Tuesday, 9 April 2013

ఆ మూడు పార్టీలను ఓడిస్తేనే తెలంగాణ..


- రాష్ట్రం రాకుంటే కట్టుబానిసలుగా బతకాల్సిందే 
- తెలంగాణ నేతలకు ఎన్నాళ్లీ డిప్యూటీ బతుకులు?
- జనగామలో నెల్లుట్ల రవీందర్‌రావు పదవీ విరమణ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 

జనగామ: టీఆర్‌ఎస్‌కు 17 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీని గడగడలాడించాం, వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీలో ఆంధ్రోళ్లను అడుగుపెట్టనిస్తామా? 2009 డిసెంబర్ 7న తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన టీడీపీ, 9న అనుకూల ప్రకటన రాగానే 10న మాట తప్పింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ వద్దంటూ పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నడు, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుంచి మోసం చేస్తూ ప్రజలను గోసపెడుతోంది. ఈ మూడు పార్టీలను ఓడిస్తేనే తెలంగాణ వస్తుంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా జనగామలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నెల్లుట్ల రవీందర్‌రావు పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత రెండు ఎన్నికల్లో తెలంగాణ ఓడిపోయింది. పుష్కర కాలంగా ఉద్యమం చేస్తున్నాం. ఈసారి ఓడితే తెలంగాణ ఎప్పటికీ రాకపోగా ఆంధ్రోళ్ల పెత్తనంలో కట్టుబానిసలుగా బతకాల్సివస్తది. తెగతెంపుల సంకీర్ణాలు నడుస్తున్నాయి. ఉద్యమంతోపాటు ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగి శాసించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. ఆంధ్ర పార్టీల్లో తెలంగాణవాళ్లు ఎప్పటికీ పార్టీ అధ్యక్షులు కారు, ముఖ్యమంత్రులు, శాసనసభ పక్షనాయకులు, కనీసం అసెంబ్లీ స్పీకర్లుగా కూడా కారు. ఎన్నాళ్లు డిప్యూటీలుగా బతకాలి. కొంత మంది సన్నాసులు, వెన్నెముకలేనోళ్లు ఆంధ్రోళ్ల తొత్తులుగా ఉన్నరు. పొన్నాల ఇంటి వెనకాల పొలం ఎండిపోతున్నా, ఆయన మాత్రం అంతా బాగా ఉందని హైదరాబాద్‌లో ప్రకటనలు చేస్తూ ఆంధ్రోళ్లకు తొత్తుగా మారాడు. ఇలాంటి వాళ్లను తిగిరి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారా? 
            విద్యావ్యవస్థ గురించి తెలియని ఐఏఎస్‌లు ఏసీ గదుల్లో కూర్చొని దిక్కుమాలిన పాలసీలతో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. ఈ విధానాల ఫలితంగా 1200 పాఠశాలలు మాయమైనయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటది. కులాలవారీగా హస్టళ్లు ఉండవు. హాస్టల్స్ స్థానంలో రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి కుల,మత,జాతులనే తేడాలేకుండా ఒకే డ్రెస్ కోడ్, సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెడ్తం. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాం. ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అవసరమైతే నెల్లుట్ల రవీందర్‌రావు వంటివారిని ఎమ్మెల్సీగా బరిలోకి దింపుతాం. గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లుట్ల రవీందర్‌రావు దంపతులను కేసీఆర్ సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, మొలుగూరి భిక్షపతి, పొలిట్‌బ్యూరో సభ్యులు కెప్టెన్ లక్షీకాంతరావు, రామగళ్ల పరమేశ్వర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎన్ సుధాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు బక్క నాగరాజు, టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment