Saturday, 6 October 2012

సదాశివ యాది

sadasivayadi
   నేనప్పుడు అదిలాబాద్‌లో టి.టి.సి. చదువుతున్నాను. 8వ తరగతి నుండే పద్యాలు రాస్తున్న నేను అప్పటికే వివిధ సాహిత్య పత్రికలకు నా పద్యాలు పంపుతుండే వాడిని. వాళ్లు ప్రచురిస్తూ ఉండేవాళ్లు. ఆ మధ్యనే ‘సాహితీ కౌముది’ అనే పత్రికలో నేను అనువదించి పంపిన కబీరు దోహాలు వచ్చాయి. వాటిని ఎప్పటి నుంచో సదాశివ మాస్టారుకు చూపిద్దామని అనుకుంటూ వుండగానే కొన్ని నెలలు గడిచాయి. నా అదృష్టం కొద్ది ఒకనాటి సాయంత్రం నిర్మల్ నుంచి వచ్చిన మడిపల్లి భద్రయ్య గారు ‘‘సదాశివ మాస్టారు దగ్గరికెళ్దాం! పద’’ అంటూ అడక్కుండానే నాదగ్గరికి వచ్చి వరమిచ్చారు. సంతోషంతో, ఒకింత భయంతో వారితో పాటు వెళ్లాను. పత్రికను తీసుకు సాహసం చేయలేకపోయాను. మేం వెళ్లేసరికే అక్కడ కళాక్షిశమం రవీంవూదశర్మ గురూజీ కూడా వున్నారు. సాహిత్యం మీదనో, సంగీతం మీదనో గంభీరమైన చర్చ నడుస్తూ ఉంది. మధ్యలో అంతరాయం కలిగించిన దురదృష్టం మాది. భద్రయ్యగారు నన్ను ఇద్దరికీ పరిచయం చేశారు. నా గురించి అంతకు ముందే విని వుండడం వల్ల మాస్టారు తొందరగానే పోల్చుకున్నారు. అదే వారి మొదటి దర్శనం. ఆ చూపులో ఆత్మీయత, ఆ కళ్లల్లో ప్రేమ, మాటల్లో మానవత్వం. తొలి పరిచయంలోనే మాస్టారు మీద ఎనలేని గౌరవం ఏర్పడింది. తర్వాత దాదాపు రెండు గంటల దాకా వారు ఏవేవో విషయాల మీద విస్తృతంగా మాట్లాడుకున్నారు. 
                  నేనూ, మడిపల్లి భద్రయ్య గారితో పాటే వెళ్లే ప్రయత్నంలో వుండగానే ‘‘అప్పుడప్పుడు కలువు బాబూ!’’ అన్న మాస్టారు పలుకులు వినగానే నా రెండవ దర్శనాన్ని ఖరారు చేసుకున్నాను. ఒక వారం రోజుల తర్వాత అనువాద పద్యాలు వచ్చిన పత్రికను వారి చేతిలో పెట్టాను. అప్పటికీ సాహిత్యంలో ముఖ్యంగా అనువాద పక్రియలో వారి సమగ్ర మూర్తిమత్వాన్ని నేను తెలుసుకోకపోవడం వల్ల నాలో ఎలాంటి గుబులు అప్పుడు కలుగ లేదు. వారు పద్యాలు చదివి చిరునవ్వుతో ఆమోదం తెలపటం నేనేప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. అనువాదం గురించి, పద్యాల గురించి వారు కేవలం నా ఒక్కని కోసమే 60 నిమిషాల కాలాన్ని ఖర్చు చేయడం వారి గొప్పతనమూ, నా అదృష్టమూ. ఆ రోజే సురవరం ప్రతాపడ్డి తనను ‘పద్యాలు రాయటం మానుకొమ్మన్నాడనీ, ఒకవేళ పద్యం రాస్తే ఉత్పల సత్యనారాయణలా, వేముగంటి నరసింహాచార్యలా, బేతవోలు రామవూబహ్మంలా రాయాలని, ఆ రకమైన సాధన చేయాలని’ విలువైన సూచన చేశారు. అది నన్ను నేను నిర్మించుకోవడానికి చాలా దోహదం చేసింది.ఆ తర్వాత ఎన్నోసార్లు ఆయన్ని కలిశాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వారిప్పుడు లేరు. వారితో గడిపిన ‘యాది’ మాత్రం ఉన్నది. వారిచ్చిన ‘యాది’ కూడా వుంది. వారిచ్చిన సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లటమే వారికి మనమిచ్చే నివాళి.                
                                                                       
- తోకల రాజేశం

No comments:

Post a Comment