment