Tuesday 9 October 2012

మరో పోరుకు టీ జేఏసీ సన్నద్ధం

* వచ్చే నెల 1న పల్లెపల్లెన   నల్లజెండాలు ఎగురవేయాలి
*  ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఆత్మబలిదానాలు 
* అమరుడు కాకి కుమార్ సంతాప సభలో కోదండరాం 
            తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమానికి రూపకల్పన చేసి, పోరాటానికి సన్నద్ధమవుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగాడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న కాకి కుమార్ ప్రథమ వర్థంతి సందర్భంగా సోమవారం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  కోదండరాం, ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ స్వామిగౌడ్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, జేఏసీ తూర్పు డివిజన్ చైర్మన్ చల్మాడ్డి తదితరులు హాజరయ్యారు. కాకి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం మరో పోరాటానికి ప్రణాళికలు రూపొందించేందుకు తెలంగాణవాదులు, జేఏసీ ప్రముఖులతో చర్చిస్తున్నామని తెలిపారు. నవంబర్ 1న తెలంగాణ విద్రోహ దినాన్ని తెలంగాణ జిల్లాల్లోని పల్లెపల్లెలో నిర్వహించి, ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని, అదేరోజు తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలతోపాటు  పల్లెపల్లెలో నల్లజెండాలు ఎగురవేయాలని కోరారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్య ధోరణివల్లనే తెలంగాణ ప్రాంతంలో యువకుల ఆత్మబలిదానాలు పెరిగిపోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించటంలేదన్నారు. ప్రభుత్వాలు తెలంగాణ విషయం తేల్చకుండా తెగేదాకా లాగుతున్నాయని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని లెక్కచేయకుండా లక్షల మంది తెలంగాణ మార్చ్‌లో పాల్గొన్నారని, కేంద్ర ప్రభుత్వానికి వణుకుపుట్టించారని చెప్పారు. తెలంగాణ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాకపోవటంతో నిరాశచెంది కాకి కుమార్ ఆత్మబలిదానం చేసుకున్నాడని, ఆయన ఆశయ సాధన కోసం తెలంగాణవాదులు మహా ఉద్యమాన్ని నిర్వహించాలని కోరారు.
                        అనంతరం ఉద్యోగ జేఏసీ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న రంగాడ్డి జిల్లాలో వనరులు, భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులు దోచుకున్నారని మండిపడ్డారు. ఆంధ్రా పెత్తనం కింద అనేక గ్రామాలు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని భూములు లాక్కున్న ప్రభుత్వం రింగురోడ్లను ఏర్పాటు చేసిందని, భూములు కోల్పోయిన నిర్వాసితులు రింగ్‌రోడ్లు ఎక్కాలంటే పన్ను చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యిమంది వరకు ఆత్మబలిదానం చేసుకున్నా ఈ ప్రభుత్వం కళ్లు తెరవడంలేదని విమర్శించారు. కొన్ని రాజకీయశక్తులు తెలంగాణ ఏర్పడకుండా అడ్డుతగులుతున్నాయని, తెలంగాణ వ్యతిరేక శక్తులు గ్రామాలకు వస్తే చెప్పులతో సత్కరించాలని పిలుపునిచ్చారు. సకలజనుల సమ్మె జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం రాదని ఆవేదనతో కాకి కుమార్ ఆత్మబలిదానం చేసుకున్నాడన్నారు. యువకుపూవరూ తెలంగాణ కోసం ఆత్మ త్యాగం చేయవద్దని, తెగించి పోరాడాలని సూచించారు. అనంతరం పీడబ్ల్యూవో నాయకురాలు సంధ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. టీ జేఏసీ తూర్పు డివిజన్ చైర్మన్ వెదిరె చల్మారె డ్డి మాట్లాడుతూ.. కాకి కుమార్ ఆకాంక్ష మేరకు నవంబర్ 15న కొంగరకలాన్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. సంతాప సభకు ముందు కుమార్ సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధు సత్యం, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, టీ జేఏసీ నియోజకవర్గం కన్వీనర్ బర్ల జగదీశ్‌యాదవ్, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు రాంనర్సింహగౌడ్, ఉద్యోగ జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ అశోక్‌కుమార్, టీఎన్‌జీవో కార్యదర్శి వేణు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నర్సింహ, ఉద్యోగ జేఏసీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ నాయకులు అజయ్, సీపీఐ నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment