Friday, 19 October 2012

తెలంగాణపై పైత్యం ముదిరితే కెమెరామెన్ గంగతో రాంబాబు

- ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై విషంగక్కిన పూరీ జగన్నాథ్

                 కాల్పనిక కథలతో రంగుల చిత్రాలు సృష్టించుకునే ఓ దర్శకుడు.. ప్రత్యేక ఆకాంక్షతో సాగుతున్న విశిష్ట ఉద్యమంపై తన మనసులో ఉన్న ద్వేషాన్నంతా వెండి తెరపై కక్కేస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రాన్ని కుంభకోణాల మయంగా మార్చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రాజకీయ నేతను భుజాలపై ఎత్తుకుని మోసేస్తే ఎలా ఉంటుంది? అచ్చం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలా!! ఈ సినిమాలో సమకాలీన రాజకీయాల ప్రస్తావనే ఉండదని సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు చెప్పిన దీని దర్శకుడు పూరీ జగన్నాథ్.. అవే రాజకీయ పరిణామాలను తన కథకు ఆసరా చేసుకున్నారు. అంతవరకూ అభ్యంతరం లేదు! అయితే.. తన కథకు మసాలా జోడించడం కోసం.. పైత్యం ముదిరిందన్నట్లు ఏకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై నిప్పులుగక్కడం.. విపక్ష నాయకుడిని, ఆయన కొడుకును దుష్టపాత్రల్లో చూపించి.. పరోక్షంగా ఉద్యమ నేతలపై విషం చిమ్మడం అంతర్లీనంగా అర్థమవుతుంది! తను చేస్తున్న దాడి ప్రేక్షకుడికి తెలియకుండా చూసే తాపత్రయంలో పార్టీలను, పార్టీల నేతలను కలగాపులగం చేసేసి.. విమర్శల నుంచి బయటపడిపోవచ్చని చేసిన ప్రయత్నం స్పష్టంగా గోచరిస్తుంది!!తెలంగాణ ఉద్యమంపై పూరీ జగన్నాథ్ కక్కిన విషమే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం. ఇందులో సమకాలీన రాజకీయాంశాలు ఉండవని, ఓ రాజకీయ నాయకుడికి, మీడియా రిపోర్టర్‌కు మధ్య జరిగే పోరాటమే ఇతివృత్తమని విడుదలకు కొద్దిరోజుల ముందు ఇంటర్వ్యూల్లో చెప్పారు చిత్ర దర్శకుడు. బడా రాజకీయ నాయకుడు సృష్టించే ఓ పెద్ద సమస్య నుంచి రాష్ట్రాన్ని సదరు రిపోర్టర్ కాపాడటమే కథని తెలిపారు.
  అయితే ‘కె.గం.రాం’ సినిమా చూసిన ఎవరికైనా పూరీ ఈ సినిమాను ఎవరిని లక్ష్యంగా చేసుకొని తీశారో ఇట్టే అర్థమైపోతుంది.రాజశేఖర్‌డ్డి మరణం తర్వాత ఆయన జీవితగాథ ఆధారంగా ఓ సినిమా తీస్తానని పూరీ ప్రకటించాడు. ఆ సినిమాకు ‘వై.ఎస్.రాజశేఖర్‌డ్డి’ అని పేరు కూడాపెట్టారు. ఏమైందో ఏమో అది తెరకెక్కలేదు. అయితే ఆ ‘మహా’నాయకుడిపై ఉన్న వీర విధేయతను ‘కె.గం.రాం’ చిత్రంలో అన్యాపదేశంగా చాటుకున్నట్లు స్పష్టంగా కనపడిపోయింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంపై తనకున్న ఏహ్యభావాన్ని సినిమాలో దుష్టపావూతల ద్వారా ప్రకటించుకున్నారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న ఓ పెద్ద సమస్య అంటూ ‘తెలుగు తల్లి’ పార్టీ పేరుతో ఓ పార్టీని, ప్రకాష్‌రాజ్ పాత్రలో దుష్ట ఉద్యమనాయకుడ్ని చూపిస్తూ తెలంగాణ ఉద్యమం పట్ల తనకున్న వ్యతిరేకతను చాటుకున్నాడు దర్శకుడు. మీడియా కథ ముసుగులో తెలంగాణ ఉద్యమంపై చేసిన దాడి ఎలాంటిదో తెలుసుకోవాలంటే స్థూలంగా చిత్ర కథకు వద్దాం. పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల బాధ్యతతో స్పందించి సత్వరమే బాధితులకు న్యాయం చేసే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి రాంబాబు (పవన్‌కల్యాణ్). అతను మెకానిక్. గంగ (తమన్నా) ఓ చానల్‌లో రిపోర్టర్. రాంబాబు చేస్తున్న సామాజిక సేవతో ముచ్చటపడ్డ ఆమె రాంబాబును తన చానల్‌లో రిపోర్టర్‌గా చేర్పిస్తుంది. ఇదిలావుండగా సీఎం చంద్రశేఖర్‌డ్డి (వై.యస్.ఆర్.ను దృష్టిలో పెట్టుకొని సృష్టించిన పాత్ర) జనరంజకంగా పాలిస్తుంటాడు.
              అయన్ని దింపి తన కొడుకు రానాబాబుపకాష్‌రాజ్)ను సీఎంను చేయాలన్నది ప్రతిపక్ష నేత జవహర్‌నాయుడు (కోట శ్రీనివాసరావు) ఆశయం. ఈ క్రమంలో రానాబాబును ఓ కేసులో ఇరికిస్తాడు రాంబాబు. దీంతో మీడియాపై కక్షగట్టిన రానాబాబు అదే మీడియా సహకారంతో సీఎం అవుతానని చాలెంజ్ చేస్తాడు. రానాబాబు సీఎం కాకుండా రాంబాబు ఎలా నిలువరించాడన్నదే మిగతా చిత్రకథ. అనేక అంశాల చుట్టూ కథ తిరిగినా రానాబాబు-రాంబాబు మధ్య పోరాటమే సినిమా ప్రధానాంశం. ఇక్కడే రానాబాబు పాత్రకు ‘ఉద్యమ’ నేపథ్యాన్ని అంటగట్టి కథను నడిపించాడు పూరీ. రానాబాబు తన రాజకీయ ప్రస్థానం కోసం ‘తెలుగుతల్లి’ అనే ఉద్యమ పార్టీని స్థాపిస్తాడు. తన రాష్ట్రంలో తెలుగు ప్రజలు తప్ప మరాఠీ, బెంగాలీ, మలయాళీలు ఎవరూ ఉండకూడదని, వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువుల్ని బహిష్కరించాలని ప్రసంగాలు చేస్తుంటాడు. తెలుగు ప్రజల్ని పక్క రాష్ట్రాల వారు వచ్చి దోచుకుంటున్నారని విమర్శలు చేస్తుంటాడు. రానాబాబు, జవహర్‌నాయుడు పాత్రలను పూరీ ఏ దృష్టికోణంలో సృష్టించాడో కాస్త జ్ఞానం ఉన్న చిన్నపిల్లాడికైనా తెలిసిపోతుంది. 
        తెలంగాణ ఉద్యమం అని నేరుగా ప్రస్తావించే సాహసం చేయలేకపోయిన పూరీ.. ‘తెలుగు తల్లి పార్టీ, తెలుగు ఉద్యమం అంటూ సినిమా కథలో ఆ అంశాల్ని చొప్పించాడు. ఇక ఇందులో ప్రకాష్‌రాజ్‌ను ప్రశ్నిస్తూ కథానాయకుడు సంధించే డైలాగులు ఎవరి గురించో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. అందులో కొన్ని సంభాషణలివి.. ‘పక్క రాష్ట్రాల తల్లులంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయగీతం పాడే హక్కు ఎక్కడిది’, ‘నిన్ను, నీ బాబుని ఢిల్లీ గెస్ట్‌హౌజ్ నుంచి తీసుకొచ్చి బట్టలూడదీసి కొడితే ఎలా ఉంటుందో రాష్ట్రం అలా ఉందిరా’ అంటూ కథానాయకుడు పలికే సంభాషణల వెనక ఆంతర్యం పసిగట్టడం కష్టంగా అనిపించదు. సామాజిక సందేశం ఉంది కాబట్టే పవన్ ఈ సినిమాకు అంగీకరించారని పూరీ ఓ సందర్భంలో చెప్పారు. 
         అసలు వీరిదృష్టిలో సామాజిక సందేశం అంటే ఏమిటి? కల్పిత పాత్రలు సృష్టించి, ప్రజల ఆకాంక్షల నుంచి ఉద్భవించిన ఓ మహోద్యమాన్ని, ఉద్యమ నాయకుల్ని టార్గెట్ చేయడమేనా? నాలుగు కోట్ల ప్రజల సామూహిక స్వప్నమైన మహత్తర భావనకు వక్రభాష్యాలు చెబుతూ దుష్ట పాత్రల ద్వారా అపహాస్యంచేయడమేనా? సినిమా ముసుగులో కోట్ల మంది ప్రజల మనోభావాల్ని కించపరచడమేనా సామాజిక సందేశమంటే? చక్కటి సాహిత్య అభినివేశం కలిగి, సమాజం పట్ల గొప్ప అవగాహన ఉన్న వ్యక్తిగా పరిక్షిశమలో గుర్తింపు వున్న పూరీ ఓ ప్రజా ఉద్యమాన్ని అవహేళన చేయడం ఎంతవరకు సమంజసం? తనదైన శైలిలో రెండు ఐటమ్‌పాటలు, నాలుగు సెట్‌సాంగ్‌లు, నాలుగు పోరాట దృశ్యాలతో సినిమాను నడిపించిన పూరీ.. ఉద్యమాన్ని అవహేళన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సినిమా చూసిన సగటు తెలంగాణవాది మదిలో ఉద్భవించే ప్రశ్నలివి. సిగ్గుచేటైన మరో విషయం ఏమిటంటే.. ‘వీర తెలంగాణ’, ‘పోరు తెలంగాణ’ చిత్రాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మానవీయకోణంలో వెండితెర దృశ్యమానం చేసిన అభ్యుదయ చిత్రాల రూపకర్త ఆర్ నారాయణ మూర్తికి ఈ చిత్రాన్ని అంకితమివ్వడం!

No comments:

Post a Comment