Wednesday, 17 April 2013

సీతారాముల కళ్యాణ వైభోగం..


       ‘సీతారాముల కళ్యాణం’ ఈ మాట వినగానే ప్రతి మానవుడి ఎద పులకరిస్తుంది. ఒక భక్తిభావన మనస్సులో మెదుల్తుంది. ఆదర్శ దంపతుల అన్యోన్యత మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. పల్లె పల్లెలో, వాడవాడలా, పట్టణాల్లోనూ పండుగ వాతావరణమే. ‘నవమి’ రోజున ఎక్కడ చూసినా సీతారామ కళ్యాణ వైభోగం. ఏమి విన్నా రామచరితమే. ఏది తిన్నా రామ ప్రసాదమే. ఏవి స్వీకరించినా అవి మంగళాక్షతలే. ఏ నోట విన్నా రామాయణ కావ్యగానమే. ఆ రోజు అందరం లవకుశులమే. అందరం భక్త ఆంజనేయులమే. అంత ప్రాధాన్యం, అంత ప్రాచీనతా, అంత పవిత్రత సంతరించుకున్న విశేష పర్వదినం ‘శ్రీరామనవమి’. 
          రామాయణ, భారత, భాగవతాలు మూడు మన భారతీయ సంస్కృతికి బలమైన మూలస్తంభాలు. ఎన్నో శాస్త్రాలు, పురాణాలు, కథలు, గాథలూ వ్యాప్తిలో ఉన్నా ఈ మూడింటికీ ఉన్న బహుళ ప్రచారం, ఆదరణ మరే ఇతర గ్రంథాలకు లేదని మనం ఒప్పుకోక తప్పదు. ఈ గ్రంథాల్లోని కథలు, పాత్రలు, సన్నివేశాలు ప్రజల మనస్సులలో పదిలంగా ఉండటానికి కారణం ఆ కావ్యాల సార్వజనీనత, సార్వకాలీనత. అనుదిన సంభాషణలల్లో, భావనల్లో, భక్తిలో, సంబంధాలలో, అనుబంధాలలో వీటిలోని పాత్రలు, సన్నివేశాలు విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయి.
         ఉదాహరణకి రామాయణంలోని భరద్వాజ విందు, సుగ్రీవాజ్ఞ, చుప్పనాతి శూర్పనఖ, లక్ష్మణరేఖ, ఇంటిగుట్టు లంకకు చేటు, చూచి రమ్మంటే కాల్చి రావడం- మొదలైన మాటలు ప్రజల నాలుకల్లో నానుడులై నడయాడుతున్నాయి. అదీ రామాయణంలోని గొప్పతనం.
‘రామాయణం' ఆదికావ్యం, భారతం ఇతిహాసం, భాగవతం భక్తిరసభరితమైన పురాణం’. ఇది స్థూలంగా పండితుల అభిప్రాయం. అయితే, ప్రతి గ్రంథంలోనూ మిగిలిన రెండు లక్షణాలు కనిపిస్తాయి. రామాయణంలో ఇతిహాస పురాణ లక్షణాలున్నాయి. వాటితో పాటు మిగిలిన రెండింటిలోను లేని కొన్ని విశిష్ట లక్షణాలూ రామాయణంలో ఉన్నాయి. వాటిలో ఒకటి కవితా రమణీయం. ఎందుకంటే అది పూర్తి స్థాయి కావ్యం కాబట్టి. రెండవది వస్యైక్యం. అందుకే, రామాయణం సమాజానికి నిత్య ప్రతిబింబమైంది.
         ఇది ప్రముఖంగా ధర్మ ప్రతిపాదితా కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. రామాయణంలోని ఇంపైన పాత్రల చిత్రీకరణ, వాటిలోని ఉద్విగ్నతలు, నాటకీయతలు అన్నీ పండిత పామరులకు అందరికీ సర్వదా చర్చనీయాంశాలే. అటువంటి విశేష లక్షణాపూన్నో గల రామాయణాన్ని పెద్దలు అనేక కోణాల నుంచి దర్శించి తరించారు. 

                    శ్లో॥ వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే
                   వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షావూదామాయణాత్మనా॥

       రామాయణం వేదానికి ప్రతిరూపమనీ, మంత్ర పూరితమనీ అంటారు. అంతేకాదు, అత్యంత విలువైన గాయత్రీ మంత్రానికి కథా రూపమనీ, వేదాంత తత్త ప్రతిపాదకమనీ పండితులెందరో విశ్లేషించారు. ఇదొక రమ్యమైన కావ్యం. అసాధారణ ప్రతీకాత్మక రచన. అనేకులు ఎన్నో రకాలుగా ఆ ఆదికావ్యాన్ని అభివర్ణించారు. అందులో తరచిన కొద్దీ అనేక విశేషాలు మనకు దృగ్గోచరమౌతాయి. ఇలా రామాయణాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. 
         రామాయణ కావ్య కథానాయకుడే దశరథ మహారాజు తనయుడు. అందుకే, ఆయన ‘దాశరథీ కరుణాపయోనిధి’ అయ్యాడు. మనందరికీ ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. సత్య వాక్పరిపాలనకు నిలు విశ్వరూపం. ‘రామో విగ్రహవాన్ ధర్శః’ అన్నది పండిత వాక్కు. ఇది చాలా ప్రాచుర్యం పొందిన రాముని మహనీయతను ప్రతిపాదింపజేసిన సంస్కృత వాక్యం. దీని ప్రకారం ధర్మమే రాముని స్వరూపం. అలాగే, సీతా మహాసాధ్వి. ఆమె ఆయనకు అనుకూలమైన ధర్మపత్ని. సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనూ పాలు పంచుకున్న ఉత్తమోత్తమ ఇల్లాలు. యావత్ లోకానికే మహదాదర్శంగా నిల్చిన సాధ్వీమణి. 
           శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆయన మహావిష్ణువు అవతారం. ఆయన జన్మతిథి రోజునే మనం శ్రీరామనవమి పండుగను ఆచరిస్తున్నాం. అలాగే, సీతారామ కళ్యాణ మహోత్సవం కూడా అదే రోజు జరుపుకుంటాం. రాముడు ఎంత సత్యవంతుడో అంత ధర్మపరాయణుడు. ఎంత దయామయుడో అంత పరాక్రమశాలి. ఎట్టకేలకు రావణాసురున్ని వధించి, దిగ్విజయంగా అయోధ్యా నగరానికి తిరిగి వచ్చాడు. చిత్రంగా ఆ రోజు కూడా తిథి నవమే. ఆ మరునాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవోపేతంగా జరిగింది. 
            హైందవుడైన ప్రతి భారతీయుడు మరువరాని మంగళకరమైన రోజు శ్రీరామనవమి. వింధ్యకు ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో (ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో) రామజన్మ దినోత్సవాన్ని మాత్రమే నవమి నాడు ఆచరిస్తారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫాల్గుణ పౌర్ణమి రోజున కళ్యాణాలు చేస్తున్నట్టు వినబడుతోంది. మన ప్రాంతంలో (దక్షిణ దేశంలో) మాత్రం సీతారాముల కళ్యాణోత్సవం చైత్రశుద్ధ నవమి నాడే జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణంలో స్వయంగా, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాట పడని వారుండరు. ఆనాడు ఆబాల గోపాలమూ భక్తిపారవశ్యంలో మునిగిపోయి ఆ ఆదర్శదంపతుల కళ్యాణ వైభోగాన్ని వేయికళ్లతో తిలకిస్తారు, తనివితీరా సేవిస్తారు. 
         ‘వసంత నవరాత్రోత్సవాలు’ చైత్ర శు॥ ప్రతిపద మొదలు నవమి వరకు జరుపుతాం. దశమి రోజున సామ్రాజ్య పట్టాభిషేకం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంలోనే రామస్వామికి పూజాదులు గావించి, రామాయణ, సుందరకాండ పారాయణాలు జరుపుతారు. ఇదంతా లోక క్షేమాన్ని ఆకాంక్షిస్తూ, అనూచానంగా వస్తున్న సంప్రదాయం. 
       ‘ఉగాది’ తర్వాత వచ్చే మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. కాబట్టి, ఆనాడు లోకకళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం జరపడం విధిగా వస్తోంది. ఆ తర్వాతే మానవుల నిజ కళ్యాణాలు మొదలవుతాయి. ఇందుకు తగిన రీతిలోనే ముహూర్తాలు పెట్టడం మన జ్యోతిష శాస్త్రవేత్తలు అనాది సంప్రదాయంగా పాటిస్తున్నారు. అయితే, ఆ రోజున స్వామి కళ్యాణంలో పాల్గొన్న వారందరికీ వడపప్పు, బెల్లం పానకం ప్రసాదంగా ఇస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది ఎండాకాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభిప్రాయం. నాటి వివాహ మంగళాక్షతలు అతి పవిత్రం. వాటిని మన ఇంట్లో బియ్యంలో కలుపుకోవాలి. అలా అవి ఆ సంవత్సరమంతా మనింటనే ఉం టాయి. తత్ ఫలితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది వేదపండితుల భావన. 
         శ్రీరామనవమి రోజు మిథిలా నగరంలో విశ్వామిత్ర, వశిష్ఠ, నారదాది మునీంద్రుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి విశేష ప్రాధాన్యం ఉంది. అదే విధంగా ఇప్పటికీ మన దేవాలయాలలో ఆగమ సంప్రదాయ విధానంగానే కళ్యాణాన్ని జరుపుకోవడం మనం చూస్తున్నాం. ఆనాటి ఋషి ప్రోక్తమైన మంత్రాలు, వాల్మీకి విరచిత శ్లోకాలు అన్నింటినీ మంగళాష్టకాలుగా పఠించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయంగానూ కొనసాగుతోంది. ‘జానక్యాః కమలామలాంజలి పుటే... ’అనే శ్లోకాన్ని వివాహాల్లో పఠించడం, లగ్నపత్రికలపైన రాయడం తద్వార శుభాలు కలుగుతాయనే నమ్మకం మనందరం చూస్తున్నదే. ఋషులు అందించిన సంస్కృతి ‘ఆర్ష పద్ధతి’తో చేసే మన ప్రతి పనికీ ఒక అర్థం ఉంది. దానిని తెలుసుకోవడమే పరమార్థం. వాటిని తెలుసుకో గలిగిప్పుడే మనందరి జీవితం చరితార్థమవుతుంది. 
             ఇంతటి పటుత్వం ఉంది కాబట్టే, యుగాలు వెళ్లినా, తరాలు మారినా మన భారతీయ సంస్కృతి చెక్కుచెదరడం లేదన్నది సుస్పష్టం. ఒకవైపు అనాచారాలుంటున్నా ఆచారాలకు, పవిత్ర దైవకార్యాలకు ఉండే విలువ అంతకంతకూ ఇనుమడిస్తోంది. జగత్తు ఉన్నంత కాలం, మానవాళి మనుగడ సాగించినన్నాళ్లు రామాయణం అనితర కావ్యసుగంధంగా పరిఢవిల్లుతుంది. సమస్త మానవాళికి దారిచూపే ‘ధార్మిక దిక్సూచి’గా వెలుగొందుతుంది. సీతారాముల గాథ ప్రతి ఒక్కరికీ పారాయణమవుతుంది.
    మన ప్రాంతంలో (దక్షణ దేశంలో) మాత్రం సీతారాముల కళ్యాణోత్సవం చైత్రశుద్ధ నవమి నాడే జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణంలో స్వయంగా, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాట పడని వారుండరు. ధర్మబద్ధమైన జీవితానికి నిలు ప్రతిరూపం రాముల వారైతే రామాయణం ధర్మ ప్రతిపాదితా కావ్యం. 

శ్రీరామనవమి రోజు మనం జరుపుకునే ‘సీతారాముల కళ్యాణం’ లోకరక్షణకు ఒక ఘనమైన సంకేతం.
                                                               - ముత్యంపేట గౌరీశంకరశర్మ

No comments:

Post a Comment