Wednesday, 3 October 2012

మార్చ్ విజయం!


‘మొదట నిన్ను అసలు పట్టించుకోరు. ఆ తరువాత అవహేళన చేస్తారు. ఆనక నీతో తలపడతారు. అప్పుడు నీదే విజయం’ అన్నాడు మహాత్మా గాంధీ. ఈ సుభాషితం తెలంగాణ ఉద్యమానికి కూడా వర్తిస్తుంది. అందులోనూ ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్షికమానికి వర్తిస్తుంది. హైదరాబాద్ మార్చ్ కార్యక్షికమాన్ని చేపడతామని తెలంగాణ జేఏసీ ఎప్పుడో మూడు నెలల కిందటే ప్రకటించింది. ప్రభుత్వం అసలు పట్టించుకోనేలేదు. తెలంగాణ ఉద్యమకారులు గ్రామ స్థాయిల్లో సన్నాహక కార్యక్షికమాలు మొత్తం పూర్తి చేసుకున్నారు. ప్రజలు ఉద్యమోన్ముఖులై కదులుతున్నారు. ఊరూరా చలో హైదరాబాద్ అంటూ కవాతులు జరిగాయి. ఈ దశలో మార్చ్‌కు అనుమతి లేదు,ఎట్లా వస్తారు అంటూ తృణీకార భావంతో మాట్లాడింది. ఉద్యమాన్ని చులకన చేసింది. ఉద్యమ నాయకులు స్వయంగా వెళ్ళి కోరినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. అయినా సరే తెలంగాణ జనం బెదరలేదు. ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోలే దు. నిరసన తెలపడం మా హక్కు అని ఉద్యమకారులు ప్రకటించారు. మా హైదరాబాద్‌లో మేం ప్రదర్శన జరుపుకుంటే అనుమతి నిరాకరించడమేమిటి అని ప్రజలు అవమానంగా భావించారు. దీంతో ప్రభుత్వం ఘర్షణ వైఖరి అవలంబించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు మన ఉనికిని, మన ఆగ్రహాన్ని, మన పోరాటాన్ని కనీసం గుర్తించడానికి నిరాకరించిన ఆవలి పక్షం మన బలాన్ని గుర్తించి ఘర్షణ పడుతున్నదంటే- అది మన బలానికి, ఎదుటి వారి బలహీనతకు నిదర్శనం. మన విజయానికి తొలి సూచిక. ప్రభుత్వం ఘర్షణ వైఖరికి దిగిన తరువాత జిల్లాల్లో నిర్బంధకాండ తీవ్రం చేసింది. తెలంగాణవాదులను వేధించడం మొదలు పెట్టింది. దీంతో ఉద్యమకారులు దీన్నొక సవాలుగా తీసుకున్నారు. హైదరాబాద్ మార్చ్‌ను విజయవంతం చేసి తీరుతామని కొన్ని రోజుల నుంచే భారీ ఎత్తున నగరానికి తరలి రావడం మొదలుపెట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం కదులుతున్నారు. దీంతో ప్రభుత్వానికి దగడు పుట్టింది. ఒకవైపు అరెస్టులూ బెదిరింపులు సాగిస్తూనే, మరోవైపు సంప్రదింపులకు దిగింది. చివరకు మార్చ్‌కు అనుమతి ఇస్తున్నామని ఓ మంత్రి ద్వారా ప్రకటించింది. ఉద్యమకారులు ప్రకటించిన విధంగా నెక్లెస్ రోడ్డు కాకుండా మరో చోట అనుమతి ఇస్తామని మొదట సూచించిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు అదే హుస్సేన్ సాగర్ వద్ద మానవ హారానికి అనుమతినిచ్చింది. ఇది ఆంధ్ర పాలకులు దయతలిచి లేదా ప్రజాస్వామిక స్ఫూర్తితో ఇచ్చిన అనుమతి కాదు. తెలంగాణ వాదులు తమ ఆత్మగౌరవంతో దృఢంగా నిలిచి సాధించిన విజయం. మార్చ్ మొదలుకాక ముందే తెలంగాణ వాదులు సాధించిన విజయమిది. 
                  తెలంగాణ ఉద్యమంలో ‘చలో హైదరాబాద్’ కార్యక్షికమం మొదటిది కాదు, చివరిదీ కాకపోవచ్చు. కానీ మొత్తం తెలంగాణ ఉద్యమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే అభ్యంతరకరంగా ఉన్నది. ముఖ్యమంత్రి మొదలుకొని జిల్లాల్లోని పోలీసుల వరకు వారం రోజులుగా తెలంగాణ ఉద్యమకారులను వెంటబడి వేధిస్తున్నరు. నిజానికి వారు చేసిన నేరం ఏమీ లేదు. మార్చ్ జరగనే లేదు. జనాలు పాల్గొననే లేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. కానీ ఇంకా జరగని మార్చ్‌లో నేరాలకు పాల్పడుతారంటూ అమాయకులను వేధించడం ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటుందా? ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని బదనాం చేయడానికి ఎంతకైనా దిగజారుతుందని ఈ మార్చ్ సందర్భంగా మరోసారి వెల్లడైంది.తెలంగాణ ఉద్యమకారులు సెటిలర్స్‌పై దాడులు చేస్తారని సమాచారం అందినట్టు ఒక పోలీసు అధికారి ఆరోపించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలె? తెలంగాణ జిల్లాలలోనే కాదు, హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా సీమాంధ్ర వాసులు చాలా తక్కువ మందే ఉంటారు. స్థానికులకు స్థానబలం ఉంటుంది. ఏదైనా వాడలో తక్కువ మంది ఉన్నా తమ ప్రాంతమనే ధీమా ఉంటుంది. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో సాగుతున్నప్పటికీ ఎక్కడైనా స్థానికేతరులపై దాడులు సాగాయా? మలిదశ తెలంగాణ ఉద్యమం పదేళ్ళకు పైగా సాగుతున్నది. అనేక చోట్ల సీమాంధ్ర ప్రజలు కదలకుండా అవే ఊళ్ళలో, తమ పనులు తాము చేసుకుంటున్నారు తప్ప భయవూభాంతులై వెళ్ళిపోయారా? ఎక్కడి నుంచో వచ్చిన తమను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం తెలంగాణ ప్రజల గొప్పతనమని సెటిలర్స్ స్వయంగా చెబుతున్నారు కదా! ప్రభుత్వం అణచివేతకు పాల్పడాలనుకుంటే, అందుకు సాకులు వెదకడంలో భాగంగా అనేక ఆరోపణలు చేస్తుందనేది తెలిసిందే. కానీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఇంత ఉద్రిక్త తరుణంలో ఇటువంటి బాధ్యతారహిత ఆరోపణలు చేయడం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వం చేసిన ఆరోపణల దుర్భుద్ధి పుట్టి ఎవరైనా ఉద్యమ వ్యతిరేకులు ఇటువంటి చర్యలకు పాల్పడితే రెండు వర్గాల మధ్య అనవసర విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అటువంటి తప్పుడు సమాచారం తమకు అందినా పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలె తప్ప బయటికి వెల్లడించకూడదు. 

              హైదరాబాద్ మార్చ్‌కు ప్రభుత్వం తప్పనిసరై అనుమతి ఇచ్చిందే తప్ప, ఉద్యమకారుల పట్ల ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామనే హామీ మాత్రం ఇవ్వలేదు. కొద్ది రోజులుగా ప్రభుత్వ వ్యవహార సరళి తెలంగాణ వారి మనసును తీవ్రంగా గాయపరిచింది. శాంతియుతంగా చేపట్టే ప్రతి ఉద్యమాన్ని ఆటంక పరుస్తున్నది. రెచ్చగొడుతున్నది. ఉద్యమకారుల గుండెల్లో మంట ఉన్నది. కానీ,వారి కళ్లల్లో తడి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంగతి కేంద్రం తేలుస్తుందని ముఖ్యమంత్రి పదేపదే అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కొంత జాప్యం జరిగితే జరగవచ్చు. కానీ ఆలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ఆధిపత్య వర్గాల కొమ్ముకాస్తూ తెలంగాణ వాదులను వేధించడం మాత్రం సమంజసంగా లేదు. ఉద్యమకారులను అదే పనిగా రెచ్చగొట్టడం వల్ల ఒక్కోసారి పరిస్థితులు అదుపు తప్పవచ్చు. గతంలో మిలియన్ మార్చ్ నాటి మాదిరిగా ఉద్యమ నాయకులను అరెస్టు చేసి, ఉద్యమకారులను రెచ్చగొట్టకుండా ప్రభుత్వం సహనంతో వ్యవహరించాలె.

No comments:

Post a Comment