Saturday, 27 October 2012

పల్లెపల్లెకు ఉద్యమం..


బస్సు యాత్రకు సిద్ధమవుతున్నగులాబీ శ్రేణులు
- ఉద్యమ సెగను పెంచాలని నిర్ణయం
- వ్యూహరచనలో కేసీఆర్
- రూట్‌మ్యాప్‌పై కొనసాగుతున్న కసరత్తులు 
హైదరాబాద్, అక్టోబర్ 26 (): ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేలా.. కేంద్రానికి ఉద్యమ సత్తా చూపాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. పల్లెపల్లెకు వెళ్లి క్షేత్రస్థాయి ఉద్యమాలకు ప్రజలను సమాయత్తం చేసేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులోభాగంగా తెలంగాణవ్యాప్తంగా బస్సు యాత్ర లు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలను కేంద్రీకృతం చేసుకొని అన్ని మండలాలు, ముఖ్య గ్రామాల్లో విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. యాత్ర కొనసాగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కరీంనగర్‌లో నవంబర్ 5, 6 తేదీల్లో పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గం, శాసనసభాపక్షం, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా.. కేంద్రంపై అన్ని దిక్కులనుంచి ఒత్తిడి తెస్తున్న టీఆర్‌ఎస్, క్షేత్ర స్థాయిలోనూ ఉద్యమ సెగను మరింత పెంచేలా కార్యక్షికమాలు రూపొందిస్తున్నది. మండల స్థాయి నుంచి కేడర్‌కు శిక్షణ కార్యక్షికమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. 
కేంద్రం కదలికలను బట్టి ఉద్యమం.. 
ఢిల్లీలో నెల రోజులుపాటు కాంగ్రెస్ అధిష్ఠానం దూతలతో కేసీఆర్ పలు దఫాలుగా చర్చలు జరిపారు. పలు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నందునే.. కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక నిర్ణయాలు వెలువడలేదని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ కదలికలను బట్టి ఉద్యమ పంథాను ఖరారు చేయాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో టీఆర్‌ఎస్ తన బలాన్ని మరింత చాటుకునేందుకు కరీంనగర్ సమావేశం అనంతరం భారీ ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు ఉంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
-టీ మీడియా

No comments:

Post a Comment