Monday, 29 October 2012

ఆదివాసీల ఆరాధ్య దైవానికి ఏదీ నివాళి?



అక్టోబర్ 29 కొమురం భీం 72వ వర్ధంతి
- ఇంకా నెరవేరని ఆశయాలు
- ‘జల్.. జంగల్.. జమీన్’ దక్కని అడవిబిడ్డలు
-  కనీస హక్కులను కాలరాస్తున్న పాలకులు
- సమస్యల వలయంలో గిరిజన ప్రాంతాలు
- విజృంభిస్తున్న వ్యాధులు
- రక్తహీనతకు బలవుతున్న ఆదివాసీలు
- రోడ్లు లేవు.. తాగేందుకు నీరూ దిక్కు లేదు
- వీరుడి జిల్లా ఆదిలాబాద్‌లో ఇదీ దుస్థితి..! 
                   1940కి ముందు..! జోడేఘాట్ ప్రాంతం..! జంగ్లాతోళ్లు, మైదానపు తోడేళ్ల కబంధహస్తాల్లో విలవిలలాడిపోతున్న సమయం. అమాయక గిరిపుత్రుల జీవితాలు ఛిద్రమవుతున్న పాశవిక కాలం. ఒక వీరుడు.. జంగు సైరన్ ఊదాడు. ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో అరాచక శక్తులకు ఎదురునిలిచాడు. నిజాం సర్కారుకు ధిక్కార స్వరం వినిపించాడు. ఆ వీరుడు.. కొమురం భీం. ఆదివాసీల ఆరాధ్య దైవం..! అక్టోబర్ 29న కొమురం భీం 72వ వర్ధంతి. ఆనాడు వేటి కోసమైతే భీం పోరాటం సాగించాడో.. నేటికీ ఆదివాసీలు వాటికోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు దాపురించాయి. కొమురం భీం త్యాగం అప్పటి నిజాం సర్కారును కదిలించినా.. ఇప్పటి ప్రభుత్వాలు మాత్రం అడవిబిడ్డలను కనికరించడం లేదు. సమస్యల వలయంలో ఆదివాసీలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తిండిలేక అలమటిస్తున్నారు. రోగాలతో మంచంపడుతున్నారు. గూడెం నుంచి మరో గూడెంకు వెళ్లేందుకు రోడ్డు కూడా దిక్కులేని ప్రాంతాలు కొమురం భీం పుట్టినిల్లు ఆదిలాబాద్ జిల్లాలో అనేకం..! తాగేందుకు నీటి సౌలత్ లేని గిరిజనవాసాలకు లెక్కేలేదు..!           
     గిరిపుత్రుల హక్కుల కోసం ప్రాణాలొదిలిన యోధుడు కొమురం భీం. 1865లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టం తీసుకురావటంతో ఆదివాసీలు ఆస్తిగా ఉన్న అడవులు ప్రభుత్వ ఆస్తిగా మారిపోయాయి. పోడు వ్యవసాయం చేయాలన్నా.. అటవీ ఉత్పత్తులు సేకరించాలన్నా.. ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. గిరిజనుల గూడేల మీద పడి జంగ్లాతోళ్లు పీక్కుతినేవారు. అది కావాలి.. ఇది కావాలి.. అని హింసించేవారు. గిరిపుత్రుల ఆపతికి చలించిపోయిన కొమురం భీం.. పోరుకు సిద్ధమయ్యాడు. నీరు, అడవి, భూమిపై హక్కులు అడవిబిడ్డలకు దక్కాలని.. ‘జల్.. జంగల్.. జమీన్..’ నినాదంతో ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ కేంద్రంగా సమరం సాగించాడు. అది ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం కాలేదు.. అటవీ పుత్రులున్న ప్రతి చోటికి పాకింది. నిజాం పాలకులను కదిలించింది. అరాచక మూకల పనిపట్టింది. కానీ, అదే వీరుడి వారసులు ఇంకా సమస్యల వలయంలోనే చితికిపోతున్నారు. ఆదివాసీల హక్కుల కోసం 1940 సెప్టెంబర్ 1న కొమురం భీం ప్రాణాలొదిలినా.. గిరిపుత్రుల లెక్కల ప్రకారం ఆయన చనిపోయి అక్టోబర్ 29కి 72ఏళ్లు. ఈ సందర్భంగా జోడేఘాట్‌లో అధికారికంగా వర్ధంతి సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
నేటికీ తీరని కష్టాలు 
       ఆదివాసీలకు- అడవులకు మధ్య సంబంధం అతిపురాతనమైనది. తరతరాలుగా ప్రకృతిలో భాగంగా ఉన్న ఆదివాసీలు అడవితో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరమైన సంబంధాలను ఏర్పరుచుకున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివాసీల షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి.ఆదిలాబాద్ జిల్లాలో 412 షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. అడవులపై ఉన్న ఆదివాసీల హక్కులు ప్రభుత్వ విధానాల కారణంగా రాయితీలుగా మారిపోయాయి. అటవీ హక్కుల చట్టంతో ఆదివాసీలకు ఒరిగిందేమీలేదు. అడవిలోనే పుట్టి పెరిగిన ఆదివాసీలకు అడవులపై అన్ని హక్కులు ఉండాలి. అడవులను ప్రభుత్వ ఆస్తిగా మార్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు-అడవులకు మధ్య ఆంక్షలను విధిస్తూ ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నాలుచేస్తున్నాయి. ఆదివాసీ అడవిలో పోడు చేసుకోవటం అనాధిగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల 50 వేల ఎకరాల పైచిలుకు అటవీ భూముల్లో ఆదివాసీలు పోడు చేస్తున్నారు. అడవులకు ఆదివాసీలకు మధ్య అడ్డుకట్ట వేసేందుకే అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. హక్కు పత్రాల పేరుతో సుమారు 35 వేల 935 మంది ఆదివాసీలకు కాగితాలను సర్కారు అందించింది. దీని వల్ల ఆదివాసీలకు ఒరిగింది శూన్యమే.. పంట రుణాలు, రాయితీ విత్తనాలకు కూడా ఈ హక్కు పత్రాలు పనికి రావటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్, కొలాంగూడ, శివగూడ, పట్నాపూర్, బాబేఝరి, మహరాజ్‌గూడ, లైన్‌గూడ, చాల్‌బరిడి, కోపుగూడలాంటి పన్నెండు గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు. పైగ్రామాలకు కనీసం రోడ్డు కూడా లేదు. మండల కేంద్రమైన కెరమెరికి వారు రావాలంటే 21 కిలోమీటర్లు కాలిబాటే శరణ్యం. జోడేఘాట్ ప్రాంత గ్రామాలైన పాతగూడ, కోపుగూడ, లైన్‌గూడ తదితర గ్రామాల్లో 51 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా సక్రమంగా లేదు. భూమి సమస్య పరిష్కారం కాలేదు. 1/70 యాక్ట్‌ను ప్రభుత్వం అమలుచేయక దానిని ఒక పరిహాసంగా, ప్రహసనంగా మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ యాక్ట్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూములు ఎవరికి విక్రయించరాదు. వాటిని ఎవరూ కొనడానికి వీలులేదు. కానీ అమ్ముకుంటున్నారు.. కొనేస్తున్నారు. ప్రభుత్వమే దీనికి ముందు నిలబడి ఆ భూములను స్వాధీనం చేయించి మరీ ధారాదత్తం చేస్తున్నది. దీనికి ఉదాహరణగా తిర్యాణి, తాండూరు లాంటి మండలాలను తీసుకోవచ్చు. 
రోగాల కుంపటి 
    పౌష్ఠికాహార లోపంతోనే రక్తహీనత వస్తుంది. రక్తం తగ్గడానికి ప్రధానకారణం ఆకలికి తగిన తిండి ఉండకపోవడం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు రక్తహీనత, డయేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. తిండిలేక అలమటిస్తున్నారు. రక్తహీనతతో ఈ సంవత్సరం ఆగస్టు నెలలోనే మొత్తం జిల్లాలో 48 మంది చనిపోయారు. కెరమెరి మండలం సకరాంగూడ గ్రామానికి చెందిన గనలపాడు నాగిని(28) అనే మహిళ ఇంటి వద్ద ప్రసవం అనంతరం ఆస్పవూతికి తీసుకురాగానే మరణించింది... ఆమెకు 5.5 గ్రాముల రక్తం ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రక్తహీనతే ఆమెను చంపేసిందని తేల్చారు. జిల్లాలో ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ తరఫున వైద్యులు కొన్ని గిరిజన గ్రామాల్లో 3000 మందికి రక్తపరీక్ష జరిపితే అందులో 1300 మందికి రక్తహీనత ఉన్నట్లు, అది కూడా కనీసం 11 నుంచి 13 గ్రాములుండాల్సిన రక్తం.. 4 నుంచి 7 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తేల్చారు. ప్రభుత్వం పౌష్టికాహార పంపిణీకి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కనీసం గర్భిణులకు కూడా అది అందడం లేదు. ప్రతిసారీ మరణాలు సంభవించినప్పుడల్లా అవన్నీ సహజమరణాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటిస్తూ పోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో పర్యటించినప్పుడు పౌష్ఠికాహార లోపంతోనే మరణాలు సంభవిస్తున్నాయని, అన్ని ఆకలిచావుల కిందనే లెక్కగడుతున్నామన్నట్లు స్పష్టం చేశాయి. చివరికి శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సైతం ఉట్నూర్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ చావులు సంభవించడానికి తమకు ప్రధానంగా ఆకలి మంటలే కారణమని, తెలంగాణ వస్తేనే తమ ఆకలి మంటలు తీరి తమ బతుకులు బాగుపడుతాయని బహిరంగంగా పలు కుటుంబాలు ముందుకు వచ్చి చెప్పాయి.పేరుకే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పాలకులు.. ఆ వీరుడి వారసుల హక్కులను రక్షించలేకపోతున్నారు. గిరిపువూతుల సమస్యలు పరిష్కారమైనప్పుడే ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీంకు నిజమైన నివాళి.
                                                                                         -టీ మీడియా

No comments:

Post a Comment