హైదరాబాద్: ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి సరియైన మెజారిటి రాదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్‌గా కేకే ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విలేకరులతో కేసీఆర్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏపార్టీకి సరియైన మెజారిటీ రాదని టీఆర్‌ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో మూడు ముక్కలాటలా రాజకీయలున్నాయని అన్నారు. ఆ ఎన్నికల్లో అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్సీపీ దేనికి కూడా పది సీట్లు రావని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పదహారు ఎంపీ సీట్లతో ఏపీ నుంచి టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని తెలిపారు. టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగబోతోందని వివరించారు.
* తెలంగాణ సాధనే మా ఎజెండా
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా టీఆర్‌ఎస్ పనిచేస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం రెండో ఎజెండా అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతిమంగా తెలంగాణ ప్రజలే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకున్నా తామంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు.
* చలో అసెంబ్లీని విజయవంతం చేసినం
సీమాంధ్ర సర్కారు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఛలో అసెంబ్లీని విజయవంతం చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని లాఠీలు, రబ్బరు తూటాలు పేల్చినా ఉద్యమాన్ని ఆపలేకపోయారని అన్నారు. ప్రభుత్వం ఉద్యమంపట్ల నియంతృత్వంగా వ్యవహరించిందని, మరోసారి అలా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
* ప్యాకేజీ అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ప్యాక్ చేస్తరు
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా అని ఒక విలేకరి ప్రశ్నించగా కేసీఆర్ ఆగ్రహంతో సమాధానం చెప్పారు. ప్యాకేజీలకు తెలంగాణ ప్రజలు అంగీకరించరని, కాంగ్రెస్‌కే ప్యాక్ చేసి బంగాళాఖాతంలో విసిరేస్తారని అన్నారు. హైదరాబాద్ నగరంతో కూడిన పది జిల్లాలతో తప్పా వేరే ప్రతిపాదనలకు వేటికి ఎట్టి పరిస్తితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment