Thursday 30 August 2012

తిపుడంపల్లి కోట

ఆత్మకూరు ఆనవాలు తిపుడంపల్లి కోట
         వనపర్తి, గద్వాల, జటప్రోలు, గోపాల్‌పేట, ఆత్మకూరు (అమరచింత) సంస్థానాలు ఎందరో విద్వాంసులకు, రచయితలకు ఆశ్రయం కల్పించి, సాహితీ సౌరభాలను గుభాలింపజేశాయి. ఈ సంస్థానాధీశులు సాహిత్య, కళాపోషకులే కాక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు చక్కటి ప్రణాళికలను రూపొందించారు. వాటిని అమలు చేయడం వల్ల అవి నేటికీ సత్ఫలితాలనిస్తూ కొందరికి ప్రత్యక్షంగా మరి కొందరికి పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నాయి. ఆత్మకూరు సంస్థానానికి రాజధానిగా ఉన్న ‘తిపుడంపల్లి’ గ్రామాన్ని పరిశీలిస్తే నాటి రాజుల ముందుచూపు ఎంత గొప్పదో ఇట్టే అర్థమవుతుంది.
            హైదరాబాద్ నుండి కర్నూల్‌కు వెళ్ళే రైలు మార్గంలో శ్రీరామ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు కేవలం కిలోమీటర్ దూరంలో తిపుడంపల్లి గ్రామం ఉంది. కాచిగూడ, గుంటూరు ప్యాసింజర్ రైలు లేదా సికింద్రాబాద్ - కర్నూల్ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్  రైలులో ప్రయాణించి శ్రీరామ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో దిగి తిపుడంపల్లికి చేరుకోవచ్చు.
ఆత్మకూరు సంస్థానం అసలు కథ                          
            ఆత్మకూరు సంస్థానానికి ‘అమరచింత’ సంస్థానమనే పేరుకూడా ఉంది. ఈ సంస్థానానికి తూర్పున వనపర్తి సంస్థానం, పడమరన రాయచూరు, ఉత్తరాన నిజాం సరిహద్దులు, దక్షిణాన గద్వాల సంస్థానాలు ఉండేవి. 190 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 69 గ్రామాలు ఉండేవి. 
                                        వనపర్తి సంస్థానం              
                 ఈ గ్రామాలన్నీ అమరచింత, వడ్డేమాను   పరగణాల పరిధిలో ఉండేవి. ‘ముక్కెర’ వంశానికి చెందిన పాకనాటి రెడ్డిరాజులు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. తిరుపతికి 116 కి.మీ. దూరంలోని చంద్రగిరికి చెందిన గోపాల్‌డ్డికి కాకతీయ సామంత రాజులతో ఏర్పడిన పరిచయం కారణంగా క్రీ.శ.1268లో వడ్డేమాన్‌కు పిలిపించి మగతల (ముఖ్తల్) నాగగౌడ పదవితో సత్కరించి, సంస్థాన బాధ్యతలను అప్పగించారు. ‘అమరచింత సంస్థాన మూల పురుషుడు గోపాల్‌డ్డే’నని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన వంశమే తర్వాతి కాలంలో అమరచింత సంస్థానాన్ని పరిపాలించినట్లు చారిత్రక ఆధారాల వల్ల స్పష్టమవుతోంది. క్రీ.శ.1268లో గోపాల్‌డ్డితో ప్రారంభమైన ఆత్మకూరు ప్రస్థానం 1948లో సంస్థానం విలీనం అయ్యేవరకూ కొనసాగింది. రాజా శ్రీరామభూపాల్ బాధ్యతలను నిర్వహించిన చివరి వ్యక్తిగా చరి
త్రలో నిలిచిపోయారు. రాణి భాగ్యలక్ష్మమ్మ దోమకొండ సంస్థానాధీశుల ఆడపడచు కావడం విశేషం.
తిపుడంపల్లి రాజధానిగా...            
      ఆత్మకూరు సంస్థాన బాధ్యతలను ఇమ్మడి తిమ్మాడ్డి  అనంతరం  అతని   కుమారుడు   సోమిడ్డి  లేక 
సోమభూపాలుడు చేపట్టారు. ఈయన కాలంలోనే అక్కడి వాగు ఉప్పొంగడంతో దుప్పల్లి నుండి తిపుడంపల్లికి రాజధానిని మార్చినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. తిపుడంపల్లిని రాజధానిగా చేసుకొని సోమభూపాలుడు పరిపాలన సాగించారు. తిపుడంపల్లిలో వారు మట్టికోటను నిర్మించారు. వారం వారం సంతకూడా జరిగే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. సోమిడ్డి అనంతరం ఆయన పెద్ద కుమారుడు పెద్ద వెంకట్‌డ్డి సోదరుని సహకారంతో సంస్థాన బాధ్యతలను స్వీకరించారు. 


       క్రీ.శ. 1813లో సంస్థానానికి అధిపతి అయిన ఈయన తిపుడంపల్లిలో చెరువును తవ్వించాడు. వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి పరిచారు. ఆనాడు తవ్వించిన ఈ చెరువు ఈ నాటికి మూడు కాలాలలోనూ నీటిని అందిస్తూ వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతోంది. మత్స్యకారులు సైతం చేపల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. చెరువు ద్వారా లభిస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని గ్రామంలోని ఆలయాల పునరుద్ధరణకు, అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నారు. చంద్రాడ్డి కొద్ది కాలానికే తిపుడంపల్లి నుండి రాజధానిని ఆత్మకూరుకు మార్చారు. సంస్థానాధీశుల విజ్ఞప్తి మేరకు రైల్వేలైను ఏర్పాటు కావడంతో పాటు తిపుడంపల్లి గ్రామానికి కిలోమీటర్ దూరంలో రాజా శ్రీరాంభూపాల్ పేరిట ‘శ్రీరామ్‌నగర్ రైల్వేస్టేషన్’ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంత ప్రజలకు రవాణా పరంగా ఎంతో మేలు జరిగింది.
               ఆత్మకూరు సంస్థానం రాజధానిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన తిపుడంపల్లి కోట నేడు శిథిలావస్థకు చేరుకుంది. తూర్పు, ఉత్తర, దక్షిణం వైపున్న కోట ప్రాకారాలు, బురుజులు మాత్రమే గత చరిత్రకు సాక్షీభూతంగా నిలిచాయి. కోట కింది భాగంలోని రాళ్ళు ధ్వంసం కావడంతో నిర్మాణం బలహీనపడుతోంది. కోట లోపలి భాగంలో ఎలాంటి రాజ భవనాలూ లేవు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలు కోట లోపల ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించారు. ఏమైనా ఇప్పటికైనా ఈ చాత్రక ప్రాధాన్యం గల కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం తగిన కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇకనైనా కనువిప్పు కలగాలి!
              ఆత్మకూరు సంస్థానాధీశులు తిపుడంపల్లితో పాటు పలు గ్రామాలలో తవ్వించిన చెరువులు నేటికీ రైతన్నలకు ఆదెరువుగా మారాయి. కానీ, భారీ ప్రాజెక్టుల పేరిట కోట్లాది రూపాయలను గుత్తేదార్లు, రాజకీయనేతలు దోచుకుంటూ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు. ప్రజలకు చిన్న చెరువులే శ్రీరామరక్ష అని వారు తెలుసుకోవాలి. నీరందించకుండా నిరుపయోగంగా మారే ప్రాజెక్టుల నిర్మాణం కన్నా చిన్న చెరువులు చేకూరుస్తున్న భారీ ప్రయోజనాలను గుర్తించి ఆ దిశగా నేటి పాలకులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 
వ్యాసకర్త - గుముడాల చక్రవర్తిగౌడు

No comments:

Post a Comment