Tuesday 16 April 2013

రామప్పగుడికి 800 వసంతాలు ( పాలంపేట - శ్రీ రుద్రేశ్వరాలయం)



         
           ఏడాదిపాటు కాకతీయ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలోనే భారత ప్రభుత్వం మన ఓరుగల్లు మహానగరాన్ని చారిత్రా  త్మక  వారసత్వ నగరంగా గుర్తించింది. సరిగ్గా ఇదే సమయానికే, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పాలంపేట శ్రీ రుద్రేశ్వరాలయానికి (రామప్పగుడి) 800 సంవత్సరాలు పూర్తయ్యాయి. నిజానికి ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం మార్చి 31కి సరిగ్గా దీన్ని నిర్మించి 800 సంవత్సరాలు పూర్తవుతాయి. తెలుగు తిథుల ప్రకారం చైత్ర శుక్ల అష్టమి అంటే ఏప్రిల్ 18 అవుతుంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఆ ఆలయ కళా విశేషాలను, కాకతీయుల శిల్పరీతిని వివరించే ప్రత్యేక వ్యాసం...
ఆచార్య హరి శివకుమార్
        ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం ఒక సువర్ణ అధ్యాయం. నేటి ఆంధ్రదేశాన్నే కాక, యావత్ దక్షిణ భారతదేశాన్నీ పరిపాలించిన కాకతీయులకు ‘ఓరుగల్లు’ రాజధాని. అదే నేటి వరంగల్లు. సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఓరుగల్లు చరిత్ర శాసనాలలోను, అలనాటి సాహిత్యంలోను మరుగున పడే ఉన్నది. కానీ, సమర్థవంతమైన కాకతీయ రాజుల పాలనలో ఓరుగల్లు ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి. వారసత్వానికి ప్రధాన నిదర్శనాలైన సాహిత్యం, శిల్పం, నాట్యం, చిత్రకళ వంటి అన్ని రంగాలలోను వారు తమదైన ప్రత్యేకతను చాటుకొంటూ, సుస్థిరమైన పరిపాలనతో పాటు, గొప్ప సంస్కృతిని భావి తరాలకు అందించి, చరిత్ర పుటలలో శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకొన్నారు. వారు సృష్టించిన సాహిత్య సంపద, శిల్పరీతి, లలితకళలు అన్నీ నేటికీ నిదర్శనాలుగా నిలిచి ఉన్నాయి. అయితే అవి కాలాంతరంలో తమ ప్రాచీన వైభవాన్ని కోల్పోయాయి. చివరకు వాటి పేర్లు కూడా మారిపోయాయి. 
         ఓరుగల్లు నగరం పేరే మారిపోయి వరంగల్ అయింది. అనుమకొండ - హనుమకొండ అయింది. అట్లాగే వారు నిర్మించిన శిల్పకళాశోభితమైన ఆలయాల పేర్లు కూడా మారిపోయాయి. అనుమకొండలోని శ్రీ రుద్రేశ్వరాలయము - వెయ్యిస్తంభాల గుడిగానే నేడు పిలువబడుతోంది. అట్లాగే కాకతీయ శిల్పకళారీతికి, నైపుణ్యానికి నిలు సాక్ష్యంగా నిలిచిన పాలంపేట శ్రీ రుద్రేశ్వరాలయం - రామప్పగుడిగా పిలువబడుతోంది. వాస్తవానికి రేచర్ల రుద్రసేనాని తన పేర కట్టించిన ఆ దేవాలయం అసలు పేరు శ్రీ రుద్రేశ్వరాలయమే. నిజానికి, కాకతీయ దేవాలయాలలో మకుటాయమానమై, వారి శిల్పరీతికి నిలు సాక్ష్యంగా నిలిచి ఉన్న ఆ దేవాలయాన్నిరుద్రేశ్వరాలయం’ అంటే ఈనాడు చదువుకొన్నవారికి కూడా తెలియదు. 
            రామప్పగుడి అంటేనే తెలుస్తుంది! దీని అసలు నామం గురించి ఆలయ ప్రాంగణంలోని రుద్రసేనాని శాసనం స్పష్టం చేస్తునే ఉన్నది. అట్లాగే నేటి పాలంపేట ప్రాంతాన్ని ఆ రోజులలో ‘నాతుకూరు’ (వరంగల్ జిల్లా శాసనాలు - పు.149) అనేవారని ఆ శాసనంలోనే కన్పిస్తుంది. అంతేకాక, ఓరుగల్లుకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతం కూడా ఓరుగల్లులోని ఒక భాగమే అని అదే శాసనంలోని - ‘ఓరుగల్లు పురంలో రుద్రసేనాని కట్టించిన ఆలయం’ అన్న పదబంధాన్ని బట్టి స్పష్టమవుతుంది. అలనాటి ఓరుగల్లు విస్తీర్ణం 96 యోజనములు (155 కి.మీ.) అని 16వ శతాబ్దంలో వెలువడిన ఏకామ్ర నాథుని ‘ప్రతాపచరిత్ర’ (పు.128)లో స్పష్టంగా కన్పిస్తున్నది.
      
      భారతదేశంలో విలసిల్లిన శిల్పరీతులలో ‘కాకతీయ శిల్పరీతి’ ఒక విశిష్టతను సంతరించుకొంది. కాకతీయ దేవాలయాలలోని స్తంభాల నిర్మాణరీతి, వాటిని నిలబెట్టిన విధానం, గర్భాలయ ముఖద్వారాలు వంటి అనేక లక్షణాలను బట్టి అవి కాకతీయ దేవాలయాలో కాదో తేలికగా నిర్ణయించవచ్చు. అదే కాకతీయ శిల్పరీతి! అయితే, కాకతీయ శిల్పరీతికి మార్గదర్శకమైంది కర్ణాటకలో విలసిల్లిన హోయసల శిల్పరీతి. కాకతీయ దేవాలయ నిర్మాణానికి దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసలులు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాల మీద కన్పించే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ దేవాలయాలలో కూడా కన్పిస్తాయి. అయితే, హోయసల శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కన్పిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటివైపుననే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కానీ, కాకతీయులు బయటనే కాక లోపలి భాగంలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు.
      హోయసల శిల్పాలు అందమైన రూపురేఖలతోను, ఆభరణాలతోను కన్పిస్తాయి. కాని, కాకతీయ శిల్పులు ఆభరణాలతోపాటు హావభావాలకు కూడా ప్రాధాన్యమిచ్చారు. హోయసల ఆలయాలపై కన్పించేవి దేవతామూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కన్పించేవి నాటి సామాన్య స్త్రీ పురుషలవి. ఆ విధంగా అలనాటి సామాన్య మానవుల వేషభాషలతో పాటు వారి హావభావాలను కూడా ప్రదర్శించిన ఘనత కాకతీయులదే! అది కాకతీయుల సామాజిక స్పృహకు నిదర్శనం! ఇలాంటి ఎన్నో విశేషాలతో ‘కాకతీయ శిల్పరీతి’ని ఆవిష్కరిస్తూ అలరారుతున్నవి కాకతీయ దేవాలయాలు! అలాంటి అద్భుతమైన శిల్పసంపదతో కూడిన శ్రీ రుద్రేశ్వరాలయ చరిత్రను, విశేషాలను ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిందే!         శ్రీ రుద్రేశ్వరాలయ ప్రాంగణంలో ఉన్న రేచర్ల రుద్రుని శాసనంలో శక సంవత్సరం 1135 - శ్రీముఖ సంవత్సర చైత్ర శుక్ల అష్టమీ ఆదివారం కీ.శ.30-3-1213) పుష్కార్యయోగంలో ఈ దేవాలయాన్ని తాను కట్టించి శ్రీగౌరీసహిత రుద్రేశ్వరుని ప్రతిష్ఠించినట్లు రుద్రసేనాని చెప్పుకొన్నాడు. దానినిబట్టి 31-3-2013 నాటికి దీన్ని నిర్మించి 800 సంవత్సరాలు పూర్తవుతాయి. తెలుగు తిథుల ప్రకారం చైత్ర శుక్ల అష్టమి 18-4-2013 అవుతుంది. అంతేకాక, ఆ ఆలయ నిర్వహణకు ఉప్పరపల్లి, బొర్లపల్లి అనే గ్రామాలను దానం చేసినట్లు ఆ శాసనం పేర్కొంటున్నది. ఆ ఆలయానికి దక్షిణభాగంలో తన తండ్రి కాటేనాని పేర శ్రీ కాటేశ్వరాలయాన్ని, ఉత్తరభాగంలో తన తల్లిపేర శ్రీ కామేశ్వరాలయాన్ని నిర్మించి, వాటి అంగరంగ భోగాలకు ‘నడ్కుటె’ అనే గ్రామాన్ని కూడా దానం చేసాడు.
ఆలయ విశేషాలు       

     శ్రీ రుద్రేశ్వరాలయంలోకి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కన్పిస్తుంది. అందులో - రుద్రసేనాని వంశాభివర్ణనం, ఆతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి- పరాక్రమాలు, అలనాటి ఓరుగల్లుపుర వైభవం వర్ణింపబడ్డాయి. శ్రీ రుద్రేశ్వరాలయానికి ఉత్తరం, తూర్పు, దక్షిణ దిశలలో 3 ద్వారాలు ఉన్నాయి. ఆ మూడు ప్రవేశద్వారాలు రకరకాల శిల్పాలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లు కన్పిస్తాయి. ప్రధానాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఇదొక అద్భుత కళా ఖండం. కాకతీయ శివాలయాలు అన్నింటిలోనూ నంది విక్షిగహాలు కన్పిస్తాయి. కానీ, ఇంత అందమైన, శిల్పశోభితమైన నంది మరెక్కడా కన్పించదు. దేశంలో ఎన్నో ఆలయాలలో నంది విగ్రహాలు కన్పిస్తాయి. వాటి ప్రత్యేకతలు వాటికి ఉండవచ్చు. లేపాక్షి బసవన్న, యాగంటి బసవయ్య వంటివి వాటి వాటి ప్రత్యేకతలకు నిదర్శనం! కానీ, ‘కాకతీయ నంది’ అనగానే మనకు స్ఫురించేది అనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలోని నంది విగ్రహం. కానీ, అది కూడా పాలంపేట రుద్రేశ్వరాలయ నంది ముందు వెల ఇక్కడి నంది ప్రత్యేకత - దానిని ఎటువైపు నుంచి చూసినా, అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. ఆ విధంగా అన్నివైపుల నుంచి మనోహరంగాను, హుందాగాను కన్పించే ఈ నంది ముందు, దేశంలోని అన్ని నందులూ దిగదుడుపే! ఈ నంది మీద చెక్కిన రకరకాల ఆభరణాలు దాని శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి.
మదనిక శిల్పాలు (Braket Figures):
         శ్రీ రుద్రేశ్వరాలయం బయటివైపున స్తంభాల పైభాగాన్నీ, పైకప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలు మదనికలు! అవి ఆనాటి సామాన్య స్త్రీలవి. దేవాలయాలమీద సామాన్యుల శిల్పాలను చెక్కించి, వారిని కూడా దేవతలలాగా మాన్యులను చేసిన ఘనత కాకతీయులదే! ఆ మదనిక శిల్పాలను వస్త్రాలకంటే ఆభరణాలతోనే నింపివేసారు కాకతీయ శిల్పులు. ఆ ఆభరణాలలో నాటి స్త్రీలు ధరించే రకరకాల హారాలు, శిరోభూషణాలు ఉన్నాయి. అవి ఆనాటి ఆభరణ విశేషాలను ప్రదర్శిస్తాయి. వాటిలో ఒక్కొక్క శిల్పంలో ఒక్కొక్క విశేషం కన్పిస్తుంది.
            ఒక మదనిక పలుచని ఉల్లిపొర వంటి వస్త్రం ధరించి ఉన్నది. ఆమె చెవికి ఉన్న దుద్దులు ఆనాటి కర్ణాభరణాలకు ఒక మచ్చుతునక. ఇంకొక మదనిక తన పది చేతివేళ్ళకూ ఉంగరాలు ధరించి తన్మయత్వంతో నాట్యం చేస్తున్నది. మరొక మదనిక (నాగిని) చేతులలో ఒక పామును ధరించి నాట్యం చేస్తున్నది. ఇంకొక మదనిక తాను ధరించిన కంఠాభరణానికి ఉన్న మణులు పొదిగిన లాకెట్‌ను ఎత్తిచూపుతున్నది. ఆమె శరీరానికి తగలకుండా ఎత్తుగా కన్పించేటట్లు ఆ లాకెట్‌ను చెక్కిన శిల్పి నైపుణ్యం అమోఘం! మరొక మదనిక తన పాపిడి బొట్టులాగా ఒక ఆభరణాన్ని ధరించి, మృదంగం వాయిస్తున్నది. ఇంకొక మదనిక ఎత్తుమడమల పాదుకలు (High heels) ధరించి ఉన్నది. ఈ శిల్పాలన్నింటిలోను కన్పించే ఆభరణాలు, అలంకారాలు ఆనాటి జీవన సౌభాగ్యానికి నిదర్శనాలు!
        ఒక మదనిక చీరను ఒక కోతి లాగి వేస్తుంటే, ఒక చేత్తో మానసంరక్షణ చేసుకొంటూ, రెండవచేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పంలోని ముఖంలో కన్పించే హావభావాలు అద్భుతం! మరొక మదనిక పాదంలో ముల్లుగుచ్చుకోగా, ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా ప్రదర్శించిన శిల్పి నైపుణ్యం వర్ణనాతీతం! ఇలాంటి హావభావాలను శిల్పాలలో ప్రదర్శించటంలో కాకతీయుల ప్రజ్ఞ చూసి తీరవలసిందే! ఈ మదనికల శిల్పాల నడుమ గజకేసరి శిల్పాలు ఉన్నాయి. ఓరుగల్లు కోటలోను, కాకతీయ దేవాలయాలలోను ఎక్కడ పడితే అక్కడ ఈ గజకేసరి శిల్పాలు కన్పిస్తాయి. పాలంపేట రుద్రేశ్వరాలయంలోనివి పెద్దగా ఉన్నాయి. కారణం - కాకతీయ రాజులలో మొదటి, రెండవ ప్రోలరాజులకు, రుద్రదేవ మహారాజుకు, గణపతిదేవ చక్రవర్తికి, రుద్రమదేవికి, ప్రతాపరుద్రునికి - అందరికీ గజకేసరిబిరుదులు ఉన్నాయి. బహుశః అందుకేనేమో కాకతీయ శిల్పాలలో గజకేసరి శిల్పాలు ఎక్కువగా కన్పిస్తాయి.
రంగమంటపం:
గర్భాలయానికి ముందున్న రంగమంటప శోభను వర్ణించలేము. నాలుగు స్తంభాలమీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా కన్పిస్తాయి. స్తంభాల పైభాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు శిల్పులు. ఇంత అందంగా చెక్కిన స్తంభాలు మరి ఏ కాకతీయ దేవాలయాలలోనూ కన్పించవనటం అతిశయోక్తి కాదు. స్తంభాల మధ్యలో చతురవూసాకార ఫలకాలమీద, గుండ్రంగా ఉన్న భాగాలపైన, వాటికి అనుగుణమైన శిల్పాలను చెక్కి, తమ చాకచక్యాన్ని ప్రదర్శించారు శిల్పులు. ఒక దానిమీద సముద్ర మథనం, ఒకదానిమీద ముగ్గురు స్త్రీలకు నాలుగే కాళ్ళు ఉన్న శిల్పం, ఒకదానిమీద పేరిణి నాట్యం, ఒకదానిమీద దండలాస్యం, ఒకదానిమీద కుండలాకార నృత్యం, ఒకదానిమీద స్త్రీలే మద్దెలలు వాయిస్తూ ఉండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్లు చెక్కిన చిత్రం - వంటివి అద్భుతంగా చెక్కబడినాయి.
గర్భాలయ ప్రధాన ద్వారం:
        రుద్రేశ్వరాలయ గర్భాలయ ప్రధాన ద్వారం మరొక గొప్ప కళాఖండం. చెరుకుగడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి, రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళతో దర్శనమిస్తారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయినుంచి లోహపు శబ్దం రావటం విశేషం. వాటి పైభాగాన సింహాల వరుసలు, లతలు, వాద్యకారుల చిత్రాలు అందంగా తీర్చిదిద్దబడినాయి.
శ్రీ రుద్రేశ్వర మహాలింగం:
    గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీ రుద్రేశ్వర మహాలింగం, అనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడిలోని రుద్రేశ్వరునితో పోటీపడుతున్నదా అన్నట్లు కనువిందు చేస్తుంది. పానవట్టంపైన భాగంలోనే కాకుండా, కింది భాగంలో కూడా సన్నని గీతలు గీతలుగా అందంగా చెక్కిన రీతి మనోహరం! ప్రధానలింగం నల్లని కాంతులీనుతూ నిన్ననో మొన్ననో చెక్కినట్లు కన్పిస్తుంది. ఇదొక అద్భుత కళాఖండం!
దశభుజ రుద్రుడు:
      రంగమంటప మధ్యభాగంలో ఉన్న పైకప్పులో దశభుజుడైన నాట్యరువూదుడు చెక్కబడినాడు. ఇలాంటి శిల్పమే అనుమకొండలోని రుద్రేశ్వరాలయం స్తంభాలగుడి)లో కూడా ఉన్నది. పరమశి వారాధకులైన కాకతీయులు వైదికరువూదుని ఆరాధించారనటానికి - రుద్రదేవ మహారాజు, రుద్ర(మ)దేవి, ప్రతాపకుమార రుద్రదేవ మహారాజు అన్న వారి పేర్లలో కన్పించే ‘రుద్ర’ శబ్దమే నిదర్శనం. ఆ దశభుజ రుద్రునికి - కుడివైపున ఉన్న 5 చేతులలో - శూలము, వజ్రాయుధము, ఖడ్గము, పరశువు, అభయముద్ర ఉన్నాయి. అట్లాగే ఎడమవైపున ఉన్న 5 చేతులలో - నాగము, పాశము, ఘంట, అగ్ని, అంకుశము ఉన్నాయి. ప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుని ‘పండితారాధ్య చరిత్ర’ (వాద ప్రకరణం- పు.661)లో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కన్పిస్తుంది. ఆ వైదికరువూదుని వర్ణనకు శిల్పరూపమే పై రంగమంటప శిల్పం. ఆ దశభుజరువూదుని పరివేష్టించి అష్ట దిక్పాలకులు భార్యాసమేతులై, తమ తమ వాహనాలమీద కొలువుతీరి ఉన్నారు.
        ఆ రంగమంటపం చుట్టూ ఉన్న 4 అడ్డదూలాలమీద సముద్ర మథనము, త్రిపురాసుర సంహారం, గజాసుర సంహారం, వరాహమూర్తి, నాట్యగణపతి, కృత్య వంటివి మనోహరంగా చెక్కబడినాయి. ముఖ్యంగా - గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మనోహరంగా కన్పిస్తుంది.
         రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పులలో రకరకాల పద్మదళాలు, రాతి చక్రాలు చెక్కబడినాయి. ఆలయం కప్పు లోపలి వైపున కొన్ని చోట్ల ఎర్రని శిలలను చెక్కిపెట్టటంవల్ల, అవి ఈనాడు అందంగా కన్పించటానికి ఉపయోగిస్తున్న ‘టైల్స్’ లాగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రంగమంటపం ఒక అద్భుత కళాఖండం! ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షిణపథం ఉంది. దానిమీద నడుస్తూ ఉంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కన్పిస్తాయి. వాటిలో - శృంగార శిల్పాలు, క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవమూర్తులు వంటి విశేషాలు కన్పిస్తాయి. అవికాక - మహిషాసుర మర్దిని, వీరభవూదుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రేశ్వరాలయం పైభాగంలో పెద్ద గోపురం కన్పిస్తుంది. అది ‘వేసర’ శిల్ప విధానంలో నిర్మింపబడింది. ఆలయ శిఖరానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. ప్రస్తుతం అవి లభించటం లేదు. కానీ, అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం!
         ఇట్లా అనేక శిల్ప విశేషాలతో అలరారుతూ, కాకతీయ శిల్పరీతికి శిఖరాయ మానంగానూ, నిలు నిదర్శనంగానూ నిలిచి ఉన్న ఈ రుద్రేశ్వరాలయం నేడు దేశంలోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది. అష్టశతాబ్దాలు పూర్తయిన శుభ సందర్భంలో రుద్రేశ్వరాలయాన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, అది చారివూతాత్మక వారసత్వ సంపద గలిగిన ఓరుగల్లుకు కీర్తిపతాక అవుతుంది. ఆ గొప్ప వారసత్వ సంపదను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాక, ఓరుగల్లు ప్రజలందరిదీ అని గుర్తించాలి!

No comments:

Post a Comment