Wednesday, 17 October 2012

తెలంగాణ కలాల వెలి..


బ్లాక్‌లిస్టులో నమస్తే తెలంగాణ.. టీన్యూస్, వీ6, హెచ్‌ఎంటీవీ, మున్సిఫ్ చానళ్లు 
ప్రధాని సమావేశం కవరేజికి నిరాకరణ
తెలంగాణ మీడియా కావటమే కారణం
-  జీవ వైవిధ్య సదస్సులో ప్రాంతీయ పక్ష‘వాతం’
-  ప్రాంగణంలోనే బైఠాయించిన జర్నలిస్టులు
-  జాతీయ, అంతర్జాతీయ మీడియా సంఘీభావం
-  పాత్రికేయుల అరెస్టు.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు
-  సచివాలయం సీ బ్లాక్ వద్ద జర్నలిస్టుల ధర్నా
-  బలవంతంగా ఈడ్చేసిన పోలీసులు
-  స్టేషన్ వద్దే రాత్రి వరకూ ధర్నా
-   సంఘీభావం తెలిపిన పార్టీల నేతలు
-  ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ప్రదర్శన
         ఘనమైనదిగా చెప్పుకునే ప్రజాస్వామ్య దేశంలో.. పత్రికాస్వామ్యానికిది బ్లాక్‌డే! కలాలు వెలికి గురైన రోజు! పరిపాలన యంత్రాంగం.. చట్టసభలు.. న్యాయ వ్యవస్థ తర్వాత ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్న మీడియా వ్యవస్థకు ఘోర అవమానం ఎదురైన రోజు! అందునా ఒక ప్రాంతంపై గుడ్డి వివక్ష ధోరణి.. పైత్యం పరాకాష్టకు చేరుకున్న వైపరీత్యం! సొంత గడ్డపై జరిగిన అంతర్జాతీయ కార్యక్షికమాన్ని కవర్ చేసేందుకు స్థానిక మీడియాకు ప్రాంతీయత కారణంగా ఎదురైన అవాంతరం! ఆ మీడియా తెలంగాణవాదాన్ని వినిపించటమే దోషమైంది! తెలంగాణలోని కష్టాలను అక్షరీకరిస్తుండటం.. ప్రజల కన్నీళ్లను సమాజానికి చూపించటం సర్కారుకు నేరంగా కనిపించింది! నాలుగు కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటేందుకు వెరవని వారి సాహసం ప్రభుత్వాన్ని భయపెట్టింది! ఫలితం.. ప్రధాని పాల్గొన్న జీవ వైవిధ్య సదస్సులో వార్తల సేకరణకు తెలంగాణ ప్రాంత మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరణ! పదహారు రోజులుగా లేనిది కొత్తగా పుట్టుకొచ్చిన అభ్యంతరం! అదేమని అడిగితే అరెస్టులు.. అరెస్టును నిరసిస్తే విరిగిన లాఠీలు! ఇదేం పద్ధతని ప్రశ్నిస్తే.. మాకు సీమాంధ్ర మీడియా చాలనే విధంగా జవాబులు.. సర్కారు శాసించింది.. పోలీసు యంత్రాంగం పాటించింది! ప్రధాని కార్యక్షికమం జరిగే హెచ్‌ఐసీసీలో ప్రవేశానికి జారీ చేసిన పాసుల జాబితాలో నమస్తే తెలంగాణ దినపవూతికతో పాటు.. వీ6, టీ న్యూస్, హెచ్‌ఎంటీవీ, మున్సిఫ్ చానళ్లను బ్లాక్‌లిస్టులో పెట్టారు. కార్యక్షికమం కవర్ చేయకుండా అడ్డుకున్నారు. ప్రధాని కార్యక్షికమం కోసం మిగతా మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. కానీ.. తెలంగాణ మీడియాగా ప్రజాదరణ పొందిన నమస్తే తెలంగాణ పత్రిక, వీ6, టీ న్యూస్, హెచ్‌ఎంటీవీ, మున్సిఫ్ చానళ్ల ప్రతినిధులకు మాత్రం పాసులు ఇచ్చేది లేదని అధికారులు మొండిచెయ్యి చూపించారు. ప్రత్యేక పాసులు ఉంటే తప్ప తాము ప్రధాని సమావేశం హాలులోకి అనుమతించబోమని సదస్సు ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు చూస్తున్న ఐక్యరాజ్యసమితి అధికారులు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ ప్రాంత మీడియా ప్రతినిధులు నిర్వాహకుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వృత్తి ధర్మంలో భాగంగానే సమావేశాన్ని కవర్ చేయటానికి వచ్చామని, గడిచిన పదహారు రోజులుగా లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని నిర్వాహకులను నిలదీశారు.
           దాంతో వారు డీజీపీ దినేష్‌డ్డి సూచనల మేరకే తాము కొన్ని మీడియా(తెలంగాణ ప్రాంత) సంస్థలకు పాస్‌లు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. విషయం స్పష్టం అవ్వడంతో నిర్వాహకులు, పోలీసుల తీరుకు నిరసనగా నమస్తే తెలంగాణ దినపవూతిక, వీ6, టీ న్యూస్, హెచ్‌ఎంటీవీ, మున్సిఫ్ చానళ్ళకు చెందిన జర్నలిస్టులు జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలోని మీడియా హాల్(నెం.3) ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎన్నడూలేని విధంగా మీడియా ప్రతినిధులు ఆరుబయట నేలపై మౌనంగా కూర్చోవడాన్ని గమనించిన మిగతా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఏం జరిగిందని అరాతీశారు. విషయం తెలుసుకుని, వారు సైతం నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రాంత మీడియా ప్రతినిధులకు సంఘీభావం తెలియజేశారు. మీడియా హాల్ ముందు పాత్రికేయులు, కెమెరామెన్లు యాభై మందికిపైగా గుమికూడడంతో విధినిర్వహణలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా మీడియా హాలు ముందుకు వచ్చారు. జర్నలిస్టులు నిరసన వ్యక్తంచేస్తున్న విషయాన్ని పోలీసులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో ఐపీఎస్ స్థాయి అధికారులు వచ్చి విషయం తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొన్ని మీడియా సంస్థలకు పాస్‌లు నిరాకరించిన విషయాన్ని సైబరాబాద్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే అప్పటికే ప్రధానమంత్రి వచ్చే సమయం ఆసన్నం కావడంతో మీడియా ప్రతినిధుల కదలికలపై పోలీసులు డేగకన్నువేశారు. అంతలో రక్షణశాఖకు చెందిన హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి వచ్చిన ప్రధాని.. నేరుగా సభా ప్రాంగణంలోకి వెళ్ళిపోయారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణం నుంచి ప్రధాన మంత్రి వెళ్ళిపోయేంత వరకు మీడియా ప్రతినిధులు తమ నిరసనను కొనసాగించారు. తెలంగాణ మీడియాను బ్లాక్‌లిస్టులో పెట్టారనే విషయం కొద్ది క్షణాల్లోనే బాహ్యవూపపంచానికి తెలియజేయడంతో యావత్ తెలంగాణ మండిపడింది. ప్రభుత్వ చర్యలపై జర్నలిస్టులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్షికమాలు నిర్వహించారు. సీమాంధ్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుల చర్యలను తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. దీనికి కారకులైన పోలీసులు వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని, జరిగిన సంఘటనపై సీఎం, డీజీపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు డిమాండ్ చేశారు.
సచివాలయం సీ బ్లాక్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
                  ప్రధాని పర్యటన కవరేజ్‌కు వెళ్లిన తెలంగాణ జర్నలిస్టులను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట పాత్రికేయులు ధర్నా చేశారు. మీడియాను ప్రభుత్వం కావాలనే రెండుగా విడదీయడంపై మండిపడ్డారు. ధర్నా చేస్తున్న టీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు కొద్దిసేపు పెనుగులాట జరిగింది. జర్నలిస్టులను పోలీసులు తోసేశారు. లాకెళ్లి జీపులో పడేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఫోరం జర్నలిస్టు నాయకులు క్రాంతి, పీవీ శ్రీనివాస్, రమేష్ హజారె, సతీష్, కెమెరామెన్ అసోసియేషన్ ప్రతినిధి ప్రకాష్ తదితరులను అరెస్టు చేశారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ జర్నలిస్టులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులకు ప్రాంతీయభేదాన్ని అంటగట్టి కవరేజీకి తిరస్కరించడం పత్రికా రంగానికి బ్లాక్ డే అని జర్నలిస్టులు అభివర్ణించారు. ప్రభుత్వం సీమాంధ్ర పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నదని తేలిపోయిందని జర్నలిస్టు నేతలు ఆరోపించారు. ఇందుకు సీఎం, డీజీపీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మన్మోహన్‌సింగ్ కవరేజీని తిరస్కరించడం చరివూతలోనే తొలిసారన్నారు. ఎమ్జన్సీలో కూడా ఇంత ఘోరం జరగలేదని దుయ్యబట్టారు. పత్రికా హక్కులను కాలరాసే హక్కు ఎవ్వరికీ లేదని, కానీ రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తమ కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కొన్ని చానళ్లను మాత్రమే కార్యక్షికమానికి అనుమతించడం, మిగిలిన చానళ్లను తిరస్కరించడం ద్వారా రాష్ట్ర చరివూతలో కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వానికి ఓ అరుదైన ఘనత దక్కిందన్నారు. మీడియా రంగాన్ని కూడా విభజించి పాలించాలని చూస్తున్న సీమాంధ్ర పెత్తందార్లకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని జర్నలిస్టు నేతలు మండిపడ్డారు.జర్నలిస్టులకు మద్దతుగా ట్యాంక్ బండ్‌పై కొవ్వొత్తులతో ప్రదర్శన జరిగింది.
నేతల సంఘీభావం
              వివక్షను ప్రశ్నించి అరెస్టయిన తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు పార్టీలకతీతంగా సంఘీభావం వ్యక్తమైంది. వివిధ పార్టీల నేతలు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాల నాయకులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పాత్రికేయుల వృత్తిధర్మాన్ని అడ్డుకున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. పాత్రికేయులకు అనుమతి నిరాకరణ, వారిపై దాడికి నైతిక బాధ్యత వహించి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత జర్నలిస్టులపై వివక్షకు నిరసనగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. రాత్రి పది గంటలకు ధర్నాను విరమిస్తున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం కార్యదర్శి క్రాంతి ప్రకటించారు.

No comments:

Post a Comment