Monday, 15 April 2013

పుడమి తల్లి పరిరక్షణకు ఎర్త్ అవర్...

     

           ఈ విశ్వంలో ప్రాణికోటికి ఆవాసంగా ఉన్నది భూమి ఒక్కటే. ఆ ఒక్క భూమిపై కూడా వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత విషమిస్తే మానవ మనుగడకు కూడా ప్రమాదమే. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో కర్భన వాయువుల కాలుష్యం, వాతావరణ మార్పులపై అవగాహన ఏర్పరచడానికి చేపట్టిన కార్యక్రమమే ‘ఎర్త్ అవర్’
- ఎర్త్ అవర్ కార్యక్రమం మొదటిసారిగా 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఈ ఎర్త్ అవర్ కార్య క్రమాన్ని ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహిస్తారు.
- 2013 మార్చి 23 రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు పాటించాయి.
- ఈ ఎర్త్ అవర్ కార్యక్రమంలో గంటసేపు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేయడం ద్వారా ప్రజలు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు తోడ్పాటు అందించినట్లయింది. భారతదేశంలో ఎర్త్‌అవర్ కార్య్రక్రమాన్ని మొదటిసారిగా 2009లో పాటించారు.
- డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్ సీఈఓ ఆండీ రిడ్లే ప్రపంచ ప్రజలలో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంచడంలో విజయం సాధించారు. దీనికి ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొంటున్న దేశాలు, పెరుగుతున్న ప్రజల మద్దతే నిదర్శనం.
- హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులాంటి మెట్రోనగరాలతోపాటు చిన్న, మధ్యతరహా పట్టణాలను కూడా ఎర్త్ అవర్‌లో భాగస్వామ్యం పంచుకునేలా చేయగలిగారు.
-2011లో ఎర్త్‌అవర్‌లో 120 కోట్ల మంది పాల్గొనగా, 2012లో 180 కోట్ల మంది పాల్గొన్నారు. కాగా 2013లో ధరిత్రి పరి రక్షణకు సంఘీభావం ప్రకటించిన వారి సంఖ్య 200 కోట్లకు చేరుకుందని భావిస్తున్నారు.
-2013, మార్చి 23 ఎర్త్‌అవర్‌లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనే ఆదా అయిన విద్యుత్ కొన్ని లక్షల యూనిట్లు ఉంటుందని అంచనా.
- ఈ సారి ఎర్త్‌అవర్‌లో పాలస్తీనా, ట్యునీసియా, సూరినాం, ఫ్రెంచ్ గయానా, సెయింట్ హలెనా, రువాండా దేశాలు తొలిసారిగా పాల్గొనడం విశేషం.
- అంతర్జాతీయంగా ఈ కార్యక్రమంలో కొన్ని కీలక ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. అవి గేట్ వే ఆఫ్ ఇండియా, సిడ్నీ ఒపెరా హౌస్, సిడ్నీ హర్డార్ బ్రిడ్జ్, కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్స్, ద టోక్యో టవర్, తైపీ 101, బీజింగ్‌లోని ప్రధాన ఒలింపిక్ స్టేడియం ద బర్డ్స్ నెస్ట్, బుర్జ్ ఖలీఫా, ఈఫిల్ టవర్, బకింగ్‌హామ్ ప్యాలెస్, అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, నయాగారా జలపాతం.
- ఇలా ప్రపంచవ్యాప్తంగా గంటపాటు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేయడం ద్వారా పెరుగుతున్న ఉష్ణ్రోగతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యతను చాటుతారు. 2013, మార్చి 23న జరిగిన ఎర్త్ అవర్‌లో 150కిపైగా దేశాల్లో ఆరువేల నగరాల్లో పర్యావరణ ప్రేమికులు దీనిని పాటించారు.
- ఢిల్లీలోని ఇండియా గేట్, హుమాయూన్ టూంబ్, ఎర్రకోట, సెంట్రల్‌పార్క్‌వంటి ప్రముఖ ప్రాంతాలు ఎర్త్ అవర్‌ను పాటించాయి.
- వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆధ్వర్యంలో సిడ్నీలో 2009లో 20 లక్షలమంది ప్రజలతో తొలిసారిగా మొదలయిన ఎర్త్ అవర్ కార్యక్రమం 2013 మార్చి 23 నాటికి 150 దేశాలకు పైగా విస్తరించింది.
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్
-‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ పర్యావరణ సంరక్షణ, పరిశోధనకు సంబంధించిన ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ.
- దీని పూర్వపు పేరు ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’.
- ప్రపంచంలో దాదాపు 100కు పైగా దేశాలలో పనిచేస్తూ, 50 లక్షలకు పైగా మద్ధతుదారులతో 1,300 పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులకు మద్దతుగా నిలిచింది.
- ఈ సంస్థ ప్రధాన లక్ష్యం పర్యావరణ వినాశనాన్ని ఆపి సంరక్షణ చేపట్టడం.
- ప్రస్తుతం ఈ సంస్థ జీవవైవిధ్యం అధికంగా ఉన్న అడవులు, మంచినీటి, మహాసముద్రాలు, తీర ప్రాంతాలలో జీవసంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతరించిపోతున్న జీవజాతులు, కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి ఇతర అంశాలపై కూడా ఈ సంస్థ పనిచేస్తోంది.
- ఈ సంస్థను 1961 ఏప్రిల్ 29న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం స్లిట్జర్లాండ్‌లో ఉంది.
- ఈ సంస్థ మోటో ‘ఫర్ ఎ లివింగ్ ప్లానెట్’. 1986లో ఈ సంస్థ ‘వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్’ నుంచి ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’గా పేరు మార్చుకుంది.
- ఈ సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు యోలండ కోకబడ్సె. ఈ సంస్థ మస్కట్ ‘ఛిఛి’ అనే ఒక పండా.

No comments:

Post a Comment