పురానామాల్ సమాధి
నాల్గవ నిజాం నవాబ్ మీర్ నాసిర్ ఉద్-దౌలా పాలనలో ‘సేత్ పురానామాల్ గెనేరీవాలా’ అనే మార్వాడీ వ్యాపారి అనేక దానధర్మాలు చేయడంతో పాటు దేవాలయాలు కూడా నిర్మించినట్లు చెబుతారు. ఆయన మరణానంతరం నగరంలోని ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో 1800 సంవత్సరం మధ్యకాలంలో ఆయన, ఆయన కుమారుడు ప్రేమ్‌సుఖ్ దాస్‌జీ స్మారకార్థం ‘పురానామాల్ సమాధి’ నిర్మితమైంది. ప్రస్తుతం ఆసిఫ్‌నగర్‌లోని సీతారాంబాగ్ దేవాలయాన్ని కూడా ఆయనే నిర్మించారంటారు.
మహాదేవుని దేవాలయం
‘చారిత్రాత్మక భైరవుని దేవాలయం’ అదిలాబాద్ జిల్లా సాదలపూర్‌లో ఉంది. భైరవుడు, మహాదేవుడు కొలువైన ఈ పురాతన దేవాలయాన్ని కాకతీయ వంశస్తురాలు రుద్రమదేవి కాలంలో నిర్మించినట్లు చెబుతరు. పకృతి సిద్ధమైన అడవులు, కొండల మధ్య నెలకొన్న ఈ దేవాలయానికి మహాశివరాత్రి రోజున వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తరు.
ఇర్రం నుమా ప్యాలెస్
నిజాం నవాబులు నిర్మించిన అరుదైన ప్యాలెస్‌లలో ఇర్రం నుమా ప్యాలెస్ ఒకటి. క్రీ.శ.1847లో నిర్మితమైన ఈ రాజభవనం ఎర్రగడ్డలో ఉంది. మొదట నవాబ్ ఫకృముల్క నివాసంగా ఉన్న దీనిని తరువాతి కాలంలో పన్ను వసూలు కేంద్రంగా, అలాగే గుర్రపుశాలగా వినియోగించారు. 1920లో టీబీ హాస్పిటల్‌గా మార్చారు. ప్రస్తుతం ప్రభుత్వ జనరల్, ఛాతీవ్యాధుల ఆసుపత్రిగా ఉంది. అయితే ఈ భవనం ఇప్పటికే బాగా శిథిలావస్థకు చేరింది. అయినా 120 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్యాలెస్ పరిసరాలు పచ్చని చెట్లతో కనువిందు చేస్తాయి.
దోమకొండ శివాలయం
నిజామాబాద్ జిల్లాలోని కామినేని వంశ సంస్థానాధీశులకు చెందిన దోమకొండ కోటలోనే ఒక శివాలయం ఉంది. 18వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మితమైంది. దీనిని కాకతీయ శిల్ప కళాశైలిని అనుసరించి ఆగమశాస్త్ర యుక్తంగా నిర్మించారు. కామినేని వంశీయులు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పురానాపూల్ దర్వాజా
‘పురానాపూల్ దర్వాజా’ను తానీషా కాలంలో నిర్మించారు. 18వ శతాబ్దంలో గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడి అనంతరం హైదరాబాద్ నగరం మొఘలుల పాలన కిందకు వచ్చింది. మొఘల్ రాజు ఫరూక్ సియర్‌కు సుబేదార్‌గా ఉన్న ముబరేజ్ ఖాన్ హైదరాబాద్ చుట్టూ గోడ నిర్మాణాన్ని చేపట్టారు. గతంలోని పురానాపూల్ దర్వాజాతో పాటు మిగిలిన దర్వాజాలను కలుపుతూ ఈ గోడ నిర్మించారంటారు. దీనికి మొత్తం 13 దర్వాజలుండేవి. ప్రస్తుతం రెండు మిగిలి ఉండగా వాటిలో పురానాపూల్ దర్వాజ ఒకటి.
No comments:
Post a Comment