Wednesday 10 October 2012

ఉద్యమ కళా సందోహం సుద్దాల హనుమంతు

             సుద్దాల హనుమంతుగారిదొక ఉద్యమ కళా సాంస్కృతిక యుగం. ఆనాటి కాలంలో అతడొక ప్రజా కళా సంప్రదాయాల కేంద్రంగా నిలిచాడు. ఆ రంగంలో అతడే అని కాదు గానీ, అతనిదైన ఒక ముద్రను, అమోఘమైన ప్రభావాన్ని ఆ రంగం మీద అలవోకగా పడేస్తూ వచ్చాడు.1910కి అటు ఇటుగా గల సంవత్సరాల్లో ప్రపంచమంతటా ఆయా రంగాల్లో రాణించి తమతమ ప్రభావాన్ని పడవేసిన బుద్ధి జీవులు, కవులు, రచయితలు, కళాకారులు జన్మించి ఉన్నారు. పాబ్లోనెరుడా, ఫైజ్ అహ్మద్ ఫైజ్, అలీ సర్దార్ జాఫ్రీ మొదలుకొని ఇక్కడి ప్రాంతాలకు చెందిన శ్రీశ్రీ, మఖ్దూం వంటి వారు జన్మించి ఉన్నారు. 
               అదే వరుసలోనన్నట్టుగా మన సుద్దాల హనుమంతు కూడా 1910లో జన్మించడం గమనించదగ్గ విశేషం.పుట్టింది శ్రామిక వర్గంలో. రంగులు, దారాల ఆధారంగా నేత పనులు నేర్చుకునే క్రమంలోనే జీవితపుదారుల్ని ఒకదాని తరువాత ఒకటిగా ఎన్నుకుంటూ వచ్చాడు. రంగుల రాగాలను, మర్మాలను గుర్తెరిగినట్టుగా ప్రపంచమ్మీది దొంగల హంగులను, క్రౌర్యాలను త్వరలోనే పోల్చుకున్నాడు. వృత్తినే పట్టుకుని తిరగాడలేదు కానీ, మనుషుల ప్రవృత్తులను అంచనా వేసుకుంటూ వచ్చాడు. ఆయా తత్వాలను, భావజాలాలను అధ్యయనం చేశాడు. తొలుత ఆర్య సమాజ ఆలోచనలకు, ఉదార భావాలకు ఆకర్షితుడయ్యాడు. వర్ణాంతర వివాహాలను గౌరవించాడు. ఉచ్ఛ నీచాలుండేది వర్ణాల్లో కాదు వ్యక్తుల(కు) బుద్ధుల్లోనేనని తేల్చుకున్నాడు.
               పరతంత్య్రం నుంచి విముక్తి చెందేందుకని పూనిక వహిస్తున్న వీరుల వెంట తన ప్రయాణమనుకున్నాడు.సత్యాక్షిగహోద్యమాలనాటి ఆదర్శాలని గమనించాడు. ఇంకొంచెం ముందు చూపుతో పర పాలకులకన్నా పరమ క్రూరమైనవి రాచరిక వ్యవస్థలని అర్థం చేసుకున్నాడు. నిజాము నవాబులూ, వారి తాబేదార్లూ, జాగీర్‌దార్లూ, దేశముఖ్‌లూ, దొరలను మించిన దౌర్జన్యకారులను, రాక్షసులను మించిన అపర నరమాంసభక్షకులు ఉండరని తీర్మానించుకున్నాడు. దేశకాల పరిస్థితులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాల విహంగవీక్షణం చేశాడు. అందుకు ఆనాటి ఉద్యమకారుల, సామ్యవాదుల సావాసాలు తోడయ్యాయి. కష్టాలకు, క్రౌర్యాలకు కారణాలు తెలిసి వచ్చాయి.
                  కూడికలక్కడ, తీసివేతలిక్కడ ఎందుకో తేటతెల్లమవుతూ వచ్చాయి. రైతులు- భూమిలేని పేదలు గావించబడిన వైనం తెలియవచ్చింది. నిర్బంధాలు, ఆగడాలకు మూల కారణాలేమిటో గోచరించినై. సంఘం కార్యకలాపాలు తోడైనయి. సాహిత్యానికి దగ్గరయ్యాడు. పాటలల్లడం ప్రారంభించాడు. ఉద్యమ కార్యకర్తగా ఎదిగాడు. కళాకారుడిగా గొప్ప నేర్పును సాధించాడు. ప్రజా కవిగా, అగ్రక్షిశేణి గాయకుడిగా అవతరించాడు. చదివింది రెండో తరగతి వరకే అయినా ఆనతి కాలంలో (మనకందినంతవరకు) వందలాదిగా పాటలు రాయడమే కాదు, పద్యాలు అల్లగల శక్తియుక్తులను కూడా సముపార్జించుకున్నాడు సుద్దాల హనుమంతు. ఊహించినట్లుగానే ఉద్యమ యోధుడిగా తనను తాను మలుచుకొని అనే కళారూపాలను ప్రదర్శించాడు. గొల్ల సుద్దులను ప్రత్యేకంగా తీర్చిదిద్ది వాటికి విశేషాదరణను కల్పించాడు. 
                  ‘వీర తెలంగాణ’ యక్షగానాన్ని తనదైన బాణిలో అనితర సాధ్యంగా రూపొందించి ప్రదర్శనలిచ్చాడు. అతని పాటలకు, ప్రదర్శనలకు జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. సుద్దాల హనుమంతు గురించి అతని మిత్రులు, అనుయాయుల మాటల్లో చెప్పుకోవాలంటే ఆనాటి అనేక విషయాలను గూర్చిన అతని అధ్యయనం, అవగాహనలు గొప్పగా ఉండేవి. అవకాశం దొరికినప్పుడల్లా అతడు సమకాలీన పరిస్థితులు, పరిణామాల ను చర్చిస్తూ వచ్చేవాడు. ఆకలి దప్పులకన్నా అతని ఉద్యమ తీరు తెన్నుల మీద ధ్యాసే ఎక్కువగా ఉండేది. అనేక అంశాలనెప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ వచ్చేవాడు గనుక అర్థంవంతమూ, అవగాహనా పూరితమైన పాటల్ని ఎక్కడికి వెళితే అక్కడ పాడుతూ ప్రదర్శనలిస్తూ వచ్చేవాడు. అతని గాత్రం శ్రావ్యంగానూ జనరంజ కంగానూ ఉండేది. 
                    సుద్దాల హనుమంతు పాటలు అధిక శాతం ద్రోహులకు, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా రణభేరి మోగించినవే. ఇక్కడి ఉప్పు తిని, మదమెక్కిన ఆనాటి నిజాం తొత్తు లైన రజాకార్లనే మత పిచ్చివాదుల దారుణాల్ని దనుమాడినవి ఆయన పాటలు. ఊళ్ల నిండా పోలీస్ క్యాంపులను దింపి వేలాదిగా ప్రజలను జైళ్లల్లో నింపి గోళ్లలో సూదులు గుచ్చిన పైశాచికత్వాన్ని ప్రశ్నించినవి. ప్రజల కాళ్లు, చేతుల్ని కట్టి, మంట మండే గడ్డివాముల్లో పడేసిన యమకింకరుల బాధల్ని ఏకరువు పెట్టినవే.
                 ‘నిజామెవడురా? వాడి తొత్తుల లెక్కేందిరా?’ అని ఎదిరించి నిలిచినవే. నిజాం సర్కారు దారుణాలను ఒక్కటొక్కటిగా మక్కపుట్ట గింజలు వొలిచి చూపినట్లుగా చూపినవే. ‘సాధించి తీరుతాం ప్రజా ప్రభుత్వాన్ని’- అని భరోసా ఇచ్చినవే. ధనికుల దౌర్జన్యా లను ఎదిరించి నిలువమని ధైర్య సాహసాలను రంగరించి పోసినవే. శ్రామిక శక్తే అజేయమైనదని, ‘దెబ్బకు దెబ్బ’ వేసి నిలవాలని పిలుపునిచ్చినవే, చరివూతను మలు పు తిప్పినవే సుద్దాల పాటలు.రైతులను రామ బాణాలుగా గుర్తిస్తూ, రాజ్యమన్నది రైతు కోసమేనని వివరిస్తూ, తమ అధికారాన్ని తమ వశం చేసుకొమ్మని హితోపదేశించినవే సుద్దాల పాటలు. వెట్టి చాకిరీని నిర్మూలించాలని ప్రకటించాయి. అమరవీరులకు జోహర్లర్పిస్తూ వచ్చినవి. ‘‘పల్లె ప్రజలకు ప్రజలే దొరలైతే ఎవడిదో దొర తనమేమిట’’ని ఎదిరించి నిలిచేందుకు జాగేమిటని జాగృత పరుస్తూ వచ్చాడు హన్మంతు.
                 ‘ఎన్నాళ్లని సహించేది కష్టకాల’మని హెచ్చరిక చేస్తూ, రామరాజ్యమంటే ‘క్షామంతో అలమటించడమేనా?’ అని నిలదీస్తూ ఉరుమురిమి ఉద్యమించమని పిలుపునిచ్చినవి అతని పాట లు. అడుగడుగునా సాహసాన్ని నూరి పోసినవి. భయం గియం విడిచి, జయం ప్రజలదని తలిచి, ఎదురించుట పరిష్కారమని చెప్పినవి ఆయన పాటలు.జీవితమంతా ఉద్యమబాటై, సాంస్కృతిక కెరటమై ఎగసినవాడే సుద్దాల హనుమంతు. నమ్మిన సిద్ధాంతానికి ఆసాంతం కట్టుబడి ఉన్నాడు. ఎల్లప్పుడూ అతనిలో ని ఎర్ర రక్తకణాలను కాపాడుకుంటూనే తాజాగా ఉంచుకుంటూనే వచ్చాడు. పాటకు విరామం లేకుండా గాయకుడిగా ఇసుమంతైనా అలసిపోకుండా, ఆడుతూ, పాడు తూ అలరిస్తూ, ఆలోచింపచేస్తూ వచ్చాడు. 
                 తెలంగాణ సాయుధ పోరాటం - సుద్దాల హనుమంతు వంటి జీవితాలు వాస్తవానికి వేరువేరు కాదు. తీరాన్ని వొరిసి పారే నీరులాగా తెలంగాణ ఉద్యమపాటై కళా ప్రదర్శనయై జనం మధ్య ప్రవహించిన వాడే సుద్దాల. ఇటు భూస్వాములు, అటు వీరిని తలదన్నే నిజాం ప్రభువుల నరకపు పాలనా యుగాల్ని చీల్చి చెండాడు తూ వచ్చాడతను. దారుణమైన అర్ధబానిస వ్యవస్థను ఎండగడుతూ, వెట్టి చాకిరీని తుదముట్టించేందుకు ప్రజావళిని సమాయత్తం చేశాడు. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సంస్థల ఉమ్మడి వేదికగా ‘ఆంధ్ర మహాసభ’ (భువనగిరి)లో వాలంటీరు గా పాల్గొన్నది మొదలు ఇక ఏనాడూ వెనక్కి తగ్గింది లేదు. పోరు మార్గాన్ని విడిచింది లేదు. నిజాంతో ఇక్కడి భూస్వాములు, దేశముఖ్‌లు, జాగీర్‌దార్లు కుమ్మ క్కై ప్రజల మీద దాష్టీకం సాగించిన తీరు తెన్నులను ఏకి పారేశాడు. లక్షలాది మంది ప్రజల తిరుగుబాటుకూ తన వంతు చైతన్యాన్ని అంకితం గావించాడు హనుమంతు. 
                 ‘బాంచన్ దొర కాల్మొక్త’ అన్నటువంటి సగటు తెలంగాణ రైతే గుత్పల తిరుగుబాటుకు లంకించుకునే సాహసానికి అంకురార్పణ గావించిన వాడయ్యాడు. కడగండ్లు , కన్నీళ్లతో వేసారి జీవచ్ఛవాలౌతున్న వారే తరువాతి కాలంలో కళా సాంసృ్కతిక మ హోజ్వల చైతన్యాన్ని సొంతం చేసుకునేట్టుగా ఆత్మవిశ్వాసాన్ని నూరి పోశాడు. ధైర్య సాహసాలకు దీటైన దర్పణాలుగా తన రచనలు ప్రతిబింబింపజేశాడు. బానిసలకన్నా హీనంగా చూడబడుతున్న నిరుపేదలకు ఎర్రెపూరని కొత్త రక్తాన్ని ఎక్కించి తిరుగుబాటుకు బీజాలు వేశాడు. అతని గొంతుతో అత్యద్భుతంగా ప్రజల గొంతు కలిసి పాడింది. ద్రోహులు, క్రూరులను తరిమికొట్టగా కదలాడి ఈ కళాకారుడు చివరి దాకా పెన్నునూ, గన్నునూ పట్టుకున్న యోధుడయ్యాడు. 
        సుద్దాల హనుమంతు కొన్ని పాటలనైనా ఉదహరించబోయినప్పుడు ‘తెలుగు వీరులు బాలచంద్రులై లేవాలి/ మగువలందరు రుద్రమాంబలై కదలాలి’ అంటూ ‘రణభేరి మ్రోగింది’తో పిలుపు ఇస్తాడు. ‘ఈ నిజాం ఎవడురా?’ అనే పాటలో-‘ఐకమత్యమే బలం/ అందినదే ఆయుధం/చేకొని వేగమే నైజాం/నీచుల పరిమార్పురా’’ అని బాహటంగా కర్తవ్యబోధ చేశాడు.ఆ కాలపు లక్ష్యమేమిటో తేట తెల్లం చేస్తూ ‘ప్రజా ప్రభుత్వం సాధిస్తాం’ అనే గేయంతో ‘.. ఎర్రజెండనీడలో/ ప్రజా రాజ్య స్థాపన చేద్దాం’ అని నినదించినాడు. ‘లక్షలాది బీద ప్రజల పక్షముండరెందుకోయి (ఓ ధనికులారా)’ అని ప్రశ్నిస్తూ ‘లుచ్చాలగుట మానరోయ్’ అని హెచ్చరిక చేశాడు. 
                        ‘పొదుపు పేర జరుగుతున్న/ అదుపులేని దుబారా/అదను ఇదేనని మంత్రుల ఆడంబర జీవితాలు’ అంటూ ‘ఇదే రామ రాజ్యమా’ అనే పాటలో ఆనాడే మంత్రుల తీరును ఎండగట్టాడు. ‘దొరలు- భూస్వాములు’ అనే రచనలో అన్నం పెట్టే రైతుల పాలిటి ఆక్రందనలను వినిపిస్తూ ‘బక్కెడ్ల దరుముచు రైతన్నా దున్నే/దుక్కిడిచి పొమ్మనిరి కూలన్న’ అంటూ ఆక్రోశించినాడు. ద్రోహుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ‘అధికారం నేడే మీరిస్తే/అవినీతికి వారొస్తారండీ’ అంటూ ‘జాగరతోయ్ జాగరత’ అనే పాటలతో కుహకుల నైజాన్ని బయటపెట్టాడు. ‘ఎన్నాళ్లీ కష్టకాలం’ అనే పాటలో రైతు క్షేమమే దేశ క్షేమము/ రైతు లేని దేశమే క్షామము/రైతు దేశమునకు వెన్నెముకరా/ రైతు దేశమున కన్నదాతరా’ అంటూ వినవూమంగా రైతన్నకు కైమోడ్పు చేసినాడు. ‘ఆకలి మంటలు’లో అనంతమైన ఆత్మవిశ్వాసాన్ని చాటుతూ ‘నిరు పేదలదే తుది విజయం’ అని ప్రకటించినప్పుడు మనం లక్ష ఏనుగుల బలాన్ని సొంతం చేసుకున్నంత అనుభూతి చెందుతాం.కేన్సరు వంటి ప్రాణహంతక వ్యాధితో తనకు గల బాధను ఆమరణాంతం పంటి కింద అదిమి పట్టినాడే కానీ, ఏనాడూ కలత చెందలేదు. విషయం బయటికి పొక్కనీయలేదు. సానుభూతి వంటి వాటిని ససేమిరా దరి చేరనీయలేదు. 
                    ‘పేదల కోసం మమేకమైన కృషిలోనే తుది శ్వాస విడువగలగడం కూడా ఆదర్శమ’ని నిరూపించా డు. ఆట-పాటలకు, సృజన సౌశీల్యాలకు ఒక చిరునామా అయ్యాడు. కళా సాధకులకు ఎన్నటికీ మరణం లేదని నిరూపించాడు. ఉద్యమమున్న ప్రతి చోటా అతడున్నాడు. ప్రజల మధ్య, ప్రజా స్పందనలతో మమేకమౌతూ, ఎక్కడో ఒక మూలన కూర్చొని, ఆయా కళా ప్రదర్శనలను వీక్షిస్తూ, కళాకారులను ప్రోత్సహించాడు. మంచితో కరచాలనం చేస్తూ, మరొకింత స్ఫూర్తిని కూడా ప్రోది చేస్తూ వచ్చాడు. నేటికీ ఆయన ‘పాలబుగ్గల పసివాడు’గా చప్పట్లు చరుస్తూనే ఉన్నాడు. అమాయకపు గొర్రె పిల్లలను అదిలిస్తూ, ఆప్యాయపూరిత చైతన్యమంత్రం నూరి పోస్తూనే ఉన్నాడు. కనిపించని పిల్లనగ్రోవిని వినిపిస్తూనే ఉన్నాడు. 
-వేణు సంకోజు

No comments:

Post a Comment