Saturday, 6 April 2013

తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదు..

* ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ

హైదరాబాద్: తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. అది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకమని స్పష్టంచేశారు. దక్షిణాది మీడియా సంబంధిత కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జస్టిస్ కట్జూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ కాదని, కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుందని అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయని, ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని కట్జూ అభిప్రాయపడ్డారు. ఆర్థిక అసమానతలు తగ్గాయని చెప్పారు. తాను ఇంతవరకు ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలిపారు. పార్లమెంట్ సభ్యుల్లో మూడో వంతు మంది నేర చరితులేనని, దేశ ప్రజలు కూడా కులాలవారీగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను భారత్‌లో కలపాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment