- ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అన్నిరంగాలకు పెద్దపీట
- రూ. లక్ష లోపు రైతు రుణాలు మాఫీ
- నిరుపేద దళితులకు మూడెకరాల భూమి
- అందరికీ సొంతిల్లు.. రూ. రెండు లక్షలతో డబుల్ బెడ్‌రూం
- 10 జిల్లాల తెలంగాణ.. 24 జిల్లాలుగా ఏర్పాటు
- తండాలు గ్రామ పంచాయతీలుగా గుర్తింపు
- గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు
- వక్ఫ్ భూముల రక్షణకు ప్రత్యేక చట్టం
- కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని పుష్కరకాలంగా అవిశ్రాంతంగా ముందుకు తీసుకెళ్తున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాము ఏం చేస్తామో ప్రకటించారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పచ్చని తెలంగాణ తన కల అని, అది నెరవేర్చేందుకు వ్యవసాయంతో పాటు అన్నిరంగాలకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రజలను అభివృద్ధిబాటలో నడిపిస్తామని శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన టీఆర్‌ఎస్ 12వ ఆవిర్భావ సభలో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, బ్రాహ్మణులు, స్వర్ణకారులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, విద్యార్థులు... ఇలా ప్రతి వర్గానికి మేలు చేసేందుకు పథకాలను ఆయన ప్రకటించారు. స్వీయ రాజకీయ శక్తిగా అవతరించి, శాసించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు.
కేసీఆర్ ప్రకటించిన వరాలు...
ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతమున్న తెలంగాణ పది జిల్లాల స్థానంలో 24 జిల్లాల ఏర్పాటు (ప్రతి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా చొప్పున) చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకువస్తామని, నిరంతరాయంగా 8 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను రెండు విడతలు అందజేస్తామన్నారు. ఐదు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి మిగులు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూరగాయల సాగుకు పెద్ద పీట వేస్తామని, అందుకు గ్రీన్‌హౌస్ కల్టివేషన్ పద్ధతి అమలు చేస్తామని, ఈ పద్ధతి ద్వారా కూరగాయల ఉత్పత్తి నాలుగింతలు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పచ్చని తెలంగాణ తన కల అని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని 21 లక్షల మంది రైతులకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని, రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు అవసరమైన పథకాలన్నీ అమలు చేస్తామని, మార్కెటింగ్, గిట్టుబాటు ధర, రుణ సౌకర్యాలు, వివిధ పంటల పరిశోధన కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, ఎక్కడబడితే అక్కడ ఉన్న భూములను ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, దీనికి కమతాల ఏకీకరణ కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా భూముల బదిలీ చేపడతామని ప్రకటించారు. భూముల యజమానులతో సంప్రదించి, వారిని ఒప్పించి భూములు ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడులను ఒకసారి ప్రభుత్వ భరించడం, పెట్టుబడులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులకు అవకాశం కల్పించడం, వ్యవసాయానికి అవసరమైన నీళ్లు ఉచితంగా అందించడం వంటి చర్యలు కూడా తీసుకుంటామన్నారు.
గ్రామపంచాయతీలుగా తండాలు
కనీస అవసరాలు లేకుండా బాహ్యప్రపంచానికి ఆమడ దూరంగా ఉన్న లంబాడ తండాలకు గ్రామ పంచాయతీలుగా గుర్తింపు కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. గ్రామ పంచాయతీలుగా మారిన తండాల్లో ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ముస్లిం మైనారిటీలకు కూడా 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. వక్ఫ్ భూములను కాపాడేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని వెల్లడించారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను ముస్లింలకే దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. వెనుకబడిన తరగతుల వారికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, జనాభాలో యాభై శాతానికి మించి ఉన్న బీసీలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని, ప్రభుత్వ పరంగానే విద్యార్థులకు యునిఫాంలు, పుస్తకాలు, బూట్లు పంపిణీ చేస్తామన్నారు. అన్ని కులాలవారిని కలిపి ఒకే చోట స్టేట్ రెసిడెన్సియల్ హాస్టల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ కులాల ప్రస్తావన అనేది ఉండదని, సీబీఎస్‌ఈ సిలబస్ విద్య అందజేస్తామని, స్టేట్ రెసిడెన్సియల్ హాస్టల్ నుంచి ఒక్క బ్యాచ్ బయటికి వెళితే చాలు ప్రపంచ స్థాయి పోటీలను తట్టుకునే విధంగా ఉంటారని, ఇది తన జీవిత కల అని కేసీఆర్ వెల్లడించారు.
వృద్ధులకు, వికలాంగులకు భరోసా
వృద్ధులకు రూ. వేయి, వికలాంగులకు రూ. 1500 పింఛన్లు అందజేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాల భూమికి సాగు నీరు అందిస్తామని, సింగరేణిలో కొత్త గనులను ప్రారంభిస్తామని, ప్రస్తుతమున్న విధానం వల్ల సింగరేణి కార్మికులకు నష్టం జరుగుతున్నందున నూతన గనులను ప్రారంభించే పథకంపై కసరత్తు చేపడతామని, దానికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న 81 లక్షల కుటుంబాల స్థితిగతులపై సర్వే జరిపించి, ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వారికున్న వసతులేంటీ?, వారి జీవనం ఎలా సాగుతోంది?, వారికి అవసరమైన సౌకర్యాలేమిటీ? వంటి అన్ని అంశాలపై సర్వే ద్వారా తెలుసుకొని, ఈ సర్వే ఆధారంగా ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ సొంతిల్లు ఉండేలా చూస్తామని, రెండు లక్షల రూపాయల ఖర్చుతో డబుల్ బెడ్‌రూం నిర్మింపజేస్తామని చెప్పారు. ఇంకా.. ‘మంచినీటి సౌకర్యాలు పకడ్బందీగా అమలు. ప్రతి ఇంటికి తాగునీరు అందే విధంగా చర్యలు. ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలో అమలు చేస్తున్న విధంగా తాగునీటి పథకం తెలంగాణవ్యాప్తంగా అమలు’ చేపడతామని కేసీఆర్ వెల్లడించారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని, చేనేత, బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్‌లో కల్లు నిషేధాన్ని ఎత్తివేస్తామని, గీత కార్మికులను అన్నిరకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని,అదేవిధంగా దేవాలయాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం లేకుండా చేస్తామని, ఇందులో రాజకీయ కమిటీలు ఉండవని, దేవాదాయ శాఖను రద్దు చేస్తామని, వేద పండితులతో కూడిన ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తామని, తెలంగాణలో కాంట్రాక్ట్ విధానం ఉండదని, అంతా పర్మినెంట్ ఉద్యోగాలేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ జీతభత్యాలు అందజేస్తామని, ప్రతి ఉద్యోగికి మెరుగైన జీతభత్యాలు అందిస్తామని,సర్వీసు రూల్స్ కూడా సరళీకృతం చేస్తామని, ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
-(టీ మీడియా)
No comments:
Post a Comment